ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందచేసే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుకపై కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది.

ఇసుక.. ఇక చవక

ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందచేసే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుకపై కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త ఇసుక విధానంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆంధ్రా బ్యాంకు పేరును యథాతథంగా కొనసాగించేలా ప్రధానిని కోరాలని, ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని, శ్రీరామనవమి నుంచి పెంచిన వైఎస్సార్‌ పెళ్లి కానుకను అమలు చేయాలని, జాతీయ పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ..

ఇసుకపై ఇదీ విధానం..
రాష్ట్రంలో ఇసుక తవ్వకం, రవాణాను ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) చేపట్టనుంది. ఇసుకపై పర్యావరణ హితమైన కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది. ప్రజలకు సరసమైన ధరకు ఇసుక లభించేలా కొత్త విధానాన్ని రూపొందించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే భారీగా ధర తగ్గిస్తూ, పారదర్శకంగా నేరుగా వినియోగదారులకు ఇసుక చేరవేయనున్నారు. బుధవారం నాటికి 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్టోబరు నాటికి వీటిని 70 నుంచి 80 వరకు పెంచనున్నారు. స్టాక్‌ పాయింట్లను క్రమేణా మరిన్ని పెంచనున్నారు. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా ఖర్చును నిర్థారించారు.