home page

'శాశ్వత సీఎం' తీర్మానం చేస్తారేమో : రఘురామ రాజు

'ఆనం' ప్రశ్నలకు జవాబులు చెప్పడం చేతకాదా?

 | 
Raghu

శాశ్వత సీఎం అంటూ అసెంబ్లీ తీర్మానం చేసిన అతిశయోక్తి లేదు

శాశ్వత అధ్యక్షుడిగా తీర్మానం అటువంటిదే

ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని కలుస్తా

ఇప్పుడు పోటీ చేయకపోయినా... ఐదేళ్లకు పోటీ చేసే ఆసక్తి ఉండవచ్చు

ఈనాడు ఏమి బ్రహ్మాండం భజగోవిందం అనలేదు

కాకపోతే వచ్చిన వారి గురించి రాయలేదంతే...

ప్లీనరీ కు వచ్చింది 40 నుంచి 70 వేల మంది అయితే... తొమ్మిది లక్షలు హాజరయ్యారంటూ డబ్బా ఎందుకు?

ఆనం రమణారెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 25 ఏళ్ల పాటు శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనని, తమ పార్టీ వారు తీర్మానం చేసిన అతిశయోక్తి లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్లీనరీ 
తీర్మానము అటువంటిదేనని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల బిల్లును కోర్టు ఎలాగైతే ఆక్షేపించిందో, రేపు శాశ్వత ముఖ్యమంత్రి అనే తీర్మానాన్ని కూడా కోర్టు అలాగే ఆక్షేపిస్తే... అప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎంతో సేవ చేయాలని అనుకుంటే, ఆ దుష్ట చతుష్టయం తనని అడ్డుకొని అవకాశం లేకుండా చేస్తున్నారని, కోర్టును కూడా నిందించే అవకాశాలు లేకపోలేదని రఘురామ కృష్ణంరాజు ఊహాగానం చేశారు. దేశం లో 
రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనలు ఉన్నాయని, ఆ నిబంధనల మేరకు పార్టీలు నడుచుకోవాలని, నడుచుకుంటామని చెప్పి ముందే అంగీకార పత్రం ఇవ్వవలసి ఉంటుందని చెప్పారు. అలా కాదని, ఇష్టారీతిలో వ్యవహరిస్తామంటే కుదరదన్నారు. ఇదే విషయమై తాను ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారికి లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే ఆయన్ని సోమవారం మధ్యాహ్నం కలసి, చర్చించనున్నట్లు వెల్లడించారు.  దేశంలో పరిపాలనలో ఉన్న ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, వారెవరికి... జగన్మోహన్ రెడ్డికి ఉన్న తెలివి లేదా? అంటూ ప్రశ్నించారు . తమిళనాడులోని జయలలిత, కరుణానిధి పార్టీలతో పాటు, ఉత్తరప్రదేశ్ లో మూలయం సింగ్ యాదవ్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీలు ఎన్నో ఏళ్లుగా పరిపాలనలో ఉన్నప్పటికీ, శాశ్వత అధ్యక్షుల ప్రతిపాదనను తీసుకురాలేదన్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ శాశ్వత అధ్యక్షుడు ప్రతిపాదనను అంగీకరిస్తే, అన్ని పార్టీలకు జగన్మోహన్ రెడ్డి టార్చ్ బెరర్ గా ఉంటారని అపహస్యం చేశారు.. రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా ఐదేళ్లకు ఒకసారి అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి  పోటీ చేయని వారికి ఐదేళ్ల తర్వాత పోటీ చేసే ఆసక్తి ఉండవచ్చునని అన్నారు.  శాశ్వత అధ్యక్ష పదవి తీర్మానం పై,తమ , ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తే గ్రేట్ ఆంధ్ర పత్రిక కూడా ఆక్షేపించిందని గుర్తు చేశారు. 

