ఆ కమిటీ సంగతేంటి?.. మంత్రులు, అధికారులపై మండిపడిన చంద్రబాబు

కేబినెట్ భేటీలో బోటు ప్రమాదంపై చర్చ
ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తే లాభం లేదన్న సీఎం
పటిష్ట జల రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశం
కేబినెట్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటనపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు.. ప్రమాదాలు జరిగిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకుంటే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై వేసిన కమిటీ సంగతేంటని? ఆ కమిటీ ఇప్పటి వరకు ఎందుకు నివేదిక సమర్పించలేదని ప్రశ్నించారు. మంత్రులు, అధికారులు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే లాభం లేదని, మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఇకపై నదీ ప్రమాదాలు జరగకుండా విదేశాల్లో ఉన్నట్టు జల రవాణాకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.