home page

మోడీనోట అబద్దాల మూట

తెలంగాణ కు ఇచ్చింది తక్కువే

 | 
Modi
ఏంది అబద్దాల మోదీ..
పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా అసత్యాలు
రాష్ట్రంపై పుట్టుకొచ్చిన కపట ప్రేమ
విశ్లేషకులు చెప్తున్న నిజాలు ఇవీ!
అబ్బ బ్బో ఇదెక్కడి ప్రేమనో అంటున్నారు విశ్లేషకులు.. మరీ ఇన్ని అబద్ధాలా? అని ముక్కున వేలేసుకొంటున్నారు రాజకీయ పండితులు. దేని గురించి, ఎవరి గురించి అనుకొంటున్నారా! పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ గురించి. ఆయన ప్రసంగం గురించి. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి.. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రగతిని ఓర్వలేని వ్యక్తి.. ప్రగతికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా తెలంగాణ రాగం అందుకొన్నారని ఆశ్చర్యపోతున్నారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించారని, 'అద్దశేరు బియ్యానికి పొంగుడెక్కువ' అన్నట్టు తెలంగాణకు ఏమీ చేయని మోదీ.. డబ్బా కొట్టుకొని వెళ్లారని వ్యాఖ్యానిస్తున్నారు. నీతి ఆయోగ్‌ చెప్పినా రూ. 24 వేల కోట్లు ఇవ్వని విషయాన్ని, రాష్ర్టానికి న్యాయం గా రావాల్సిన రూ.7,103 కోట్లు ఇవ్వని విషయాన్ని మాత్రం చెప్పుకోలేకపోయారని ప్రస్తావిస్తున్నారు. మోదీ ప్రసంగంలోని నిజానిజాలను పరిశీలిస్తే..
మోదీ: తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు, రేషన్‌ ఇచ్చాం.
వాస్తవం: వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబించింది. కంపెనీల నుంచి కేంద్రానికి ఒక రేటు, రాష్ర్టాలకు ఒక ధర, ప్రైవేట్‌ దవాఖానలకు ఒక ధర నిర్ణయించింది. తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ఉచిత వ్యాక్సిన్లను నెత్తికెత్తుకొన్నది. ధరలపై సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. వ్యత్యాసాన్ని తీవ్రంగా పరిగణిస్తూ గత ఏడాది ఏప్రిల్‌ 30న కేంద్రాన్ని కడిగిపారేసింది. దీంతో అందరికీ ఒకే ధర అందుబాటులోకి వచ్చింది. ఉచిత రేషన్‌ ఇచ్చామని చెప్తున్న మోదీ.. వలస కూలీలను ఎందుకు ఆదుకోలేదో మాత్రం చెప్పలేదు. తెలంగాణ ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, రూ. వెయ్యి చొప్పున దారి ఖర్చులు ఇచ్చి పంపించింది.
మోదీ: గత ఎనిమిదేండ్లలో పేదలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం.
వాస్తవం: పూర్తిగా అవాస్తవం. అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ముంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, చేనేత కార్మికులకు రాయితీలు వంటివి ప్రత్యక్ష ఉదాహరణలు. దళితబంధు వంటి సాహసోపేతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది సీఎం కేసీఆర్‌. తెలంగాణ పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టాయి.
మోదీ: రాష్ట్రంలో నేషనల్‌ హైవేలను రెట్టింపు చేశాం.
వాస్తవం: పెట్రోల్‌, డీజిల్‌ మీద కేంద్రం 'రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌’ పేరుతో ప్రత్యేక సెస్‌ వసూలు చేస్తున్నది. ఈ నిధులనే హైవేల నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్నది. ఈ మొత్తాన్ని సెస్‌ రూపంలో కాకుండా సాధారణ పన్నులుగా వసూలు చేస్తే రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం తెలివిగా రాష్ర్టాలకు రావాల్సిన వాటా డబ్బులతోనే హైవేలు నిర్మిస్తూ మొత్తం తామే చేసినట్టు ప్రచారం చేసుకొంటున్నది. సెస్‌ను కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించడాన్ని కాగ్‌ సైతం తప్పుబట్టింది.
మోదీ: రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాం.
వాస్తవం: రామగుండం ఎరువుల కర్మాగారం పాతదే. కొన్ని కారణాల వల్ల మూతపడింది. కేంద్రం దాన్ని ఆధునీకరించింది. దానికే.. కొత్తగా కట్టినట్టు హడావిడి చేస్తున్నది. మరి ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)ను ఎందుకు పునరుద్ధరించలేదో, ఎందుకు తుక్కు కింద అమ్మాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు.
మోదీ: హైదరాబాద్‌లో రూ.1,500 కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తున్నాం.
వాస్తవం: ఈ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇవి కూడా సెస్‌ ద్వారా వచ్చిన నిధుల నుంచి చేపట్టినవే. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ)తో పోల్చితే ఇది చాలా తక్కువ. ఎస్సార్డీపీని సుమారు రూ.10వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
మోదీ: లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
వాస్తవం: జూన్‌ 7 నుంచి తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని కేంద్రం నిలిపివేసింది. రూ.లక్ష కోట్ల ధాన్యం కొన్నామని చెప్పిన మోదీ.. తెలంగాణ ప్రభుత్వ సంస్కరణల వల్లే ఉత్పత్తి పెరిగిందని, దేశానికే అన్నపూర్ణగా మారిందని మాత్రం ప్రశంసించలేకపోయారు. 2015-16లో 45.71 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2020-21 నాటికి ఇది 218.51 లక్షల టన్నులకు పెరిగింది.
మోదీ: రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తాం.
వాస్తవం: తెలంగాణ అమలు చేస్తే.. దేశం ఆచరిస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ. సీఎం కేసీఆర్‌ భవిష్యత్తును ఊహించే రాష్ట్రంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నెలకొల్పారు. ఈ మెగా ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి వందల సార్లు విన్నవించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణపై ప్రేమ పొంగుకొచ్చినట్టు డ్రామాలు చేస్తున్నారు.
మోదీ: రీజినల్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తున్నాం.
వాస్తవం: ఇది కేంద్రం సొంతగా నిర్మిస్తున్న ప్రాజెక్టు కాదు. భూ సేకరణలో 50 శాతం భరిస్తామని రాష్ట్రం చెప్పిన తర్వాతే కేంద్రం రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుమతి ఇచ్చింది. మొత్తం 8 ఫేజ్‌ల్లో నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2 ఫేజ్‌లకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఎప్పటికి పూర్తి చేస్తుందో తేలాల్సి ఉన్నది.
మోదీ: తెలంగాణలో జన్‌ధన్‌ ఖాతాలు తెరిచాం.
వాస్తవం: జన్‌ధన్‌ ఖాతాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. దేశమంతా ఖాతాలు తెరిచారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ రూ.15 లక్షలు వేస్తారని ఖాతాదారులంతా ఎనిమిదేండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.