vasudhamaata illeramma kathalu

వసుధమాట… ఇల్లెరమ్మ కథలు

సుశీల సోమరాజుగారికి అశ్రు నివాళులతో…. పుస్తకం చదివినప్పుడు ఆనంద పడటం తప్పనిచ్చి సమీక్షలు అవీ రాసే అలవాటు లేదు నాకు…కానీ బంగారు తల్లి ఇల్లేరమ్మ నా చెయ్యిపట్టుకు మరీ పుస్తకం చదివిన రెండు రోజులు నన్ను బాల్యం లోకి తీసుకుపోయింది. చదువుకుంటూ పోతే ఒకదాన్ని మించిన కధ మరొకటి అలా ఇల్లేరమ్మ లోకంలో మనమూ విహరిస్తాం.సాధారణంగా హాస్యప్రధానమైన కథలు చదివినప్పుడు చదువుతున్నప్పుడు మాత్రం నవ్వుకుంటాం తర్వాత వాటి ప్రభావం మనపై పెద్దగా ఉండదు.

ఇల్లేరమ్మ అలాకాదు ఎక్కడో సున్నితంగా, సుతిమెత్తగా మనసును తడుతూ ఉంటుంది..అమ్మమీద చాడీలు కూడా ఆమెమీద ప్రేమను తెలిపేవీ అమాయకమైనవీనూ. పరమానందయ్య శిష్యులు ఏమిచేసినా గురువు గారికి లాభమే కలిగేది అలా ఇల్లేరమ్మ ఏమిచేసినా అమ్మకి మంచి జరుతుంది.కధ కథకీ ఇల్లేరమ్మ పెరిగి పెరిగి విశ్వరూపం దాలుస్తుంది మన మదిలో.

మిరియాల జున్ను కథలో నాన్న నిజాయితీ ,చిన్నారీ  వాళ్ళ అమ్మకథలో అమ్మమీద పరిణితి నిండిన  ప్రేమ ఎంత బాగా చూపిస్తుందో. నారింజా సమ్మర్ స్కూల్ ఐడియా ఎంత బాగుందో.చివరిగా చెల్లెళ్లతో, బుజ్జి తమ్మునితో కలిసి టాటా చెప్పిన ఇల్లేరమ్మ ఇంకో 100 సంవత్సరాల తరవాత తెలుగు కధ చదివే వారికి కూడా బాలగానే దర్శనం ఇస్తుంది. ఇంత చక్కటి కధలని తెలుగు వారి పరం చేసిన సోమరాజు సుశీల గారికి శిరస్సు వంచి వందనం చేయటం మించి ఏమి చేయగలను..
వసుధారాణి.

వసుధారాణి. 🙏🙏💐💐