అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ లక్ష్యం : ఆర్థిక మంత్రి బుగ్గన

  • 13 జిల్లాల్లోనూ సమగ్ర ప్రగతి సాధ్యం కావాలి
  • ప్రభుత్వ పరిశీలనలో రాయలసీమలో హైకోర్టు
  • యురేనియం సమస్యకు త్వరలో పరిష్కారం

అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కాకూడదన్నది వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం ఉద్దేశమని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.  కడప జిల్లా సచివాలయంలో ’నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’  అమలుపై మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, రంగనాథరాజు, అంజాద్‌భాషాతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.   కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం కారణంగా బాధిత గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. యురేనియం కర్మాగారంపై పత్రినెలా మొదటి వారంలో సమీక్ష నిర్వహించడానికి సీఎం నిర్ణయించినట్లు అయన పేర్కొన్నారు.