ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ!

118 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
మ్యాజిక్ ఫిగర్ కన్నా ఆరు స్థానాలు అధికం
సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు!
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ ప్రస్తుతం ఒకచోట విజయం సాధించి, 118 చోట్ల ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న స్థానాల సంఖ్య 65 నుంచి 57కు పడిపోగా, జేడీఎస్ 44 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 112 కాగా, బీజేపీ సునాయాసంగా ఆ మార్కును అధిగమించేలా కనిపిస్తుండగా, జేడీఎస్ తో ఎటువంటి పొత్తూ లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యడ్యూరప్ప సిద్ధమవుతున్నారు. తాను 15వ తేదీ సాయంత్రం ఢిల్లీకి వెళ్లి, ఆపై 17వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నానని మూడు రోజుల క్రితం యడ్యూరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఆశలపై నీళ్లు… అతిపెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ!
107 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
బెంగళూరులో మినహా మరెక్కడా ప్రభావం చూపని కాంగ్రెస్
సంబరాలు ప్రారంభించిన బీజేపీ నేతలు
కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి, కనీసం జేడీఎస్ మద్దతుతోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆశలపై కన్నడిగులు నీళ్లు కుమ్మరించారు. ఒక్క బెంగళూరు ప్రాంతంలో మినహా మరెక్కడా కాంగ్రెస్ హవా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తున్న వేళ, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకువెళుతోంది.

జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆ పార్టీ చేరుతుందని అంచనా. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమై ట్రెండ్స్ వెలువడుతుండగా, బీజేపీ 107 చోట్ల, కాంగ్రెస్ 71 చోట్ల, జేడీఎస్ 42 చోట్ల, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నాయన్న ఆనందంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు ప్రారంభించారు.

బోణీ కొట్టిన బీజేపీ… తొలి విజయం నమోదు చేసిన ఉమానాథ్!
ఫలితాల వెల్లడి షురూ
కోటాయాన్ లో గెలిచిన ఉమానాథ్
బళ్లారి జిల్లాలో ‘గాలి’ హవా
కన్నడనాట ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకూ ట్రెండ్స్ మాత్రమే వస్తుండగా, తొలి విజయాన్ని బీజేపీ నమోదు చేస్తూ బోణీ కొట్టింది. కోటాయాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఉమానాథ్ విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 9 నియోజకవర్గాలున్న జిల్లాలో ఆరు చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బెంగళూరు నగరంలో కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ తన పట్టును నిలుపుకోగా, ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.

జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు ఆజాద్, గెహ్లాట్!
హంగ్ దిశగా ఫలితాలు
జేడీఎస్ కు డిప్యూటీ సీఎం పదవి
చర్చలు మొదలు పెట్టిన కాంగ్రెస్ నేతలు
కర్ణాటకలో హంగ్ ప్రభుత్వమే రానుందన్న సంకేతాలకు బలం చేకూర్చేలా ఫలితాలు వెల్లడవుతున్న వేళ, ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్)తో మంతనాలు ప్రారంభించింది. ఫలితాలు హంగ్ దిశగా వస్తాయని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, జాతీయ రాజకీయాల్లో తలపండిన గులాంనబీ ఆజాద్, గెహ్లాట్ తదితరులను నిన్ననే బెంగళూరుకు పంపగా, ప్రస్తుతం జేడీఎస్ నేతలతో వారు చర్చలు ప్రారంభించారు.

ఇప్పటికే హంగ్ తప్పదని తేలడంతో జేడీఎస్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకుంటే, జేడీఎస్ ను ఎన్డీయేలో చేర్చుకుని ఆ పార్టీ నేత కుమారస్వామిని సీఎం చేసేందుకు తమకు అభ్యంతరం లేదని బీజేపీ సైతం సంకేతాలు పంపింది. ఏదిఏమైనా, కన్నడనాట రాజకీయం రసవత్తరంగా మారుతోంది.