home page

ముంపు బాధితులకు కొత్త కాలనీ

 ఒక్కో కుటుంబానికి

 10 వేలు ఆర్ధిక సాయం 

 | 
Kcr
*ముంపు బాధితుల‌కు రూ. 10 వేలు ఆర్థిక సాయం,*
 *వెయ్యి కోట్ల‌తో కొత్త కాల‌నీ : సీఎం కేసీఆర్* 
 భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. అదే విధంగా ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.
భ‌ద్రాచ‌లంలో వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం స్థానికంగా ఉన్న‌ ఐటీడీఏలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనుహ్యంగా చాల ఏండ్ల త‌ర్వాత వ‌ర‌దలు వ‌చ్చాయి. భ‌ద్రాచ‌లం, పిన‌పాక నియోజ‌క‌వ‌ర్గాలు చాలా దెబ్బ‌తిన్నాయి. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా కాపాడాల‌ని చెప్పాను. అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేదు. పోలీసు, ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ ద‌ళాలు త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. కొత్త‌గూడెం, ఖ‌మ్మం క‌లెక్ట‌ర్లు గొప్ప‌గా ప‌ని చేసి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాన‌ని కేసీఆర్ తెలిపారు.
*7,274 కుటుంబాల‌కు ఆర్థిక సాయం..*
7,274 కుటుంబాల‌ను జిల్లా యంత్రాంగం పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించింద‌ని కేసీఆర్ చెప్పారు. బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌న్నారు. ప్ర‌తీ కుటుంబానికి 20 కేజీల చొప్పున బియ్యం ఇస్తాం. క్యాంపుల నుంచి ఇప్పుడే పంపించ‌కండ‌ని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
*రూ. 1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ..*
శాశ్వ‌తంగా ఈ స‌మ‌స్య మ‌న‌కు పోవాలి. భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణం వ‌ర‌ద ముంపున‌కు గురికాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను మ‌రో ప్రాంతానికి త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం. సింగ‌రేణి, ప్ర‌భుత్వం క‌లిసి రూ. 1000 కోట్ల‌తో రెండు, మూడు వేల ఇండ్ల కాల‌నీ నిర్మించ‌బోతున్నాం. దీనికి సంబంధించి అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారు. భ‌ద్రాచలం, పిన‌పాక‌లో వ‌ర‌ద బాధ‌లు లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతాం. గోదావ‌రికి 90 అడుగుల మేర వ‌ర‌ద వ‌చ్చినా ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతాం. ఎత్తైన ప్రాంతంలో కాల‌నీ నిర్మాణానికి సీఎస్ చ‌ర్య‌లు తీసుకుంటారని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.
*భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్లే ఆ ప్రాజెక్టు బ‌తికింది..*
వ‌ర‌ద ముంపున‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం. గోదావ‌రికి 1986లో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. మారిన ప‌రిస్థితుల కార‌ణంగా మ‌ళ్లీ అలాంటి వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌న ఊహించ‌ని విధంగా చ‌రిత్ర‌లో క‌నివినీ ఎరుగ‌ని విధంగా క‌డెం ప్రాజెక్టులో భారీ వ‌ర‌ద వ‌చ్చింది. గ‌తంలో ఎన్నడూ కూడా రెండున్న‌ర ల‌క్ష‌ల క్యూసెక్కులు దాట‌లేదు. సుమారు 3 వేల క్యూసెక్కులు మాత్ర‌మే దాటింది. ఈసారి 5 ల‌క్ష‌ల క్యూసెక్కులు దాటింది. అది నిజంగా చెప్పాలంటే భ‌గ‌వంతుడి ద‌య‌వ‌ల్లే ఆ ప్రాజెక్టు బ‌తికింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.
*29 వ‌ర‌కు వ‌ర్షాలు..*
అప్ర‌మ‌త్తంగా ఉండాలి..
వాతావ‌ర‌ణంలో సంభ‌వించే మార్పుల వ‌ల్ల ఇలాంటి ఉత్పాతాలు వ‌స్తుంటాయని కేసీఆర్ తెలిపారు. వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌కారం.. 29 వ‌ర‌కు ఇదే ప‌ద్ధ‌తిలో వ‌ర్షం ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌మాదం ఇంకా త‌ప్పిపోలేదు. మ‌రో మూడు నెల‌లు వ‌ర్షాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంద‌రం కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. చివ‌రి వ‌ర‌కు క్యాంపులు ఉండేలా చూడాలి.