Telangana Vidhan Sabha Elections results 2018

తెలంగాణలో పర్సంటేజ్ టెన్షన్

గతంలో కంటే ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడం మంచిదే. అయితే ఈ పోల్ పర్సంటేజ్ నేతల్లో మాత్రం టెన్షన్ పెంచేస్తోంది. భారీగా పెరిగిన పోలింగ్ శాతం దేనికి నిదర్శనమనే కాలిక్యులేషన్స్‌లో నాయకులు నిమగ్నమయ్యారు. తెలంగాణలోని పార్టీలన్నీ తమకే విజయం దక్కుతుందని గంటాపథంగా చెప్తున్నా.. లోపల మాత్రం ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందోనన్న గుబులు ఉంది. ఏదైతేనేం.. ప్రజలు తమకే పట్టం కట్టారని అధికార టీఆర్ఎస్, విపక్షాలు ప్రకటనలు గుప్పించేస్తున్నాయి. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, అవినీతిరహిత పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని.. తమకు మద్దతుగా నిలిచారని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే విపక్షం మాత్రం అధికార పార్టీకి వ్యతిరేక ఫలితం ఖాయమని వాదిస్తోంది. ఇరువర్గాల వాదనలెలా ఉన్నా రాష్ట్రంలో నమోదైన పోలింగ్ శాతం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా ఈ అంశాన్ని అంచనా వేయలేకపోతున్నారు. తుదిఫలితం వచ్చేవరకూ వేచి చూడాల్సిందేనని అంటున్నారు.

పోల్ పర్సంటేజ్ పెరిగిన జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ కూడా ఒకటి. టోటల్‌గా పది నియోజకవర్గాల్లో గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రికార్డైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గతేడాదితో పోల్చితే దాదాపు 10శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఇంత ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తారని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఈ సారి ఎలక్షన్‌లో కొత్తగా ఓటు హక్కు వచ్చినవారు ఉత్సాహంగా ఓటేశారు. పోలింగ్ శాతం పెరగడానికి వీరు కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ఇదిలాఉంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల నేతల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాలు చెప్తున్నట్లు ప్రభుత్వం భారీ వ్యతిరేకత లేదు.

అలాగే ప్రధాన ప్రతిపక్షం ప్రజాఫ్రంట్‌కు గంపగుత్తగా జనాలు ఓట్లు వేశారని అనుకోడానికి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల నాటి నుంచి పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలు సాగాయి. ఇరు పక్షాల్లోనూ సీట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. దీంతో ఓట్లు చీలిపోవడం ఖాయమైంది. ఫలితంగా నేతలకు భారీ మెజార్టీలు దక్కవేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నాయకులు కూడా ఎవరిది పైచేయిగా ఉంటుందోనని చెప్పలేకపోతున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే డిసెంబర్ 11వరకూ వేచి ఉండాల్సిందే.
Tags: voting percentage, telangana news, election counting