ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ?

దశాబ్దాల క్రితం దాశరథి అడిగిన ప్రశ్న ఇది . ఇండోనేషియాలో సముద్రం మధ్యలో అగ్ని పర్వతం బద్దలయ్యింది . సముద్రమంత నీళ్లు కూడా ఆర్పలేని అగ్ని ఇది . వందలమంది బూడిదయ్యారు . కొన్ని వందల మంది గాయపడ్డారు . ఇదివరకెప్పుడో అక్కడే ఇలాగే అగ్ని పర్వతానికి 36 వేలమంది కాలిపోయారు .

కవి భవిష్యత్తును దర్శిస్తాడు . లేదా ఒక్కోసారి కవి వాక్కు నిజమై తీరుతుంది .

———————–
ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో ?

ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ?

భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో ?

ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ?

ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో ?

అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో ?

కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో ?

అణగారిన అగ్నిపర్వతం
కనిపెంచిన లావా ఎంతో ?

ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ?

పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో ?

గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ?

కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ?

భరతావని బలపరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో ?

-దాశరథి
———————-

శుభోదయం
-పమిడికాల్వ