home page

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు:జగదీష్ రెడ్డి

వరద బీభత్సంలో కూడా తక్షణ చర్యలు 

 | 

1800 విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ 

★ విద్యుత్తు సరఫరాకు ఢోకా లేదు 
★ రాష్ట్రవ్యాప్తంగా 1,800 స్తంభాల పునరుద్ధరణ
★ విద్యుత్తు అధికారులతో మంత్రి జగదీశ్‌రెడ్డి
ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండబోదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. వందేండ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనప్పటికీ కనురెప్పపాటు అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేసిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకే దక్కిందని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకొన్న నిర్ణయాల కారణంగా గతకాలపు ఇబ్బందులను అధిగమించామని చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు వ్యవస్థ పనితీరుపై బుధవారం ఆయన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో కలిసి విద్యుత్తుసౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచినట్టు తెలిపారు. ఓపెన్‌కాస్ట్‌లో నీరు చేరడం, రవాణాలో అంతరాయం ఏర్పడినప్పటికీ జెన్‌కోకు సరఫరా చేస్తున్న బొగ్గు విషయంలో సమస్యలు ఉత్పన్నం కావడంలేదని స్పష్టంచేశారు. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 2,300 స్తంభాలు నేలకొరిగాయని, వాటిలో 1,800 పైచిలుకు స్తంభాలను పునరుద్ధరించామని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని సర్వాయిపేట సబ్‌స్టేషన్‌ 33/11కేవీకి సరఫరా ఆగిపోగా, మూడు రోజుల్లో పునరుద్ధరించామని వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎడతెరిపిలేని వానల కారణంగా విద్యుత్తు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగదీశ్‌రెడ్డి సూచించారు. తడిసిన గోడలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లవద్దని సూచించారు ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.