ప్లీనరీ అట్టర్ ఫ్లాఫ్

డ్వాక్రా మహిళలు, వాలంటీర్లను తరలించి, బస్సులను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అట్టర్ ఫ్లాప్ అయిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్లీనరీ కి హాజరైన జనాభా గురించి ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వీడియో ను మీడియా ముందు ఆయన ప్రదర్శించారు. 20 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయిందన్న విజయసాయి వ్యాఖ్యలపై రఘురామ స్పందిస్తూ... చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఆపి ఏరియల్  వ్యూ ద్వారా ఫోటో తీసి, గ్రాఫిక్స్ లో మరిన్ని వాహనాలను కలిపారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ కోసం ఎన్ని చదరపు అడుగులలో షామియానాలు వేశారో... పలుచగా వేసిన కుర్చీలు ఎన్నో దాన్నిబట్టి సభకు హాజరైన జనాలను లెక్కించవచ్చునన్నారు. ప్లీనరీకి 40 నుంచి 70 వేల మంది హాజరైతే, తొమ్మిది లక్షల మంది హాజరైనట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్లీనరీకి హాజరైన జనం గురించి చెప్పుకోవడం ఎందుకనీ, పడుకున్నవానితో లేపి తన్నించుకోవడం ఎందుకన్నారు. దానికి తనకు, ఏబీఎన్ రాధాకృష్ణకు తిట్లు... ఈనాడుకు పొగడ్తలా అని ప్రశ్నించారు. ఈనాడు దినపత్రిక ఏమి బ్రహ్మాండం భజగోవిందం అని రాయలేదని, ప్లీనరీకి హాజరైన వారు ఎంతమందో మాత్రమే రాయలేదని గుర్తు చేశారు. సభకు హాజరు కావడం అంటే ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభకు హాజరైనట్లుగా హాజరు కావాలన్నారు.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన ఎద్దుల బండ్లనున కట్టుకొని ప్రజలు హాజరయ్యారని పేర్కొన్నారు.  రాష్ట్రపతి ఎన్నికలలో తాము ఎవరిని సంప్రదించలేదని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారని, తాను ఇదే విషయాన్ని గతంలో చెప్పానని గుర్తు చేశారు. 

విజయ సాయి ట్వీట్ చదివితే మళ్ళీ ఓటే వేయరు...

తమ ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తన గురించి చేసిన ట్వీట్ చదివితే, ఆ భాషను చూసి ప్రజలు మళ్లీ మా పార్టీకి ఓటే వేయరని అన్నారు. తెలుగు ప్రజలకు సెంటిమెంట్ ఎక్కువ అని, తల్లి... చెల్లి సెంటిమెంట్ లతో వచ్చిన సినిమాలన్నీ సూపర్, డూపర్ హిట్ అయ్యాయని తాను ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పానని రఘురామా వెల్లడించారు. ప్లీనరీలో ఒక మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తల్లి స్థానం విజయమ్మకు ఉన్నదని చెప్పడం పట్ల ఆమె అభిమానిగా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో విజయమ్మ, ప్రత్యేకించి షర్మిల భాగస్వామ్యం ఎంతో ఉన్నదని రఘురామ అన్నారు. 

20 అధికారులు కూడా లేనట్టేనా?

ముక్కు సూటైన 20 మంది అధికారులు ఉంటే రాష్ట్రాన్ని బాగు చేయవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... అంటే 20 మంది అధికారులు కూడా లేనట్టే కదా అర్థం అని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలోనే ఓ అధికారిని గుంజీలు తీయించారని, తిట్టారని చెప్పారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అద్వానంగా ఉందని రఘురామా అన్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ తాను క్యాబినెట్ కార్యదర్శి లేఖ రాసిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. తన తండ్రిని చంపిన తెర వెనుక  పాత్రధారులు ఎవరో బయటకు రావాలని వైఎస్ సునీతా రెడ్డి పోరాడుతున్నారని, ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి ఉన్నదని, ఆమె పట్ల ప్రజల్లో హెహ్య భావం కలిగించేలా కుట్ర చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. టిడిపి నాయకుడు ఆనం రమణ రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయి ఏవేవో మాట్లాడుతున్నారని, 1945లో మీ పెద్ద తండ్రిని మీ తండ్రి చంపింది నిజమా?,  కాదా??, 1946లో మీ తండ్రికి యావజ్జీవ జైలు శిక్ష పడింది నిజమా?,  కాదా??, సూటిగా సమాధానాలు చెప్పాలన్నారు. 

పయ్యావులకు రక్షణ సిబ్బంది తొలగించ డానికి వీలు లేదు

ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పయ్యావుల కేశవ్ కు రక్షణ సిబ్బందిని తొలగించడానికి వీలులేదని, అయితే ఆయన కదలికలు తెలుసుకోవడానికి సిబ్బందిని మార్చి, తమ అస్మదీయులని నియమించే అవకాశం లేకపోలేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రతిపక్ష, అధికారపక్షంలోని కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, సాక్షి దినపత్రికలోని కొంతమంది సిబ్బంది ఫోన్లపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న కేశవ్ వ్యాఖ్యలతోనే ఆయన రక్షణ సిబ్బందిని తొలగించి, ఇతరులను చేర్చేందుకు కుట్ర పన్ని ఉంటారని అన్నారు.