home page

రాష్ట్ర ప్రజలపై రుణ భారం 8.50 లక్షల కోట్లు

ప్రజలపై 550 శాతం అప్పుల భారాన్ని మోపిన  జగన్ సర్కార్
 | 
Raju
 ఇచ్చిన హామీలలో 98 శాతం నెరవేర్చనే లేదు

రాష్ట్ర ప్రజలపై రుణ భారం 8.50 లక్షల కోట్లు

 ఈ మూడేళ్లలో ప్రజలపై అదనంగా   550 శాతం అప్పుల భారాన్ని మోపిన  జగన్ సర్కార్

 కేవలం 43 శాతం అప్పులే చేశామంటూ , ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం 

 ఇచ్చిన హామీలలో 98 శాతం నెరవేర్చనే లేదు

 నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు 

 రాష్ట్ర ప్రజలపై ప్రస్తుతం 8.50 లక్షల కోట్ల రూపాయల రుణ భారం ఉండగా , గత మూడున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై  550 శాతం అప్పుల భారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపిందని  నరసాపురం ఎంపీ,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. గత మూడున్నర ఏళ్లలో 5.50 లక్షల కోట్ల రూపాయల అప్పులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం...అసెంబ్లీ సాక్షిగా అబద్దాలను చెబుతూ  గత మూడున్నర ఏళ్లలో  కేవలం 43 శాతం అప్పులను మాత్రమే చేశామని చెప్పి,  రాష్ట్ర ప్రజల చెవిలలో పువ్వులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటివరకు ఆర్బిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 48,600 కోట్ల రూపాయల అప్పులు చేసిందన్న ఆయన, కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులను లెక్కలోకి చూపించడం లేదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తాము చేసిన అప్పులు తక్కువేనంటూ చెప్పి, ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... టిడిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 145 శాతం అప్పులను చేశారన్న జగన్మోహన్ రెడ్డి, ఈ మూడున్నర ఏళ్లలో  కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ కు 1.20 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉండగా, టిడిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో చేసిన 1.60 లక్షల కోట్ల రూపాయల అప్పులను  కలుపుకొని మొత్తం 2.80 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు చేరుకున్నాయని తెలిపారు . అనంతరం ఈ మూడున్నర ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసిందని, ఇక లక్షన్నర కోట్ల రూపాయలు బాకీలను ప్రభుత్వ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లించవలసి ఉన్నదని చెప్పారు. ఈ మొత్తం కలిపితే ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఈ మూడున్నర ఏళ్ల కాలవ్యవధిలో రాష్ట్ర ప్రజలపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ మోపిందన్నారు .  గత టిడిపి ప్రభుత్వ హయాంలో చెల్లించవలసిన బాకీలు 23 నుంచి 25 వేల కోట్ల రూపాయల వరకు ఉండగా, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి మూడున్నర ఏళ్ల పాలనలో చెల్లించవలసిన బకాయిలు లక్షన్నర కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పారు. కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులను ఆర్ఓసీలో ఫైల్ చేయడం లేదని, కాగ్ కు ప్రభుత్వ అప్పుల  లెక్కలు చెప్పడం లేదన్నారు. సాధారణంగా మూడు నుంచి 6 నెలల వ్యవధిలో ఆర్ఓసీలో అప్పుల లెక్కలు  ఫైల్ చేయకపోతే, నోటీసులు జారీ చేస్తారని... కార్పొరేషన్ అప్పుల లెక్కలను ఏళ్ల తరబడి ఫైల్ చేయకపోయినా పట్టించుకోవడం లేదంటే, ఇందులో ఏదో గోల్మాల్ ఉన్నదని, అందుకే ఊరుకుంటున్నారని అనిపిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కొంతమంది లేఖలు రాస్తున్నారని పరోక్షంగా
అసెంబ్లీలో
తనని ఉద్దేశించి  జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్న రఘురామకృష్ణం రాజు  , అవును... కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖలు రాస్తున్నానని, సోమ నాథన్  మూడుసార్లు కలిసినట్లు, కాగ్ ను ప్రభుత్వ అప్పుల, లెక్కలు చెప్పాలని కోరుతూ తానే లేఖలు రాశానని తెలిపారు. తాను లేఖ రాసిన తర్వాతే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ లెక్కలు అడిగిందన్న ఆయన, నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న బ్రహ్మానందరెడ్డిని కూడా తొలగించిందని గుర్తు చేశారు. కార్పొరేషన్ కు అప్పుల మంజూరిలో అవకతవకలకు పాల్పడిన ఎస్బిఐ హ్యాండ్సప్ అన్నదన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనల పాల్పడి అప్పులు చేయడాన్ని ఆక్షేపిస్తూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసిందని గుర్తు చేశారు. రాష్ట్రం రోగగ్రస్తం కాకుడ దనే , మన ప్రభుత్వాన్ని ప్రజలను కాపాడుకునేందుకు తాను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నానని చెప్పారు. మనం మనం తిట్టుకుంటే బాగుండదని కాబోలు, కొట్టించే దారిలో మీరు వెళ్తున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు .

 సీఎం స్థాయికి తగదు

 ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి  విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. పచ్చళ్ళు, పాలు అమ్ముకునేది మనమేనని, కాలేజీలు, స్కూళ్లు నిర్వహించేది మనమేనని... సినిమాలు చేసేది మనమేనని... ఇదంతా పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనం అంటూ ఒక కులంపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డిని సినిమాలలో నటిస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. వాళ్లు ఏమైనా కబ్జాలు చేశారా?హత్యలు చేశారా?? అంటూ ప్రశ్నించారు. పచ్చళ్ళు పాలు పెరుగు అమ్ముకునే వ్యాపారం మాత్రమే చేశారు కదా అని పేర్కొన్నారు.  
ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మూడున్నర ఏళ్ల  పాలనలో ప్రజలకిచ్చిన  98 శాతం హామీలను నెరవేర్చినట్టుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకిచ్చిన  98 శాతం హామీలను ఆయన విస్మరించారని, ఇప్పటికీ ఏ ఒక్కటి కూడా  నెరవేర్చలేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆత్మవంచన చేసుకుని  అబద్దాలను చెబుతున్నారని విమర్శించారు. అమ్మ ఒడి ఇస్తున్నామని గొప్పలు పోతున్నారని, అందులోనూ 2000 రూపాయలు కోత విధిస్తున్నారని చెప్పారు. అమ్మ ఒడి పథకం అమలు వల్ల బీసీ  ఎస్సీ, ఎస్టీ  విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో అద్భుతమైన పథకాలు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 గతంలో అమలులో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా నేరుగా కాలేజీల యాజమాన్య ఖాతాలలోనే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓట్ల కొనుగోలులో భాగంగా తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నారని విమర్శించారు. దానితో తల్లులు స్కూలు యాజమాన్యాలకు ఫీజులు చెల్లించకపోవడంతో, స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  అమ్మ ఒడి పథకం ద్వారా అందుతున్న డబ్బులను చాల మంది తండ్రులు మద్యం ఉపయోగిస్తున్నారన్నారు. అమ్మ ఒడి డబ్బులన్ని మద్యం ద్వారా ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతున్నాయని చెప్పారు. 
 ఇక నాడు నేడు అంటూ ఊదరగొడుతున్న తమ ప్రభుత్వ పెద్దలు గత పదిహేనేళ్లుగా విద్యార్థుల వద్ద నుంచి ఇంటర్మీడియట్ బోర్డ్ వసూలు చేసి, జమ చేసిన  250 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించే ప్రయత్నాన్ని చేస్తున్నారన్నారు.

 ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వక పోవచ్చు

 హైకోర్టు ఇచ్చిన తీర్పు, 
 శాసన వ్యవస్థను అవమానించే విధంగా ఉన్నదని చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం నూటికి నూరుపాళ్లు జరగదన్న  ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు. ఈ కేసు నోటీసు కూడా ఇవ్వదగ్గది కేసు కాదని, ఏమో ఇస్తే ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఎన్నో రోజులు ఆలోచించి ఇచ్చిన తీర్పుని ఇదని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మా వాళ్లు ఎందుకు అన్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవస్థకు ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా, అవమానించే విధంగా ప్రవర్తిస్తూ... పార్లమెంటు చేసిన చట్టాన్ని, తగుదునమ్మా అంటూ అసెంబ్లీలో సవరించే ప్రయత్నం చేయడం  ఏమిటంటూ మండిపడ్డారు. పార్లమెంట్ చేసిన చట్టానికి సవరణలు చేసే అధికారం, ఒక్క పార్లమెంటుకే ఉంటుందని చెప్పారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని, అసెంబ్లీలో సవరణలు చేయడానికి వీలు లేదని హైకోర్టు తన తీర్పులో వెల్లడిస్తే,  శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ దేశంలో చట్టాలు చేయడానికి పార్లమెంటు గొప్పదా?, అసెంబ్లీ గొప్పదా?? అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు. పార్లమెంట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం జగన్మోహన్ రెడ్డి తో సహా అందరూ అంగీకరించిన తర్వాతే రాష్ట్ర విభజన చట్టాన్నిరూపొందించిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెంటనే ఏర్పడిన ప్రభుత్వానికి రాజధానిని ఎంపిక చేసే అధికారాన్ని చట్టం ద్వారా కట్టబెట్టడం జరిగిందన్నారు . రాష్ట్ర విభజన అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఉంటే మూడు రాజధానులు కాకపోతే, ఆరు రాజధానులను ఏర్పాటు చేసిన ఎవరికి అభ్యంతరం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.  పార్లమెంట్, రాజ్యాంగ వ్యవస్థలను హైకోర్టు గౌరవించిందని, ఆ పాయింట్ మీదనే ఈ కేసును కోర్టు కొట్టివేస్తుందన్నారు. విభజన చట్టంలో అన్ని విషయాలు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్న ఆయన, ఏ కోర్టు అయినా మూడు రాజధానుల బిల్లు కొట్టివేస్తుందని చెప్పారు. పార్లమెంట్ చేసిన చట్టానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని మెడ మీద తలకాయ ఉన్న వారు ఎవరు కూడా చెప్పరన్నారు . నిన్న మొన్నటి వరకు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును మళ్లీ తీసుకు వస్తానని చెప్పిన మంత్రులు, తమ పార్టీ నాయకులు ఇప్పుడు ఏమి చెబుతారన్నారు. అసెంబ్లీకి ఆ అధికారం లేదని ద్రౌపది చీరలు విప్పినట్లుగా, పూటకొక పదవి నుంచి తీసి వేస్తున్న విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ద్వారా చెప్పకనే చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే విజయ సాయి రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టానికి సవరణలు చేసే అధికారం, రాష్ట్ర అసెంబ్లీకి లేదన్న విషయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. అసెంబ్లీలో ఏమి చేయలేమని తెలిసే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం  సుప్రీం కోర్టును ఆశ్రయించిందని పేర్కొన్నారు.

 ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు

 భారత ప్రధాని నరేంద్ర మోడీకి రఘురామకృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు నూరేళ్లు మోడీ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. దేశ సమస్యలతో పాటు, ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ప్రత్యేక దృష్టిని సారించాలన్న ఆయన, తమ ప్రభుత్వ పెద్దలు చెప్పే అబద్ధాలు నమ్మకుండా, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కి  79 వ జన్మదిన శుభాకాంక్షలను రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. అజాతశత్రువు అనే పదానికి అసలైన నిర్వచనం సుబ్బిరామిరెడ్డిని వ్యాఖ్యానించారు.