jagan attack

ఆ యువ‌కుడు క‌త్తితో జ‌గ‌న్ మెడ‌ను టార్గెట్ చేశాడా?

షాకింగ్ ప‌రిణామం విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది. నాంప‌ల్లి కోర్టులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్ట్‌కు వ‌చ్చిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై క‌త్తితో ఒక యువ‌కుడు దాడికి పాల్ప‌డ్డాడు. ప్రాధ‌మిక స‌మాచారాన్ని చూస్తే.. జ‌గ‌న్ పై క‌త్తితో దాడి ప‌క్కా ప్లాన్ తోనే జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. విశాఖ విమానాశ్ర‌యానికి వ‌చ్చిన జ‌గ‌న్‌.. తాను ప్ర‌యాణించాల్సిన ఫ్లైట్‌కు టైం ఉండ‌టంతో వీఐపీ లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు టీ ఇచ్చేందుకు ఎయిర్ పోర్ట్ లోని ఫ్యూజ‌న్స్ ఫుడ్స్ నుంచి టీ తీసుకొని వెయిట‌ర్ జానివెల్లి శ్రీ‌నివాస్ జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. 160 సీట్లలో మ‌నం గెలుస్తామ‌న్నా అంటూ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ముందు మంచినీటిని ఇచ్చారు. త‌ర్వాత టీ ఇచ్చారు. తాను సెల్ఫీ తీసుకోవాల‌ని కోర‌టంతో అందుకు జ‌గ‌న్ ఓకే అన్నారు. ఆ క్ర‌మంలో త‌న జేబులో ఉన్న కోడి పందెల‌కు ఉప‌యోగించే క‌త్తిని తీసుకొని.. జ‌గ‌న్ మెడ భాగాన్ని టార్గెట్ చేస్తూ.. క‌త్తితో పొడ‌వ‌బోయాడు. వెంట‌నే స్పందించిన జ‌గ‌న్ వెన‌క్కి వెళ్లారు. దీంతో.. క‌త్తి జ‌గ‌న్ భుజంలోకి దిగ‌బ‌డింది. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ప‌రిణామంతో జ‌గ‌న్ చుట్టూ ఉన్న వారంతా ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. వెంట‌నే తీరుకొన్న భ‌ద్ర‌తా సిబ్బంది ఆ కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల‌కు అప్ప‌గించారు.

ప్ర‌తి శుక్ర‌వారం నాంప‌ల్లి కోర్టుకు హాజ‌ర‌య్యేందుకుజ‌గ‌న్ విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌యాణం చేయ‌టం ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ జ‌రుగుతోంది. ప్ర‌తిసారీ ఆయ‌న‌కు కాఫీ ఇచ్చే వెయిట‌ర్ కు బ‌దులుగా ఈసారి శ్రీ‌నివాస్ ను పంపారు. త‌ర‌చూ రాజ‌కీయాల గురించి మాట్లాడ‌టం.. వైఎస్ కుటుంబం గురించి గొప్ప‌గా చెప్ప‌టం.. త‌మ అన్న కాబోయే సీఎం అని చెప్పుకోవ‌టం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్‌) 160 సీట్లు గెలుస్తామ‌ని చెప్ప‌టం లాంటివి చేసేవాడ‌ని చెబుతున్నారు. అలా జ‌గ‌న్ మీద అభిమానం చూపిన యువ‌కుడు ప‌క్కా ప్లాన్ తోనే క‌త్తితో దాడికి య‌త్నించిన‌ట్లుగా చెప్పాలి. ఇక‌.. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు ఉండే ఎయిర్ పోర్ట్‌లోకి క‌త్తి ఎలా తీసుకొచ్చారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. శ్రీ‌నివాస్ గ‌డిచిన ఆరునెల‌లుగా ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తున్నాడ‌ని.. ఆ అల‌వాటుతో భ‌ద్ర‌తా సిబ్బంది త‌నిఖీల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కోడి పందెల్లో ఉప‌యోగించే క‌త్తి కావ‌టం చూస్తే.. ముంద‌స్తుగా ప్లాన్ చేసుకొని క‌త్తిని లోప‌ల‌కు తెచ్చి ఉంటార‌ని చెబుతున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ చిన్న‌ది కావ‌టం.. భ‌ద్ర‌తా ప‌ర‌మైన క‌ట్టుబాట్లు పెద్ద‌గా ఉండ‌వ‌న్న విమ‌ర్శ ఉంది. దీన్ని అస‌రా చేసుకొని శ్రీ‌నివాస్ త‌న దుర్మార్గ ప్లాన్ ను అమ‌లు చేసి ఉంటార‌ని భావిస్తున్నారు.