వసుధ మాట

Vasudha maata, bhojanam thayaar, navala,vasudha rani bojanam tayar

భోజనం తయ్యార్..

డొక్కా సీతమ్మ గారు ఒక్కరూపాయి సొమ్ము ఆశించకుండా,  ఆకలి గొన్నవారికి కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటమే జీవిత ధ్యేయముగా గడిపిన అపర అన్నపూర్ణ.అలాంటి ఆవిడ నడయాడిన  మన ఆంధ్రదేశంలో ఇప్పుడు అతి ముఖ్యమైన లాభసాటి వ్యాపారం హోటల్ .

dokka seethamma mirrortoday

అది అయిదు నక్షత్రాలతో మొదలుపెట్టి కాకా హోటల్,వీధి ఆహారం అదేనండి స్ట్రీట్ ఫుడ్ వరకూ ఒకటే వ్యాపారశైలి. పెద్దహోటళ్లలో ఎక్కువ డబ్బు పుచ్చుకుని  నాణ్యత  కల ఆహారం పెడతారు,నాణ్యత పేరు చెప్పి డబ్బున్నవారిని దోచుకోవడం ఇదొరకం,తక్కువ డబ్బు తీసుకున్న దగ్గర నాసిరకం ఆహారాన్ని ఆకర్షణీయంగా అలంకరణ చేసి జిహ్వచాపల్యం కల వారిని ఆకర్షించేలా ప్రదర్శిస్తారు.మొత్తమీద ఎటుచూసినా ఆకలిగొన్నవాడు కొంత మూల్యంగా డబ్బు,ఆరోగ్యం ఈ భోజనశాలల వారికి చెల్లించుకోక తప్పదు.

ప్రాంతాన్ని బట్టి రకరకాల ఆహారపు అలవాట్లు ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే జిల్లా జిల్లా కి  భోజన అలవాట్లలో ఎన్ని తేడాలో.’తలకాయ కూర రాగి సంకటి ‘ ఈ బోర్డు రాయలసీమ లో ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రాంతంలో కనిపిస్తుంది.నేషనల్ హైవే మీద ఉలవపాడు మామిడి పండ్లతో పాటుగా, రాజుల భోజన హోటళ్ళకి ప్రసిద్ధి.అనంతపురంలో ఉగ్గాణి ,మిర్చిబజ్జి కలిపి తినటం పేదవాడికి ఐదు రూపాయలతో వచ్చే ఘనమైన ఆహారం .పచ్చిమిర్చికారం దట్టించి చేసే ఈ పదార్థం ఎంతో సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది.  తమిళనాట రాత్రిపూట చాలా వరకు భోజనం దొరకదు .రామేశ్వరంలో చిన్న చిన్న హోటళ్ళ వాళ్ళు సాయంత్రానికి మూసివేస్తారు. చక్కటి తెల్లటి సన్నబియ్యపు అన్నం అలవాటయిన మన ఆంధ్రా  చిన్నపిల్ల , నాలుగేళ్లు వుంటాయేమో అన్నమో అని  ఒకటే ఏడుపు.తల్లిదండ్రులు బతిమాలగా ఓ హోటల్ అతను ఉదయం వండిన లావులావు మెతుకులున్నఉప్పుడు బియ్యం తో వండిన అన్నాన్ని బాణలిలో వేసి వేయించి ఇవ్వటం చూసినప్పుడు.అన్నం  పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఎందుకు అన్నారో ,ఆ మాట  విలువేమిటో అర్ధం అయ్యింది.

మిలటరీ హోటళ్లు కేరళ వారివి దేశంలో ఏమూలకు వెళ్లినా ఇవి కనిపిస్తాయి.అన్ని హోటళ్లు మూసివేసినా ఎంతరాత్రి అయినా టీ, పరాటాలు దొరికే హోటళ్లు ఇవి.ఒకప్పుడు రహదారులపై చాలా విరివిగా ఉండేవి. ఇక బెంగుళూరు బేకరీల గురించి తెలియని వారుంటారని అనుకోను.గుండ్రటి పెద్దసైజు బన్ను మధ్యలో టూటీ ఫ్రూటి ముక్కలు , కమ్మగా వేగిన ఎండుకొబ్బరి తురుమువేసి తయారు చేసే దిల్ పసంద్ అందరి మన్ పసంద్.

