sharad pawar, says, im ready, to go jail, corruption, mscb

నన్ను జైలుకు పంపేందుకు కొంత మంది కుట్ర: శరద్‌ పవార్‌

తనను జైలుకు పంపేందుకు కొంత మంది కుట్రపూరితంగా ప్రణాళికలు రచిస్తున్నారని ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్ ఆరోపించారు. తనపై కేసులు రుజువైతే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. శరద్‌ పవార్‌, ఆయన అన్నకొడుకు అజిత్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

దీనిపై బుధవారం ఉదయం పవార్‌ తీవ్రంగా స్పందించారు. తాను ఏ క్షణమైనా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అక్టోబర్‌ 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఇలాంటి అక్రమ కేసులు తాను ముందే ఊహించానని అన్నారు. తనకు సంబంధం లేని కుంభకోణంలో తన పేరును చేర్చినందుకు ఈడీకి ధన్యవాదాలంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

Tags: sharad pawar, says, im ready, to go jail, corruption, mscb