అమీర్‌పేట్‌లో టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ...అర్ధరాత్రి ఉద్రిక్తత

అమీర్‌పేట్‌లో టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ…అర్ధరాత్రి ఉద్రిక్తత

లాడ్జి వద్దకు వచ్చి సనత్‌నగర్‌ టీడీపీ అభ్యర్థి మంతనాలతో అనుమానాలు
డబ్బు పంచుతున్నారంటూ గొడవకు దిగిన టీఆర్‌ఎస్‌ వర్గీయులు
గుంటూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేట్‌లో టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ కారణంగా ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో వివాదం మొదలయింది. పోలీసుల కథనం మేరకు…సనత్‌నగర్‌ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్‌గౌడ్‌ అర్ధరాత్రి అమీర్‌పేట్‌లోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వీరారెడ్డి, సాంబశివ, కొలిశెట్టి శ్రీనివాస్‌తోపాటు మరో వ్యక్తి ఈ లాడ్జిలో బస చేసి ఉండగా వారితో మాట్లాడుతున్నారు.

దీనిపై సమాచారం అందడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు లాడ్జి వద్దకు చేరుకుని డబ్బులు పంచుతున్నారంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని గుంటూరుకు చెందిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ వర్గీయులు దాడికి యత్నించారు. అడ్డుకున్న ఎస్‌ఐని కూడా తోసేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని తెలుసుకున్న గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

టీడీపీ నాయకుల కార్లు, బసచేసిన గదులు తనిఖీ చేశారు. కారులో లభించిన రూ.2 లక్షలు, మూడు గదుల్లో లభించిన రూ.2.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబందించి సరైన పత్రాలు చూపించక పోవడంతో స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ చెప్పారు.