ఆ మాటల్లో నిజం లేదు.. మనిషికి డబ్బే ముఖ్యం: సినీ నటుడు నాగబాబు

డబ్బు కంటే మంచి, మానవత్వం ముఖ్యం అనేవి ఉత్తిమాటలే
‘ది రిచ్చెస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ బాబిలాన్‌’ అనే పుస్తకం చదవాలంటూ సూచన
డబ్బున్నవాడిదే రాజ్యమన్న నాగబాబు
డబ్బు కంటే మానవత్వం, వ్యక్తిత్వం చాలా గొప్పవని అందరూ అంటుంటారని, నిజానికి వాటన్నింటికంటే డబ్బే ముఖ్యమని ప్రముఖ నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. తన యూట్యూబ్ చానల్‌లో తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమని, దానిని సద్వినియోగం చేసుకోగలిగితే ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

డబ్బుల్లేక తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, 49 ఏళ్ల వయసులో దాని విలువ బాగా తెలిసొచ్చిందని నాగబాబు పేర్కొన్నారు. తాను డబ్బులను దుర్వినియోగం చేయలేదని అయితే, డబ్బు సంపాదించాలన్న కసి మాత్రం తనలో పెరిగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలా డబ్బు సంపాదించానని, మీరు కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుంచే డబ్బు సంపాదించాలని సూచించారు. ఈ సందర్భంగా ‘ది రిచ్చెస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ బాబిలాన్‌’ అనే పుస్తకం చదవాలని అభిమానులకు సూచించారు. ఇది చదివితే డబ్బు ఎందుకు సంపాదించాలి? అది ఎలా ఉపయోగపడుతుంది? అన్న విషయాలు తెలుస్తాయని అన్నారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారే బలవంతులని నాగబాబు పేర్కొన్నారు.
Tags: nagababu, janasena party,the richest man in babylan book