అనుమానం పెనుభూతమై.. నిద్రిస్తున్న భర్తపై కత్తులతో దాడి చేసిన భార్య!

భర్తపై కూరగాయలు కోసే కత్తులతో దాడి
తీవ్రంగా గాయపడిన బాధితుడు
ఆత్మహత్య చేసుకున్న భార్య
భర్తపై పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారింది. అది కాస్తా కక్షగా మారి భర్తను అంతం చేయాలని భావించిందో ఇల్లాలు. అనుకున్నదే ఆలస్యం.. నిద్రిస్తున్న భర్తపై అర్ధరాత్రి కత్తులతో దాడి చేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..

గ్రామానికి చెందిన బొక్కా సత్యనారాయణ-తులసి (55) భార్యాభర్తలు. వీరికో కుమారుడు సోమన్నబాబు ఉన్నాడు. తులసి గత 20 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో భర్త తనను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని అనుమానిస్తూ వస్తోంది. అనుమానం మరింత పెద్దది కావడంతో అతడిని అంతం చేయాలని నిర్ణయించి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో కోడులు గర్భవతి కావడంతో ఆమెను చూసేందుకు కొడుకు వెళ్లాడు.

ఇదే అదునుగా భావించిన తులసి గురువారం అర్ధ రాత్రి దాటాక నిద్రిస్తున్న భర్తపై కూరగాయలు కోసే కత్తులతో దాడిచేసింది. భయంతో వణికిపోతూ సత్యనారాయణ ఆమె నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తాడు. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, వారు వెళ్లిన తర్వాత తులసి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.