అది ఎగిరే రోబో అన్నీ సొంతంగా చేసుకోగలదు

భగభగ మండే కొలిమి దగ్గరకు వెళ్లడానికే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతను వెలువరించే సూర్యుడికి అత్యంత చేరువలోకి వెళ్లాలంటే ఇంకెంత జాగ్రత్తలు అవసరం? అదొక సాహసం. ఇలాంటి సాహసయాత్రను పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ చేపట్టబోతోంది. భానుడి వద్దకు వెళ్తున్న తొలి వ్యోమనౌక పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌.. ఓ ఇంజినీరింగ్‌ అద్భుతం. మానవ మేధస్సు సృష్టించిన విస్మయం.
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో సూర్యుడిపై పరిశోధనలు సాగించే హీలియోస్పియరిక్‌ ఫిజిక్స్‌ లేబొరేటరీకి అధిపతిగా ఉన్న డాక్టర్‌ ఆడమ్‌ జాబో ఈ ప్రోబ్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌కు ‘మిషన్‌ సైంటిస్ట్‌’గా ప్రయోగ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ఆడమ్‌.. ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

* సౌర జ్వాలలు భూమిని తాకడాన్ని 30 నిమిషాల్లోగా గమనించే ఉపగ్రహాలు ఉన్నాయి. సౌర తుపాన్లు.. సూర్యుడి నుంచి బయటకొచ్చాక ఫలానా దిక్కులో పయనిస్తాయని చెప్పే అధునాతన నమూనాలను నాసా, నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ రూపొందించాయి. ఇప్పుడు కొత్తగా పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అవసరమేంటి?

30-45 నిమిషాల కన్నా ముందే కచ్చితత్వంతో పసిగట్టే హెచ్చరిక వ్యవస్థల అభివృద్ధికి అవసరమైన అనేక కీలకాంశాలపై మనకు సరైన అవగాహన లేదు. సూర్యుడి ఎగువ కరోనా నుంచి బుధ గ్రహ కక్ష్య వరకూ విస్తరించిన కీలక ప్రాంతంలోని రేణువుల పూర్తి వివరాలు మన వద్ద లేకపోవడమే కారణం. మన ఉపగ్రహాలను, కమ్యూనికేషన్లను దెబ్బతీసే సౌర గాలులు, భూమిపై ప్రభావం చూపే భారీ సౌర తుపాన్లు సూపర్‌సోనిక్‌ వేగాన్ని సంతరించుకునేది అక్కడే. భూ కక్ష్య నుంచి పరిశీలనలు సాగించే సోహో, ఎస్‌డీవో వంటి ఉపగ్రహాలు.. సూర్యుడి బాహ్య పొర అయిన ఫొటోస్పియర్‌, సౌర వాతావరణం దట్టంగా ఉండే దిగువ కరోనా గురించి అనేక వివరాలను అందించాయి. అయితే ఎగువ కరోనా నుంచి దూరం జరిగేకొద్దీ అక్కడ రేణువుల సాంద్రత చాలా తక్కువగా ఉంటోంది. అందువల్ల ఆ ప్రాంతం గుండా సౌర జ్వాలలు, తుపాన్లు పయనించేటప్పుడు గుర్తించడం కష్టమవుతోంది. ఇక విద్యుదయస్కాంత క్షేత్రాలు, వేగం వంటివి అసలే కనిపించడంలేదు. సూర్యుడి కరోనాకు బుధుడికి మధ్య ఉన్న ప్రాంతంలో (10 సోలార్‌ రేడియై.. సూర్యుడి వ్యాసార్ధానికి పది రెట్లు ఎక్కువ దూరంలో)ని అయస్కాంత క్షేత్రాలు, రేణువులపై తీరుతెన్నులను పరిశీలించే మొదటి వ్యోమనౌక పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌. సౌర ఆవేశిత రేణువులకు శక్తి ఎలా వస్తోందో గుర్తించడానికీ ఈ వివరాలు అవసరం. తద్వారా అంతరిక్ష వాతావరణ హెచ్చరికల్లో కచ్చితత్వాన్ని పెంచుకోవచ్చు.

