ఈసారి కూడా ఆ దేవాలయం సెంటిమెంట్ ను వదలని కేసీఆర్!

జాతకాలను, నక్షత్ర బలాలను, సెంటిమెంట్ ను, దైవబలాన్ని ఎక్కువగా నమ్మే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను రాజకీయంగా ఏ పని చేసినా సిద్ధిపేట సమీపంలోని కోనాయపల్లిలో ఉన్న దేవాలయంలో పూజలు చేసిన తరువాతనే ప్రారంభిస్తారన్న సంగతి తెలిసిందే. దీన్నే ఆయన మరోసారి పునరావృతం చేయనున్నారు. కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యే కావడానికి ముందు నుంచే కోనాయపల్లి ఆలయం సెంటిమెంట్ ను ఆయన ఫాలో అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కరీంనగర్ బహిరంగ సభకు ముందు కూడా ఈ గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 2009లో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వేళ సైతం, ఈ గుడిలో పూజలు చేసిన తరువాతే ఉపక్రమించారు. ఇలా అన్ని సందర్భాల్లో ఈ ఆనవాయితీని కొనసాగించిన కేసీఆర్, కీలకమైన అసెంబ్లీ రద్దుకు ముందు కూడా ఈ గుడికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.