అటు.. ఇటు.. మెట్రో ‘ప్రకాశం’!

అటు.. ఇటు.. మెట్రో ‘ప్రకాశం’!

త్వరలో అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ చుక్‌ చుక్‌
మెట్రో రైలు మన నగరానికి మరింత వన్నెతెచ్చింది. ఎటువంటి ట్రాఫిక్‌ సమస్య లేకుండా ఆహ్లాదభరితమైన ప్రయాణం నగరవాసి సొంతమైంది. ఇప్పుడు త్వరలో మరో కీలక మార్గం చేరువవుతుండడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే ‘అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ 16 కి.మీ. మార్గం’… సెప్టెంబరు మొదటివారంలో మెట్రో రైలు ఈ మార్గంలో పరుగులు తీయనుంది. ఇప్పటికే మియాపూర్‌ నుంచి నాగోల్‌ 30 కి.మీ. మార్గం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 16 కి.మీ.లు సైతం కలుపుకొంటే మొత్తం 46 కి.మీ. మెట్రో అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. తద్వారా దిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రోరైలు మార్గమున్న రెండో నగరంగా గుర్తింపు దక్కించుకోనుంది. అంతేకాదు మెట్రో వ్యవస్థలో చెన్నై, బెంగళూరులను అధిగమించనుంది. ఆది నుంచి హైదరాబాద్‌కు ఉన్న ప్రాముఖ్యతే దీనిని ప్రత్యేకంగా నిలుపుతోంది. దేశ రాజధాని దిల్లీ తర్వాత రెండో రాజధానిగా పరిగణిస్తుంటారు. అందుకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులే కాదు మౌలిక వసతులు సైతం దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.