అద్భుతాన్ని ఆస్వాదిద్దాం నేటి గ్రహణ చంద్రుడితో సెల్ఫీలు దిగుదాం

అరుదైన అరుణవర్ణ సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆస్వాదిద్దామని ఖగోళ నిపుణులు పిలుపునిచ్చారు. అరుణ వర్ణంలో మెరిసే చంద్రుడితో సెల్ఫీలు దిగి మూఢనమ్మకాలకు పాతరేద్దామని వ్యాఖ్యానించారు. గ్రహణ సమయంలో హాయిగా ఇష్టమైన వంటకాలనూ తినాలని సూచించారు. శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ఆకాశంలో ఈ అద్భుతం మొదలవుతుంది. 21వ శతాబ్దంలోనే సుదీర్ఘ(గంట 43 నిమిషాలు) సంపూర్ణ అరుణవర్ణ చంద్రగ్రహణంగా ఇది రికార్డు సృష్టించనుంది. దీనికితోడు ఇదేరోజు అరుణ గ్రహం భూమికి చేరువగా రానుంది. ‘‘దురదృష్టవశాత్తు కొంతమందిలో ఈ అరుదైన అద్భుతంపై అపనమ్మకాలు వేళ్లూనుకున్నాయి. గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదని, ఏమీ తినకూడదని వారు భావిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలను పారద్రోలుదాం. చక్కగా సెల్ఫీలు తీసుకొని ట్విటర్‌లో ఎక్లిప్స్‌ఈటింగ్‌ యాష్‌ట్యాగ్‌లో పోస్ట్‌చేద్దాం’’అని పుణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌ పరిశోధకులు నీరుజ్‌ మోహన్‌ రామానుజం పిలుపునిచ్చారు.