* సూర్యుడి పై పొర ఫొటోస్పియర్‌తో పోలిస్తే కొంత దూరంలో ఉన్న కరోనాలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉండటంపై అనేక సిద్ధాంతాలు వచ్చాయి. వీటిలోని వాస్తవికతను పార్కర్‌ ప్రోబ్‌ నిర్ధరిస్తుందని భావిస్తున్నారా?
మనకున్న సందేహాలన్నింటినీ పార్కర్‌ ప్రోబ్‌ నివృత్తి చేస్తుందని ఘంటాపథంగా చెప్పలేను. ప్రకృతి కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. సమాధానాలను కనుగొనే క్రమంలో మరిన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కరోనా తాపంపై వచ్చిన సిద్ధాంతాల వర్గీకరణకు ఉపకరించే పరికరాలు పార్కర్‌ ప్రోబ్‌లో ఉన్నాయి. సదరు సిద్ధాంతాలను ప్రతిపాదించినవారిని.. వారివారి సూత్రీకరణల మేరకు కొలతల ద్వారా పరిశీలించదగ్గ అంచనాలు సమర్పించాలని కోరాం. సదరు అంచనాల మధ్య వైరుద్ధ్యం.. పార్కర్‌ ప్రోబ్‌ డేటా ద్వారా వర్గీకరణకు అనువైన స్థాయిలోనే ఉంది. అయితే అంతిమంగా ఆ 0సిద్ధాంతాలన్నీ తప్పని కానీ, అసంపూర్ణంగా ఉన్నాయని కానీ తేలిపోయే అవకాశాన్నీ కొట్టిపారేయలేం.

* ఈ హెచ్చరికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంత మేర ఆర్థిక నష్టాలను తగ్గించుకోగలుగుతాం?
పార్కర్‌ పరిశీలనల ద్వారా.. కరోనా నుంచి భూమికి వచ్చే సౌర తుపాన్లు, ఇతర విధ్వంసకర పరిణామాల గమనంపై 2-3 రోజుల ముందే కచ్చితత్వంతో హెచ్చరికలు చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం సాంకేతికతతో 6-10 గంటల మేర అనిశ్చితి ఉంటోంది. తప్పుడు హెచ్చరికల సంఖ్యా ఎక్కువే. ఫలితంగా ఉపగ్రహాలు, ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థల నిర్వాహకులు అత్యవసర చర్యలను తీసుకోలేకపోతున్నారు. ఈ ఇబ్బందిని ఇప్పుడు అధిగమించొచ్చు. అయితే ఈ వ్యోమనౌక వల్ల తగ్గించుకోగలిగే ఆర్థిక నష్టాలను డబ్బు రూపంలో చెప్పడం కష్టం.
* 1859లో వచ్చిన భారీ సౌర తుపాను తరహా ఘటన నేడు చోటుచేసుకుంటే ఎలా ఉంటుంది? అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తరహాలో.. ఈ ఘటనలకూ ప్రపంచవ్యాప్త హెచ్చరిక వ్యవస్థ ఎంత మేర సాధ్యం?
ముందస్తు జాగ్రత్తలు లేకుంటే అలాంటి ఘటనతో ఆధునిక కాలంలో జరిగే అపార నష్టం ఊహకందని రీతిలో ఉంటుంది. నిజానికి 1859 స్థాయి సౌర తుపానును ‘స్టీరియో’ వ్యోమనౌక గుర్తించింది. అదృష్టవశాత్తు అది భూమి దిశగా రాలేదు. మన వద్ద ఇప్పటికే అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థ ఉంది. కొలరాడోలో అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రాన్ని ‘నోవా’ నిర్వహిస్తోంది. అది అనేక ఉపగ్రహాలు, భూమి మీదున్న పరికరాల నుంచి ఎప్పటికప్పుడు అందిన డేటాను విశ్లేషించి, సంబంధిత వినియోగదారులకు హెచ్చరికలు చేస్తుంది.

