అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విలెలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఓ వీడియో గేమ్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా అక్కడున్న జనంపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కాల్పులు జరిపిన నిందితుడు సహా మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. అందులో 11 మందికి బుల్లెట్ గాయాలు కాగా.. మరో ఇద్దరికి ఇతర గాయాలైనట్లు స్థానిక పోలీస్ అధికారులు ట్వీట్ చేశారు. ఈ కాల్పుల ఘటనలో మరో అనుమానితుడు కూడా ఉన్నట్లు చెప్పారు. 24 ఏళ్ల శ్వేత జాతీయుడు బాల్టిమోర్‌కు చెందిన డేవిడ్ కట్జ్ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నాం. ఇంకా దీనిని ధృవీకరించాల్సి ఉంది. బాల్టిమోర్ పోలీసులకు ఎఫ్‌బీఐ విచారణలో సహకరిస్తున్నది అని పోలీస్ అధికారులు వెల్లడించారు.

అనుమానితుడి వాహనం స్వాధీనం చేసుకున్నామని, అతడు శనివారం రాత్రంతా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడని చెప్పారు. షికాగో పిజ్జాలో వీడియో గేమ్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఫ్లోరిడాలో ఇలాంటిదే కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఓ స్కూల్‌పై సాయుధుడు దాడి చేయడంతో ఏకంగా 17 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
TAGS: Mass Shooting,Florida Shooting,Jacksonville,Miami,America,David Katz