శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం

 బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి నైవేద్యానికి ఆవాసం గంగుండ్రమండపం
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో సిరుల తల్లికి విశ్రాంతి, నైవేద్యానికి ఆవాసం గంగుండ్ర మండపం. ఈ మండపానికి దాదాపు 151 సంవత్సరాల పురాతనమైన చరిత్ర వుంది. తిరుచానూరులోని అమ్మవారి ఆలయానికి ప్రక్కన, పద్మ సరోవరానికి ఎదురుగా వున్న గంగుండ్ర మండపాన్ని 1868వ సంవత్సరంలో శ్రీ ఎస్‌.వెంకటరంగ అయ్యంగార్‌ నిర్మించారు. ఈయన బ్రిటిష్‌ ప్రభుత్వంలో తహశీల్ధార్‌గా తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో పని చేశారు. అమ్మవారిపై భక్తితో గంగుండ్ర మండపాన్ని నిర్మించారు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన వంశస్థులు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో, తెప్పోత్పవాల్లో తిరుచానూరు విచ్చేసి అమ్మవారిని సేవిస్తున్నారు.

శ్రీ ఎస్‌.వెంకటరంగ అయ్యంగార్‌ చారిటి సొసైటిని ఏర్పాటు చేసి అనేక దార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యం జిల్లా మేలుకొటైలో కొలువై వున్న చలువ నారాయణస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వైరమడి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు శ్రీ ఎస్‌.వెంకటరంగ అయ్యంగార్‌ చారిటి సొసైటి వారు వానమామాలై మఠంలో అన్నప్రసాదాలు అందిస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలను చారిటి తరపున ఆయన వంశస్థులు నిర్వహిస్తున్నారు.