home page

తెలంగాణ పై మళ్ళీ అదే అక్కసు

 | 
Piyush goel

నోరు పారేసుకున్న పియూష్

తెలంగాణపై మళ్లీ కేంద్ర మంత్రి అక్కసు
మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు..

అవే నిందలు
సీఎమ్మార్‌ నిరాకరణపై గోయల్‌ సాకులు
రాష్ట్రంపై బురద జల్లేందుకు పీఐబీ లీకులు
తప్పు చేసే మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు
భారమైనా ఉచితంగా రూ.4 వేల కోట్ల రైస్‌
ఇవేవీ పట్టని కేంద్రం.. రాజకీయ కక్షే లక్ష్యం
విమర్శలతో దిగొచ్చి సీఎమ్మార్‌కు అనుమతి

రాష్ట్రం నుంచి సీఎమ్మార్‌ సేకరణపై గతంలో చెప్పిన అందమైన అబద్ధాలనే కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌రెడ్డి మళ్లీ వల్లె వేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన పీయూష్‌ గోయల్‌.. వాస్తవాలను తొక్కిపెట్టి బియ్యం సేకరణపై తప్పంతా రాష్ర్టానిదే అన్నట్టు, కేంద్రం అంతా సవ్యంగా చేస్తున్నట్టు కలరింగ్‌ ఇచ్చారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా రాష్ట్రంపై బురద జల్లడమే పనిగా పెట్టుకొన్నది. ఇందులో భాగంగానే రాష్ట్రంపై నిందలు వేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకొన్నది. ఈ ప్లాన్‌ను బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అరవింద్‌, కిషన్‌రెడ్డితో పాటు పీయూష్‌ గోయల్‌ అమలు చేస్తున్నారు. ఇందుకు సాక్ష్యమే.. మంగళవారం ప్రెస్‌మీట్‌లో అరవింద్‌ చెప్పిన అబద్ధాలు, బుధవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వ సంస్థ పీఐబీ ఇచ్చిన లీకులే బుధవారం సాయంత్రం పీయూష్‌ గోయల్‌ నోట వినిపించాయి. రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పీఐబీ ద్వారా లీకులు ఇప్పించిందంటే.. మోదీ సర్కారు తెలంగాణపై ఏ స్థాయిలో కక్ష పెంచుకున్నదో అర్థం చేసుకోవచ్చు.

తప్పులో కాలేసి.. ఇప్పుడు ఒప్పుకొని..
ఎన్నో ఏండ్లుగా సజావుగా సాగుతున్న ధాన్యం, బియ్యం సేకరణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ రంగు పులిమింది. ఇందులో భాగంగానే తెలంగాణపై కక్ష గట్టింది. మొన్నటి వరకు ధాన్యం సేకరణకు ససేమిరా అన్న కేంద్రం.. ఇప్పుడు బియ్యం సేకరణనూ నిరాకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. రైతుల్లో బీజేపీ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావటంతో.. వాటి నుంచి తప్పించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేస్తున్నది. కేంద్రమే సీఎమ్మార్‌ ఆపింది, దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జరిగిందని మళ్లీ కేంద్రమే తప్పుడు ప్రచారం చేసింది. తీరా ప్రజలు వాస్తవాలు గ్రహించే సరికి యూటర్న్‌ తీసుకొన్నది. ఢిల్లీలో పీయూష్‌ గోయల్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ రాష్ట్రంపై వెయ్యాల్సిన నిందలన్నీ వేసి.. బియ్యం సేకరణకు అనుమతిస్తున్నట్టు తెలిపారు.

మిల్లర్లపై రాష్ట్రం ఉక్కుపాదం.. అయినా
తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటించని మిల్లర్లపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే 12 మిల్లులపై క్రిమినల్‌ కేసులు బుక్‌ చేసింది. సీఎమ్మార్‌ సకాలంలో ఇవ్వలేని మిల్లర్లను డిఫాల్టర్‌ జాబితాలో చేర్చి వారికి ధాన్యం కేటాయింపును నిలిపేసింది. సుమారు 102 మిల్లులపై భారీ జరిమానా విధించింది. కానీ, నిబంధనలు పాటించని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించటం హాస్యాస్పదంగా ఉన్నది. అదీకాక.. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయలేదని తప్పుడు ఆరోపణ చేశారు. వాస్తవానికి కరోనా సమయంలో కేంద్రం కన్నా ముందే దేశంలో తొలిసారిగా పేదలకు ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రమే. ఆ తర్వాతే కేంద్రం ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. రాష్ట్రంలో 90.50 లక్షల తెల్ల రేషన్‌ కార్డులుండగా ఇందులో 53.56 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వానివి. మిగిలిన 36.94 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవే. అంటే రాష్ట్ర కార్డులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా బియ్యం పంపిణీకి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. 2020 ఏప్రిల్‌ -2022 ఏప్రిల్‌ మధ్య కేంద్రంతో సమానంగా నెలకు 10 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసింది. ఇప్పుడు నవంబర్‌ వరకూ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసింది.

బియ్యం సేకరణ ఉత్తర్వులు జారీ
కేంద్ర పీయూష్‌ గోయల్‌ బుధవారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి బియ్యం సేకరణకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఆ తర్వాతి గంటకే తెలంగాణ నుంచి సీఎమ్మార్‌ సేకరణకు అనుమతిస్తూ ఎఫ్‌సీఐ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. అంటే అప్పటికే అంతా సిద్ధం చేసుకొని, రాష్ట్రంపై నిందలు వేసి, ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టంగా తెలుస్తున్నదని విమర్శకులు అంటున్నారు. దీన్ని బట్టే బియ్యం సేకరణ నిలుపుదలలో పక్కా రాజకీయ కక్ష సాధింపు ఉన్నదని పేర్కొంటున్నారు.

తడిసిన ధాన్యానికి బాధ్యులెవరు?
కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో నెలన్నర రోజులుగా రాష్ట్రంలో మిల్లింగ్‌ పరిశ్రమ మొత్తం బంద్‌ అయ్యింది. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మిల్లుల్లో నిల్వ ఉంచిన సుమారు 10 లక్షల టన్నుల ధాన్యం తడిసి మొలకెత్తుతున్నది. మరి ఈ ధాన్యానికి ఎవరు బాధ్యులు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుధవారం కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తడిసిన ధాన్యంతో తమకు సంబంధం లేదని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఇందుకు కారణం కేంద్రం నిర్లక్ష్యం అన్నది మాత్రం ఆయన ఆలోచించకపోవటం గమనార్హం.