భోజనహోటల్లో ప్లేటు మీల్స్ అయితే ఫరవాలేదు నిర్ణీత ధరకు నిర్ణీత  ఆహారం ఇస్తారు.ఫుల్ మీల్స్ టికెట్ తీసుకున్న వారిని ఎక్కువ ఆహారం తిననీయకుండా చేయటానికి , హోటలు వారు చేసే జిమ్మిక్కులు ఎలా వుంటాయంటే , భోజనం తెచ్చేలోగా చల్లనీళ్లు ఎక్కువగా తాగేలాగా చూడటం,ఖరీదైన హోటళ్లలో ఇందుకు భిన్నంగా ఆకలి పెంచే సూప్లు, స్టార్టర్లు ఇచ్చి ఆహారాన్ని ఆలస్యంగా వడ్డించటం.ఎంత ఎక్కువ తింటే అంత లాభం . భోజనం తయ్యార్ రు  తలకి ఒక్కింటికి 50 రూపాయలు అని  అదేదో సినిమాలోలా బోర్డు పెట్టే మెస్సుల్లో మరో ప్రహసనం నెయ్యి వేయటం .అందుకోసం ఆ సర్వర్లు ప్రత్యేక తర్ఫీదు పొందుతారనుకుంటా ఖాళీ నెయ్యి గిన్నెలో స్ఫూన్ వేసుకొచ్చి గిన్నెని స్ఫూన్ తో టకటక లాడించి పోతారు .నెయ్యిపడినట్లు ఉంటుంది కానీ వారు తెచ్చే గిన్నెఖాళీది . ప్రజల ఆరోగ్యం, వారి అన్నవాహిక యొక్క స్పృహ కొంచెం అయినా లేకుండా అన్నం తెల్లగా మల్లెపూవులా కనపడటానికి,ఎక్కువ తినకుండా ఉండటానికి ఉడికే అన్నంలో సున్నపుతేట కలుపుతారట కూడా.అయితే కొన్ని ఊళ్లలో రుచిగా,శుచిగా చక్కటి ప్రమాణాలతో ఎన్నో ఏళ్లుగా భోజనం పెట్టే మెస్ లు ఉండటం కూడా కద్దు.

ఈ మెస్సులకి ఎంత తమాషా పేర్లు ఉంటాయి అంటే గుంటూరు వారి భోజనం,నెల్లూరు మెస్, నెల్లూరు రెడ్డి హోటల్,ఒంగోలు మెస్ వేరే ఊరులో మన ఊరి పేరు ,అమ్మభోజనం గుర్తుకు తెప్పించి  అటుకేసి నడిపిస్తుందని కాబోలు . ఇప్పటి భోజనం మెస్సులు ఇలా ఉంటే.పూర్వం (ఊరెందుకు లెండి ) ఒకానొక మెస్సు అదే అప్పటి పరిభాషలో పూట కూళ్ళ ఇల్లు తొండపి సుబ్బమ్మ అనే కాస్త వ్యాపార ధోరణి కల ఆవిడ నడుపుతూ ఉండేదట.ఇది ఒక డెభ్భయ్ , ఎనభయ్ ఏళ్ల నాటి  మాట అప్పట్లో రైల్వే స్టేషన్ల దగ్గర ఈ పూటకూళ్ళ ఇల్లు వుండేవిట. ఈ సుబ్బమ్మగారు భోజనానికి  వచ్చిన వారికి ఆమాటా ఈమాటా చెప్పి ఇదిగో వంట అయిపోయే అంటూ రైలు వచ్చే టైము వరకూ అన్నం పెట్టకుండా.సరిగ్గా రైలు వచ్చేముందర విస్తళ్లలో అన్నం వడ్డించి అదిగో పొగబండి పాయె పాయె అనేదట.ఆ కంగారులో పాపం అందరూ గబగబా తినేసి వెళ్ళేవారట . ఇదంతా గమనించిన ఓ తెలివిగల పెద్దమనిషి ఓ రోజు ఈవిడ పని పట్టాలని  రైలు పోతే పోయింది నాకు ఇంకొంచెం పప్పు వడ్డించు,కూరవడ్డించు,నెయ్యి వెయ్యి అని సుష్టుగా తిని  ‘ తెలివిఒకరి సొమ్మా తొండపి సుబ్బమ్మా’ అంటూ బొజ్జనిమురుకుంటూ అక్కడే అరుగు మీద హాయిగా పడక వేశాడట.సదరు సుబ్బమ్మ వేరే సూత్రం కనిపెట్టుకోవాల్సి వచ్చి ఉంటుంది పాపం. ఈ కథ సరదాగా వున్నా అప్పటి నుంచి తెలివి ఒకరి సొమ్మా తొండపి సుబ్బమ్మా అని నానుడి వచ్చినా.ఆహారాన్ని వ్యాపారంగా  చేసుకుని లాభం కోసం ఇలా చేయటం  అప్పటి నుంచే ఉంది అన్న విషయం బాధాకరం. క్రమంగా మరీ ఘోరంగా మారింది.వ్యాపారం కేవలం లాభాపేక్షతోనేకాక కొన్నిప్రమాణాలను పాటిస్తూ చేయవలసిన అవసరాన్ని దెబ్బతింటున్న ప్రజారోగ్యం తెలుపుతోంది. మనకి వచ్చే ఆరోగ్య సమస్యలలో ఎక్కువశాతం ఆహారం వలన కలిగేవే ముఖ్యంగా బయట ఆహారం తరచూ తినే వారికి ఈ ప్రమాదం మరీ ఎక్కువ.ఆహారం రంగు,వాసనకు ప్రలోభ పడకుండా చక్కని  ఆరోగ్యకరమైన భోజనం చేయండి.మెస్సులు పిలుస్తూనే ఉంటాయి భోజనం తయారంటూ.

వసుధారాణి