home page

సామాన్యుడి పై ‌ మోయలేని భారం

ఇది (మోడీ)మాయా తంత్రం!

 | 
Gst

సామాన్యుడుపై మోయలేని బారం 

ఉదయం నిద్రలేచినప్పట్నుంచి పడుకునేదాకా సగటు మనిషికి అవసరమైన ప్రతీదానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పడుతున్నది. 

ఫలితంగా ఏది కొనాలన్నా సామాన్యుడికి పెను భారంగా పరిణమించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గడిచిన ఎనిమిదేండ్లుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు.. దేశంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తున్నాయి. సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటుండగా, పేదలు ఇంకింత పేదలుగా మారిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు క్రమేణా పేదరికంలోకి జారుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారిప్పుడు.

పాలనూ వదల్లేదు…
సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకొస్తున్నట్టు ఐదేండ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. ధాన్యాలు, పెరుగు, లస్సీ వంటివాటన్నింటికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు. కానీ.. దేన్నీ వదలట్లేదు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంటనూనెలు తదితర అన్నింటిపైనా జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలనూ ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటి ప్రీప్యాక్డ్‌, ప్రీలేబుల్డ్‌ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వేశారు. అంతేగాక డెయిరీ మిలింగ్‌ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటివాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే పశువుల మేత దగ్గర్నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ పాడి పరిశ్రమ. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25 శాతం డెయిరీ నుంచే వస్తున్నది. ఈ జీఎస్టీతో వినియోగదారులపై భారం పెరిగినా.. ఉత్పత్తిదారులకు మాత్రం రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డెయిరీ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, పెద్దపెద్ద సంస్థలు మాత్రమే నిలబడుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పాల రంగం మొత్తం కార్పొరేట్‌ వశమవుతుందని ఆర్థికవేత్తలూ అంటున్నారు.

సామాన్యుడిపై మోయలేని భారం
సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపైనే కేంద్రం పన్నులు వేస్తున్నది. దీంతో ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతున్నది. కిలో పెరుగు ధరే 3-4 రూపాయలు పెరిగింది. ఇక లెదర్‌ ఉత్పత్తులపై జీఎస్టీ భారంతో సామాన్యులు చెప్పులు తొడుక్కునే స్వేచ్ఛ కూడా లేకుండాపోతున్నది. రైతు ప్రభుత్వమని చెప్పుకునే మోదీ.. అన్నదాతలనూ కోలుకోలేని దెబ్బతీశారు. విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి, గ్రేడ్‌ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలకూ పన్నుపోటు పడింది మరి. అసలే కొవిడ్‌తో ఆర్థికంగా చితికిపోయిన హోటల్‌ రంగాన్ని చిదిమేశారు. చిన్నపాటి హోటళ్లలో రూ.1,000 వరకూ ఉన్న రూమ్‌లపై 12 శాతం పన్ను విధించారు. వంటింట్లో ఉపయోగించే స్పూన్లు, ఫోర్కులపైనా పన్నేశారు. చివరికి స్కూల్‌ పిల్లలను సైతం వదల్లేదు. పెన్సిళ్లు, షార్ప్‌నర్లు వంటి వాటిపైనా జీఎస్టీ వచ్చిపడింది.

కార్పొరేట్ల కోసమే..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్లకు కోట్లు తెచ్చేలా.. పేదలు ఆకలితో మగ్గేలా ఉన్నాయి. ఒకప్పటితో పోల్చితే కొనుగోలుశక్తి చాలావరకూ తగ్గిపోయింది. నిజానికి బ్రాండెడ్‌ నిత్యావసరాలు మార్కెట్‌లో అధిక ధరలుంటాయి. ప్యాక్‌ చేసిన వస్తువులే నాణ్యతగా ఉంటాయని కేంద్రం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. మొదట ప్యాకింగ్‌ విధానాన్ని బాగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పట్నుంచి కిరాణా షాపుల్లో సైతం ప్యాకింగ్‌ చేసి అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం ప్యాకింగ్‌ చేసిన నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ విధించారు. ఫలితంగా వ్యాపారులు ఇక ప్యాకింగ్‌ చెయ్యరు. ప్రజలు కార్పొరేట్‌ దుకాణాల్లోని ప్యాకింగ్‌ చేసిన వాటినే కొనుగోలు చేస్తారు. దీనివల్ల చిరు వ్యాపారులు నలిగిపోయే అవకాశమున్నది. సామాన్యుడు ధరలతో విలవిల్లాడే ప్రమాదమున్నది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిదేండ్లలో నిత్యావసరాలు అమాంతం పెరిగిపోయాయి. పేదరికం పెరిగిపోయిందని సూచీలన్నీ చెప్తున్నాయి. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటొద్దనేది రిజర్వ్‌ బ్యాంక్‌ లక్ష్యం. కానీ ప్రస్తుతం దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉన్నది. ఇవే విధానాలు కొనసాగితే దేశం.. శ్రీలంకగా మారే ప్రమాదమున్నది.
-డీ పాపారావు, ఆర్థిక రంగ నిపుణులు

చర్చల్లో రాష్ర్టాల పాత్ర నామమాత్రమే..
వస్తువులపై జీఎస్టీ విధింపుపట్ల కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయమే ఆఖరు అంటూ ఊదరకొడుతున్న నరేంద్ర మోదీ సర్కారు.. ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముందుగానే నిర్ణయమైన ఎజెండాను ఆమోదించడానికి జరిగే ఈ సమావేశాల్లో చర్చ నామమాత్రంగానే ఉంటుందని ఈ సమావేశంలో పాల్గొన్న ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు కేవలం గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆమోదం పొందడానికి మాత్రమే జరుగుతున్నాయి. ఈ నిర్ణయాలను రాష్ర్టాలు ఆమోదించాల్సిందే.

అన్ని రాష్ర్టాల ఆమోదంతోనే..