RGV, Beautiful, Naina Gangully

పాపం వర్మ.. సినిమాను సేల్ చేయడానికి ఎన్ని కష్టాలో

కొన్నేళ్లుగా సినిమాలు ఎలా తీయాలి అనే దాని కంటే.. దానికి ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా సేల్ చేయాలి అనే దాని మీదే ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. కథ కూడా రెడీ కాకముందే ఆయన పబ్లిసిటీ గిమ్మిక్కులు మొదలైపోతాయి. ఎంత కాంట్రవర్శల్ సబ్జెక్ట్ ఎంచుకుంటే అంత పబ్లిసిటీ అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. కథలో కాంట్రవర్శీ లేకపోతే.. హీరోయిన్ అందాల మీదికి ఆయన ఫోకస్ వెళ్తుంటుంది. గత దశాబ్ద కాలంలో వర్మ తీసిన ఏ సినిమా చూసుకున్నా ఇదే వరస.

వివాదాలు రాజేసేలా.. లేదంటే కుర్రాళ్లలో వేడి పుట్టేలా ప్రోమోలు వదిలి సినిమాకు పబ్లిసిటీ తీసుకొస్తుంటాడు. కానీ అన్ని సినిమాలకూ ఈ స్ట్రాటజీలు వర్కవుట్ కావు. ఈ మార్గంలో సినిమాపై ఆసక్తి రేకెత్తించలేకపోతే అంతే సంగతులు. కంటెంట్ పరంగా వర్మ సినిమాలు ఎంత నాసిరకంగా ఉంటున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దీంతో వర్మ పబ్లిసిటీ గిమ్మిక్కులు వర్కవుట్ కానపుడు దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. అందుకు.. ఆఫీసర్ ఒక ఉదాహరణ.

దీని తర్వాత కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ లాంటి వివాదాస్పద సినిమాలతో బాగానే సొమ్ము చేసుకున్నాడు కానీ.. ఎంటర్ ద గర్ల్ డ్రాగన్, బ్యూటిఫుల్ సినిమాల విషయంలో మాత్రం వర్మ పప్పులుడకడం లేదు. ఈ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో అసలేమాత్రం ఆసక్తి కనిపించడం లేదు. తన క్లాసిక్ మూవీ ‘రంగీలా’కు ట్రిబ్యూట్‌గా చెబుతున్న ‘బ్యూటిఫుల్’ అయితే ఏమాత్రం జనాలు, ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించలేకపోయింది. దీంతో ఇక లాభం లేదని ప్రి రిలీజ్ ఈవెంట్ ఒకటి పెట్టారు. వర్మ ఎంత అద్భుతంగా, వివాదాస్పదంగా మాట్లాడినా జనాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి.. కొంచెం డిఫరెంటుగా ట్రై చేశాడు.

హీరోయిన్‌ నైనా గంగూలీతో కలిసి ఈ వేడుకలో స్టెప్పులేశాడు. ఎప్పుడూ మాటలతోనే మ్యాజిక్ చేసే వర్మ.. స్టేజ్ మీద మాంచి ఊపులో డ్యాన్స్ చేయడం.. బ్రేక్ డ్యాన్సులు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదంతా కూడా పబ్లిసిటీ కోసం, సినిమాను సేల్ చేయడం కోసం అనడంలో సందేహం లేదు. మరి ఈ గిమ్మిక్ ఏమాత్రం పని చేస్తుందో చూడాలి.‘బ్యూటిఫుల్’ జనవరి 1న విడుదల కావాల్సి ఉంది.
Tags: RGV, Beautiful, Naina Gangully