* పార్కర్‌ ప్రోబ్‌ తీరు ఒక సైన్స్‌ కాల్పనిక సాహిత్యంలా ఉంది. దాని సంక్లిష్ట డిజైన్‌ గురించి చెప్పండి.
అనేక కొత్త పరిజ్ఞానాలను ఉపయోగించాం. దాని అద్భుతమైన ఉష్ణకవచం.. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాతే సాకారమైంది. అది లేకుంటే ఈ యాత్ర అసాధ్యం. మిగతా విభాగాల్లోని డిజైన్‌ అంశాలన్నీ ఇంజినీరింగ్‌ అద్భుతాలే. సూర్యుడికి చేరువగా వెళ్లినప్పుడు వ్యోమనౌకలోని అన్ని భాగాలు ఉష్ణ కవచం వెనుక తల దాచుకుంటాయి. సౌర ఫలకాలూ వాటంతటవే ముడుచుకుపోవాలి. కానీ పూర్తిగా ముడుచుకుపోతే వ్యోమనౌకకు విద్యుదుత్పత్తి ఉండదు. అందువల్ల సూర్యుడికి కొద్దిగా, ఓరగా కనిపించేలా ఉష్ణకవచం వెనక్కి వెళ్లిపోతాయి. ఫలకాలు అంచులు మాత్రమే కొద్దిగా సౌరశక్తిని అందుకుంటాయి. సూర్యుడికి చేరువలో ఉన్నప్పుడు విద్యుదుత్పత్తికి అది సరిపోతుంది. అయినప్పటికీ ఆ ఫలకాలు తీవ్రస్థాయిలో వేడెక్కే ముప్పు ఉంది. దీన్ని అధిగమించడానికి కూలెంట్‌గా ఏ పదార్థాన్ని వాడాలన్నదానిపై తర్జనభర్జనలు పడ్డాం. అంతిమంగా సాధారణ నీరే అత్యుత్తమ కూలెంట్‌ అని తేల్చాం. సౌర ఫలకాల్లోని రక్తనాళాల్లా ఉండే చాంబర్ల గుండా శుద్ధిచేసిన, పీడనంతో కూడిన ఒక గ్యాలన్‌ నీరు ప్రవహిస్తూ వాటిని చల్లబరుస్తుంది. సూర్యుడికి దూరంగా వెళ్లినప్పుడు ఈ నీరు గడ్డకట్టిపోకుండా హీటర్లనూ ఏర్పాటుచేశాం.

* దశాబ్దాల కల అయిన ఈ వ్యోమనౌకను సాకారం చేయడంలో ఎదురైన సవాళ్లను నాసా, జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం ఎలా అధిగమించాయి?
ఉష్ణ కవచం కోసం కార్బన్‌-కార్బన్‌ కాంపోజిట్ల అభివృద్ధే ఇందులో కీలకం. దాన్ని పరిశ్రమలు అభివృద్ధి చేశాయి. కంప్యూటర్‌ పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడం కూడా వ్యోమనౌక రూపకల్పనకు దోహదపడింది. అంతిమంగా.. అనేక సంక్లిష్ట ఉపగ్రహాల రూపకల్పనలో తనకున్న విశేష అనుభవాన్ని, నైపుణ్యాన్ని రంగరించి జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీలోని ఏపీఎల్‌ రూపొందించిన అద్భుత ఇంజినీరింగ్‌ డిజైన్‌తో ఈ యాత్ర సాధ్యమవుతోంది.

* పార్కర్‌ ప్రోబ్‌లో సూర్యుడిని నేరుగా పరిశీలించే కెమెరాను ఎందుకు ఏర్పాటు చేయలేదు?
ఒకపక్కకు మాత్రమే చూసే కెమెరాను ఏర్పాటు చేశాం. కారణం.. సూర్యుడి వైపు చూస్తూ సూర్యతాపానికి కరిగిపోకుండా తట్టుకొని నిలబడేలా కెమెరాను ఎలా రూపొందించి, అమర్చాలన్నది మాకు అంతుబట్టలేదు. అయినా అది రిమోట్‌ సెన్సింగ్‌ కెమెరా. అలాంటి సాధనాలకు సూర్యుడి సామీప్యత అవసరంలేదు. దూరం నుంచి కూడా పనిచేసుకుపోగలవు.

