home page

యాదాద్రి లోనే బౌద్ధ స్థూపం ఆనవాళ్లు గుర్తింపు

తెలంగాణలో పురాతనమైన చరిత్ర 

 | 
Boudha statue

శాతవాహన కాలంనాటి చారిత్రక ఆధారాలు

న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లాలో తవ్వకాలు జరిపితే బౌద్ధస్థూపం లభించే అవకాశం ఉందని పురాతత్వశాఖ ఉన్నతాధికారి మునిరత్నంరెడ్డి సోమవారం ఢిల్లీలో తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చాడ గ్రామంలో క్రీస్తు శకం 3వ శతాబ్దం శాతవాహనుల కాలంనాటి రాతి అవశేషాలు బయటపడ్డాయి. సంస్కృత, బ్రాహ్మీ లిపితో ప్రభావితమైన ప్రాకృత భాషలో 'జాయేన స.. సచలోకసహిత సుచోయ' అని రాసిన రాతి ఫలకం లభ్యమైనట్లు ఢిల్లీలోని పురాతత్వ శాఖ అధికారులు సోమవారం తెలిపారు.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు చెప్పారు. 'అందరి లోకహితం కోసం' అని ఈ ఫలకంపై రాసి ఉందని తెలిపారు. గ్రామస్థులు దేనికోసమో తవ్వకాలు జరుపుతుండగా, ఈ ఫలకం లభ్యమైందని చెప్పారు. ఇలాంటి ఫలకాలు దొరికాయంటే, అవి ఒక స్థూపానికి సంబంధించినవై ఉంటాయన్న అభిప్రాయాన్ని మునిరత్నంరెడ్డి వ్యక్తం చేశారు.

కాగా, చాడ గ్రామంలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు లభించటంతో 2012లో దీనిని బౌద్ధ పరిరక్షణ కేంద్రంగా పురావస్తుశాఖ గుర్తించింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన విగ్రహాలను నల్లగొండలోని పానగల్‌ మ్యూజియంకు, అక్కడ నుంచి సాగర్‌ సమీపంలోని బుద్ధవనంకు తరలించారు. పూనే విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ హేమంత్‌దాల్వి, రాష్ట్ర పురావస్తు శాఖ రీసెర్చ్‌ స్కాలర్‌ రుషికేష్‌ ఇటీవల చాడలో పరిశోధన చేసి రాతి శాసనాన్ని గుర్తించారని దక్షిణ భారత శిల్పవిభాగం మాజీ డైరెక్టర్‌ కూడా అయిన మునిరత్నంరెడ్డి తెలిపారు.