saradha peetam, visakapatnam, ts cm kcr, ys jagan

శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహా సరస్వతిని రాజకీయ రొచ్చులోకి మెల్లగా లాగేస్తున్నారు..!

ఈ మధ్యన ఆయన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కలసి అక్కడ పూజలు చేసిన సంగతి విదితమే. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా స్వామీజీని తన తిరుపతి టూర్లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనిపైన రగిలిపోతున్న టీడీపీ తమ్ముళ్ళు తమ రాజకీయ విమర్శలలో భాగంగా స్వామీజీపైన కూడా బాణాలు ఎక్కుపెడుతున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వెలగపూడి రామకృష్ణబాబు ఏకంగా స్వామీజీని నిందిస్తూ ఘాటైన విమర్శలు చేయడంతో వివాదం రాజుకుంది.స్వామీజీపై ఎమ్మెల్యే విమర్శలు చేయడంతో ఆగ్రహించిన ఆయన రాజకీయ ప్రత్యర్ధి, వైసీపీ అభ్యర్ధి అయిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వెలగపూడిని కడిగిపారేశారు.

వెలగపూడికి దేవుడు అన్నా, స్వామీజీలు అన్నా కూడా విశ్వాసం లేదని నిప్పులు చెరిగారు. స్వామీజీలను సైతం తన స్వార్ధ రాజకీయాల్లోకి లాగడం దారుణమని కూడా కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఆస్తికజనులు ఆయనకు బుద్ది చెబుతారని కూడా హెచ్చరించారు.వంశీకృష్ణ సతీసమేంతంగా పీఠానికి వెళ్ళి మరీ స్వామీజీ అశీస్సులు తీసుకున్నారు. తన గెలుపు కోసం స్వామి దీవెనలు కోరుకున్నారు. స్వామీజీ దీవెనలు ఎలా ఉన్నా ఆయన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవడం పట్ల నగర వాసులు ఆశ్చర్యపోతున్నారు. స్వామీజీని కేవలం వైసెపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకునిగా టీడీపీ నేతలు చూడడాన్ని కూడా పలువురు తప్పుపడుతున్నారు. ఆయన ఆశ్రమానికి అన్ని రకాలైన పార్టీలకు చెందిన వారు వస్తారని ఆస్తిక జనులు అంటున్నారు. తనపై రాజకీయ ముద్ర పడడంపై స్వామీజీ కూడా స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీ మనిషిని కానని, దేవున్ని నమ్ముకున్న వాణ్ణి అని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనకు చంద్రబాబు పట్ల ప్రత్యేకంగా అభిమానం.. ద్వేషం ఏమీ ఉండవని అన్నారు. తాను ఆధ్యాత్మిక పరమైన అంశాల్లో పాలకుల వైఖరిని మాత్రమే ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. మొత్తానికి స్వామీజీ పేరిట విశాఖ రాజకీయాలు రెండు పార్టీలుగా విడిపోవడం మాత్రం కలకలం రేపుతోంది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
Source: telugupost
Tags: saradha peetam, visakapatnam, ts cm kcr, ys jagan