* సూర్యుడికి చేరువలో ఉన్నప్పుడు పార్కర్‌ ప్రోబ్‌ నుంచి భూమికి సంకేతం రావడానికి 8 నిమిషాలకుపైనే పడుతుంది. అలాంటి సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వ్యోమనౌకలో ఏర్పాటుచేసిన స్వయం ప్రతిపత్తి వ్యవస్థ తీరుతెన్నుల గురించి చెప్పండి.
ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకునే సమయంలో ‘హయ్యర్‌ టైమ్‌ రిజల్యూషన్‌ డేటా’ను సేకరిస్తూ అన్ని పరికరాలనూ తానే నడుపుతుంది. సౌర ఫలకాలను, హైగెయిన్‌ ఏంటెన్నాను సందర్భోచితంగా ముడిచేసుకుంటుంది. కక్ష్యలో సూర్యుడి చేరువ దశ ముగిసిన ప్రతిసారీ డేటాను భూమికి పంపుతుంది. సూటిగా చెప్పాలంటే ఇది ఎగిరే రోబో. ఇంత సంక్లిష్టమైన వ్యోమనౌకకు ఫ్లైట్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం, దాన్ని పరీక్షించడం చాలా కష్టమైంది. ఈ ప్రాజెక్టు మొత్తంలో ఎక్కువ సమయాన్ని తీసుకున్న పని అదే.

* పార్కర్‌ ప్రోబ్‌లో ఒక మెమరీ చిప్‌ను ఉంచి, దాదాపు 11 లక్షల మంది పేర్లను అందులో నిక్షిప్తం చేశారు. ఇలా ఎందుకు చేశారు. ఎక్కడైనా గ్రహాంతర జీవులు తారసపడితే, వారికి సందేశం ఇవ్వాలనుకున్నారా?
గ్రహాంతరజీవులు తారసపడతారని మేం అనుకోవడంలేదు. పార్కర్‌ ప్రోబ్‌తోపాటు సూర్యుడి వద్దకు వెళ్లలేని మానవుల కోసం ఆ మెమరీ కార్డును ఉంచాం. ఈ ప్రాజెక్టు ఉత్సుకత భావనను ఇతరుల్లోనూ కల్పించాలన్నది మా ఉద్దేశం. ఆసక్తి ఉన్నవారు పేర్లు పంపాల్సిందిగా అంతర్జాలం ద్వారా ఆహ్వానించి చిప్‌లో నిక్షిప్తం చేశాం. ఈ యాత్రలో తామూ భాగస్వాములమయ్యామన్న భావన 11 లక్షల మందిలో ఉంటుంది.

ఉమ్మడిగా…
* భారత్‌ కూడా ‘ఆదిత్య’ పేరుతో సూర్యుడు-భూమి వ్యవస్థలోని లాంగ్రేంజియన్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్దకు ఒక వ్యోమనౌకను పంపనుంది. లోగడ చంద్రుడి కక్ష్యలో భారత్‌, అమెరికా ఉపగ్రహాలు సంయుక్తంగా పరిశోధనలు సాగించాయి. అదేరీతిలో ఇరు దేశాలూ ఉమ్మడిగా సౌర పరిశీలనలు సాగించే అవకాశం ఉందా?
ఇతర వ్యోమనౌకల భాగస్వామ్యం వల్ల నాసా యాత్రలన్నీ గణనీయంగా ప్రయోజనం పొందాయి. పార్కర్‌ ప్రోబ్‌ ఇందుకు మినహాయింపు కాదు. రేడియెల్‌ గ్రేడియెంట్ల (సూర్యుడికి దూరం జరిగేకొద్దీ చోటుచేసుకునే మార్పులు)పై శోధించడానికి భిన్న రేడియల్‌ దూరాల నుంచి అందించే బహుముఖ కొలతలు అవసరం. ఈ విషయంలో మేం ఇతర ఆర్బిటర్లు అందించే కొలతలపైన, ఎల్‌-1 సహా భూమికి చేరువలోని ఉపగ్రహాలు అందించే డేటాపై ఆధారపడతాం.