వైసిపికి తలనొప్పిగా మారిన పవన్ కళ్యాణ్

రాష్ట్ర రాజకీయాలలో వైసిపికి ప్రధమ శత్రువు ఎవరు? చంద్రబాబా? పవన్ కళ్యాణా? ఈ విషయం మనల్నే కాదు, వైసిపి నాయకులను కూడా తికమక పరుస్తున్నది. వీళ్లద్దరూ ఒకటే అని ఉదయం, సాయంత్రం చెబుతున్నా కూడా ఇద్దరూ వేరు వేరుగానే తమపై విమర్శలు చేస్తున్నారనే విషయం వైసిపి నాయకుల అంతర్గత సమావేశాలలో చర్చించుకుంటున్నారని తెలిసింది.

చంద్రబాబునాయుడు చేసే విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న భావనలో ఇంత కాలం వైసిపి నాయకులు ఉండేవారు. చంద్రబాబునాయుడు పర్యటనలు చేసినా తమను విమర్శించినా తమకేం కాదనే ధైర్యాన్ని ప్రదర్శించే వారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అంత భరోసాగా వారు ఉండలేకపోతున్నారని జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ప్రజలలోకి దూసుకువెళుతున్నాయని ఇంటెలిజెన్సు వర్గాల ద్వారా అందుతున్న సమాచారంతో వైసిపి నాయకులు పునరాలోచనలో పడుతున్నారు.

ఒకే ఒక శాసనసభ్యుడు ఉన్న జనసేన పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసిపి ఎందుకు భయపడాలి అని ముందుగా అనుకున్నా వాస్తవపరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు ఇంటెలిజెన్సు వర్గాల సమాచారం ఉన్నట్లు తెలిసింది. దాంతో చంద్రబాబు సంగతి కొద్ది రోజులు పక్కన పెట్టి అయినా జనసేన అంతు తేల్చాలని వైసిపి నాయకులు కొందరు ముఖ్యమంత్రి జగన్ కు సూచించినట్లు తెలిసింది.

అయితే పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలను ఘాటుగా తిప్పి కొట్టండి మిగిలింది నేను చూసుకుంటాను అని జగన్ అన్నట్లుగా తెలిసింది. దాంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలను ఖండించేందుకు మంత్రులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడు రాజకీయ పరమైన విమర్శలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ వైసిపి నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

తాజాగా నా మతం మానవత్వం నా కులం మాట తప్పకపోవడం అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ తిప్పి కొట్టారు. మతం మారిని వారికి కులమేమిటని పవన్ వేసిన ప్రశ్న సమాజంలో మంచి ప్రతిస్పందన తెచ్చిందని ఇంటెలిజెన్సు వర్గాలు కూడా నివేదించినట్లు తెలిసింది. అదే కాకుండా జగన్ తాను క్రైస్తవుడిని అని చెప్పలేకపోవడం కూడా పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యానించిన అనంతరం వ్యూహం మార్చిన పవన్ కేవలం జగన్ వ్యక్తిగత విషయాలపైనే వ్యాఖ్యానాలు చేస్తూ వైసిపిని ఇరకాటంలో పెడుతున్నారు. ఇదే విధమైన విమర్శల దాడి కొనసాగితే భవిష్యత్తులో చంద్రబాబు కన్నా తమను ఎక్కువ డ్యామేజి చేసేది పవన్ కళ్యాణ్ అని వైసిపి నాయకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.