ఆర్.ఎస్.ఎస్ పథ ‘సంచలనం’ – మారుతున్న దేశ గమనం  

ఆర్.ఎస్.ఎస్ పథ సంచలనం‘ – మారుతున్న దేశ గమనం  

{గుడ్లవిల్లేటి మురళి ప్రత్యేక వ్యాసం }

ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ఆర్.ఎస్.ఎస్ పాత్ర, ఆర్.ఎస్.ఎస్ నిర్వహించే పథసంచలన్ (రూట్ మార్చ్) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చేతిలో పొడవాటి కర్ర – దండ్ ను పట్టుకుని నగర రహదారులపై ఒక పధ్ధతి ప్రకారం చేసే ఈ విన్యాసం చర్చనీయాంశమైంది. ఇటీవల హైదరాబాద్,విజయవాడతో పటు అనేక ప్రాంతాల్లో వేలాది స్వయంసేవకులు జరిపిన ఈ ప్రత్యేక పథసంచలన్ శక్తి ప్రదర్శనగా తలపించింది. అయితే పథసంచలన్ ఏమిటి ఎందుకు ఆర్.ఎస్.ఎస్ దీనిని ఒక ప్రధాన భాగంగా ఎంపిక చేసుకుందో చూద్దాం…

95 సంవత్సరాల క్రితం  నాగపూర్ లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖోప శాఖలుగా విస్తరించి ఇపుడు దేశంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా తన ప్రభావాన్ని చాటుతోంది. భారతదేశానికి హిందూ సంస్కృతి ఒక జీవన విధానం.. అది ఈ దేశానికి శ్వాస వంటిది. జాతి అంటే కేవలం కోట్లాది మంది జనాభానో, సరిహద్దు రేఖలో కాదు దానికి ఒక నాగరికత, సంస్కృతి సంప్రదాయం, జీవన విధానం అనేది ఉండాలి, అది నలుగురిని కలిపి ఉంచాలి. ఈ ఐక్యత స్వాతంత్ర్య పోరాటం, అంతకు ముందు చరిత్రలో కూడా కోల్పోయింది కాబట్టి ఆర్.ఎస్.ఎస్ ఆవిర్భవించింది అని ఆనాడే సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ తన ఆలోచన విధానాన్ని స్పష్టం చేసారు. నాలుగు గోడల మధ్యో, లేక మైదానంలోనో ఆటలు, పాటలు, ప్రసంగాలు మాత్రమే కాకుండా ప్రజల మధ్యకు కూడా వెళ్లి ఒక ఉత్సాహాన్ని, దేశభక్తిని జనంలో జాగృతం చేయాలి అనే ఆలోచన డాక్టర్ హెడ్గేవార్ మదిలో మెదిలింది. ఈ ఆలోచనతో మొదటిసారి ‘పథసంచలన్’ 1926 సంవత్సరంలో నాగపూర్ లో 30 మంది స్వయంసేవకులతో నిర్వహించారు డాక్టర్ హెడ్గేవార్. మొదటిసారిగా సంప్రదాయ వాద్య విభాగం ఘోష్ తో కలిసి పథసంచలన్ ను 1928లో నిర్వహించారు. అయితే స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ దూకుడుని, వివిధ ఆందోళనల్లో స్వయంసేవకుల భాగస్వామ్యాన్ని చూసి ఓర్వ లేక బ్రిటిష్ ప్రభుత్వం 1928లో  ఆర్.ఎస్.ఎస్ గణవేశ్ (యూనిఫామ్), పథసంచలన్ ను నిషేధించింది. అయితే కొన్ని వర్గాల ప్రజల నుండి, స్వాతంత్ర్య పోరాట నాయకుల నుండి ఒత్తిడికి ఆ నిషేధం ఎంతో కాలం నిలవలేకపోయింది.

 

రిపబ్లిక్ పెరేడ్ లో ఆర్.ఎస్.ఎస్ ప్రత్యేక ఆకర్షణ:

ఆర్.ఎస్.ఎస్ అనుదినం ప్రవర్ధమానం అవుతున్న తీరు వల్ల స్వాతంత్య్రం ముందు తర్వాత కూడా అనేక ఆటు పోట్లు తప్పలేదు. నిషేధాలు విధించారు, అందలమూ ఎక్కించే ప్రయత్నం చేశారు అప్పటి పాలకులు. అందుకే 1963 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్రప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్ ను కోరింది. ఒక మంచి సందర్భం కాబట్టి  దీనితో 3000 మంది స్వయంసేవకులు రిపబ్లిక్ పెరేడ్ లో పూర్తి యూనిఫామ్, ఘోష్ వాదనతో రూట్ మార్చ్ చేసి అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో పథసంచలన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరిగాయి. అత్యధిక సంఖ్యలో కర్ణాటక, కేరళలో జరిగిన సందర్భాల్లో వేలాది మంది స్వయంసేవకులు పాల్గొని అందరికి తమ ప్రత్యేకత ను చాటుకున్నారు.

ఆర్.ఎస్.ఎస్ లో జరిగే ప్రతి కార్యక్రమం సంఘటిత శక్తి, అనుశాసనం, సేవా తత్పురత తో ముడిపడి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ పరంపరలోనే ఆర్.ఎస్.ఎస్ లో పథసంచలన్ అనేది చాలా కీలకమైన అంశం. పూర్తి గణవేష(యూనిఫామ్)తో స్వయంసేవకులుగా  పదం పదం కలుపుతూ, రాగయుక్త వాద్య తాళంతో పౌర నివాస  ప్రాంతాల నుండి ప్రజలందరూ తిలకించేలా చేసే విన్యాసమే పథసంచలన్. దేశంలో ఏ మూల పథసంచలన్ జరిగినా కుల, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా ఎం.పీలు, మంత్రులు, ముఖ్యమంత్రులే కావచ్చు సామాన్య వ్యక్తులే కావచ్చు, పెద్ద స్థాయిలో ఉన్న అధికారే కావచ్చు, కింది స్థాయి ఉద్యోగే కావచ్చు  ఎవరైనా స్వయంసేవకులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సంస్కృతే ఆర్.ఎస్.ఎస్ లో ఉంటుంది. భారత సైనిక దళాలు మార్చ్ ఫాస్ట్ ఎలాగైతే చేస్తాయో అదే మాదిరిగా ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు విజయదశమి, గణతంత్ర దినోత్సవం వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేతిలో  (దండ్ అని పిలిచే) పొడవాటి కర్రను పట్టుకుని ఒక క్రమ పద్ధతిలో వీధుల్లో నడుచుకుంటూ వెళ్తారు. ‘మేము చేసే పథసంచలన్  జాతీయత భావాలను పాదుకొలిపే ఒక సాధనం కావాలి. సామాజిక చైతన్యానికి ప్రేరణ కావాలి. దేశ వైభవాన్ని నలు దిక్కులకు చాటే ఘోష్ నాదం కావలి…’ అని స్వయంసేవకులు అంటుంటారు.

పౌరసత్వ సవరణ చట్టం పై అనుకూల వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో ఇటీవల హైదరాబాద్ లో వేలాది మంది స్వయంసేవకులతో నిర్వహించిన ఆర్.ఎస్.ఎస్ పథసంచలన్ దేశ వ్యాప్తంగా ఒక కుదుపు కుదిపింది. అయితే ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్ పర్యటన సందర్బంగా తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన సంకల్ప శిబిరం అది. సి.ఏ.ఏ, ఎన్నార్సీ లతో ఆ పథసంచలన్ కి సంబంధం లేకపోయినా దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై మాత్రం సమీక్ష చేసింది.