అభివృద్ధి పథం వీడొద్దు

  • లక్ష్యాలను సాధించబోతున్నాం
  • అహింస ఎంతో శక్తిమంతమైనది
  • చిత్తశుద్ధితో పనిచేసేవారంతా స్వాతంత్య్ర విలువల పరిరక్షకులే
  • పంద్రాగస్టు సందేశంలో రాష్ట్రపతి కోవింద్‌

ఎంతోకాలం నుంచి నిరీక్షిస్తున్న అనేక లక్ష్యాలను మన దేశం సాధించబోతున్న కీలక తరుణంలో వివాదాస్పద అంశాలు, అన్యమైన విషయాలపై చర్చలతో అభివృద్ధి పథాన్ని వీడొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హితవు పలికారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఆయన దూరదర్శన్‌ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. అహింస ఎంతో శక్తిమంతమైనదనీ, సమాజంలో హింసకు తావులేదనీ చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆచరించిన పవిత్ర మంత్రం ఇదేనన్నారు. దేశంలో ఇటీవల పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న మూక దాడుల ఘటనల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘చరిత్రలో ఇంతవరకు మనమెన్నడూ చూడని కీలకమైన కూడలిలో ఇప్పుడున్నాం. బహిరంగ మల విసర్జనకు స్వస్తి పలకడం, అత్యంత పేదరిక నిర్మూలన, అందరికీ విద్యుత్తు/ ఇళ్లు, వంటివెన్నో సాధించుకుంటున్నాం. కీలకమైన దశకు చేరిన తరుణంలో మన పథాన్ని మళ్లించే అన్యమైన విషయాలపై దృష్టి సారించనేవద్దు. క్యూలో నిల్చొన్నప్పుడు తన కంటే ముందున్న వారి హక్కులను గౌరవించడం తెలిసిన ప్రతీ భారతీయుడూ మన దేశ స్వాతంత్య్ర సంగ్రామ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవిస్తున్నట్లే. అందరం దీనికి కట్టుబడదాం’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

ఈ సేవలు అసామాన్యం
సాటి పౌరులకు ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల నుంచి ఉగ్రవాదులతో పోరాడుతున్న భద్రత బలగాల వరకు దేశానికి ఎందరో సేవలందిస్తున్నారని కోవింద్‌ కొనియాడారు. వైద్యులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యాపారవేత్తలు మొదలుకొని చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేసే భారతీయులందరూ స్వాతంత్య్ర విలువల పరిరక్షకులేనని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, వేసే పునాదులు- మన దేశం ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తాయన్నారు. ‘దేశంలో అభివృద్ధి, మార్పులు ప్రజా భాగస్వామ్యంతో శరవేగంగా, ప్రశంసనీయంగా చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో మహిళలకు ప్రత్యేక పాత్ర ఉంది. వారి స్వేచ్ఛను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. తమ అభిమతాన్ని అనుసరించి ముందుకు వెళ్లేలా, అలాంటి హక్కు వారికి కల్పించేలా చూడాల్సిన బాధ్యత సమాజంపైనా, దేశంపైనా ఉంది. విద్య ఫలితం కేవలం డిగ్రీలు, డిప్లమోలు సాధించడం కాదు. అది మరొకరి జీవితాన్ని మెరుగుపరిచేదిగా ఉండాలి. అదే సహానుభూతి. అదే సౌభ్రాతృత్వం. అదే భారతదేశం. భారత్‌ అంటే కేవలం ప్రభుత్వానిదే కాదు… దేశ ప్రజలది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

పీబీజీ సైనికులపై రాష్ట్రపతి ప్రశంసలు
ఒకటా…రెండా…ఏకంగా 245 సంవత్సరాల సుదీర్ఘ సేవా చరిత్ర కలిగిన ‘ప్రెసిడెంట్స్‌ బాడీగార్డ్‌’(పీబీజీ) రెజిమెంట్‌పై నిర్మించిన డాక్యుమెంటరీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం వీక్షించారు. ఎప్పుడో 1773 సెప్టెంబరులో నాటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌హేస్టింగ్స్‌ హయాంలో భారత్‌లో ఏర్పాటైన పీబీజీ రెజిమెంట్‌పై నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. విధినిర్వహణలో అంకితభావానికి….నిస్వార్ధ సేవాతత్పరతకు ప్రతీకగా నిలిచిన పీబీజీని చూసి తాను గర్వంతో ఉప్పొంగి పోతున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ మంగళవారం చెప్పారు. ‘‘అలుపెరుగని సేవాతత్పరత పీబీజీ సైనికుల ప్రత్యేకత. అంకితభావం, అనితరసాధ్యమైన సాహసం వారి సొంతం. వారిని చూసి ఎంతో గర్వపడుతున్నాను’ అంటూ కోవింద్‌ ఉద్ఘాటించారు. పీబీజీపై రాబిన్‌ రాయ్‌ దర్శకత్వలో నిర్మించిన ఈ డాక్యుమెంటరీకి బిగ్‌బీ అమితాబ్‌ వ్యాఖ్యానం ఓ ప్రత్యేకత. ఈ డాక్యుమెంటరీ భారత స్వాతంత్య్రదినోత్సవమైన ఈనెల 15వ తేదీన నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అవుతుంది.