ఇంటి నంబర్ల కోసం డ్రోన్‌ సర్వే

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఏర్పాట్లు
ఇళ్ల సంఖ్య తేలితే ఆస్తి పన్ను పెరిగే అవకాశం
హైదరాబాద్‌లో డ్రోన్‌ సర్వే ద్వారా వీధి నంబర్లు, ఇంటి నంబర్ల వ్యవస్థ ప్రక్షాళనకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో 22 లక్షల ఇళ్లు, భవనాలున్నాయని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ దగ్గర వాటికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు. 14.50 లక్షల భవన యజమానుల నుంచి మాత్రమే ఆస్తి పన్ను వసూలవుతోంది. ఎన్ని ఖాళీ స్థలాలున్నాయన్న వివరాలు కూడా జీహెచ్‌ఎంసీ దగ్గర లేవు. ప్రస్తుతం ఉన్న డోర్‌ నంబర్ల వ్యవస్థ సరిగా లేక అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది ఎవరి చిరునామా అయినా సులభంగా తెలిసేలా ఏర్పాట్లు చేయమని అధికారులను ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు మూసాపేట ప్రాంతంలో శాటిలైట్‌ ఇమేజ్‌ను తీసుకుని దీని ఆధారంగా అక్కడ 70 వేల భవనాలున్నాయని తేల్చారు. ఇప్పటి వరకు 50 వేల భవనాలను గుర్తించి నంబర్లు కేటాయించారు. బల్దియా జాబితాలో లేని 1,500 భవనాలను కొత్తగా గుర్తించారు. మిగిలిన 20 వేల భవనాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేసమయంలో కొంతమంది నిపుణులతో రెండురోజుల కిందట జీహెచ్‌ఎంసీ అధికారులు మాట్లాడారు. డ్రోన్‌తో సర్వే చేస్తే మరింత ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు. దీంతో మొదట కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేయించాలని బల్దియా కమిషనర్‌ జనార్దనరెడ్డి నిర్ణయించారు. ఆ తర్వాత ఈ రెండు విధానాల్లో దేనికి తక్కువ ఖర్చవుతుందో దాని వైపు మొగ్గు చూపవచ్చని అనుకుంటున్నారు. సీనియర్‌ అధికారులు మాత్రం డ్రోన్‌ సర్వే మరింత కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. 62 రోజుల్లోనే పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. నాలా ఆక్రమణలపై ఇటీవల అధికారులు డ్రోన్‌ సర్వే విజయవంతంగా చేశారు.
ఆదాయం పెరుగుతుంది..: బల్దియాకు ఏటా ఆస్తి పన్ను రూపంలో రూ. 1200 కోట్ల వరకు వసూలవుతోంది. కొత్త సర్వే ద్వారా భవనాలు సంఖ్య పెరుగుతుంది కాబట్టి 20 శాతానికి పైబడి ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి డోర్‌ నంబరుకు అనుబంధంగా ఆ భవనం అనుమతి, ఆస్తి పన్ను, మంచినీరు, విద్యుత్తు కనెక్షన్లు తదితర వివరాలతో డేటా బేస్‌ తయారు చేయనున్నారు.