perninani

శాసనసభలో 22 కీలక బిల్లులు ఆమోదం పొందడం సంతోషం: పేర్ని నాని

• రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

• అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే లక్ష్యం :రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

అమరావతి, 18 డిశెంబర్: డిశెంబర్ 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు అసెంబ్లీ జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను, ఆమోదం పొందిన బిల్లులు,ప్రతిపక్షపార్టీ సభా వ్యవహారాలను అడ్డుకున్న తీరును మంత్రి రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వివరించారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం 22 కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుందని తెలిపారు. శాసనమండలిలో 20 బిల్లులు ఆమోదం పొందాయని వెల్లడించారు. భారతదేశం మొత్తానికి మార్గదర్శకంగా నిలిచిన దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందడం గర్వణీయమన్నారు. దిశ చట్టం గురించి ప్రశంసిస్తూ పలు రాష్ట్రాల నుంచి ఫోన్స్ వస్తున్నాయన్నారు. దిశ బిల్లు యొక్క స్వరూపం, విశేష గుణగణాలు వారికి పంపించాలని అడుగుతున్నారని తమ చట్టాన్ని ఆదర్శంగా తీసుకోవడం గర్వంగా ఉందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దిశ లాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించడం పాలకుడి లక్షణమన్నారు. కిరాతకంగా, అమానవీయంగా జరిగిన దిశ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి అందుకనుగుణంగా త్వరితగతిన అంటే కన్ క్లూజివ్ ఎవిడెన్స్ వచ్చిన 21 రోజుల్లో శిక్షించాలని ఆలోచన చేసి చట్టం చేసిన తమ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు శ్లాఘిస్తుండటం సంతోషమన్నారు. దిశ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ప్రపంచమంతా కొనియాడుతుంటే సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్ష పార్టీ సభ నుండి వాకౌట్ చేసిందని ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా ప్రతిపక్షనేతకు ఇష్టం ఉండడం లేదని మంత్రి విమర్శించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చారిత్రాత్మకమైన బిల్లు తేవడాన్ని కొందరు జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోరికను ముఖ్యమంత్రి తీర్చడం ఊహించలేని పరిణామంగా విశ్లేషకులు, ఆర్టీసీ కార్మికులు విశ్లేషిస్తున్నారని మంత్రి తెలిపారు. అసలు విలీనం అనేది సాధ్యమయ్యే ప్రక్రియనేనా అని విశ్లేషకులు ప్రశ్నించారని, అసాధ్యమని కొందరు రాజకీయనాయకులు విమర్శించారని చెప్పారు. ఆర్టీసీ విలీనం విషయంలో తాత్సారం చేస్తూ ప్రభుత్వం, జగన్ కాలం గడుపుతారని చాలా మంది ఆశపడ్డారు కానీ వారి ఆశలు, నమ్మకాలని వమ్ముచేస్తూ పరిపాలన దక్షులను సైతం విస్మయానికి గురిచేస్తూ అనతికాలంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ త్వరితగతిన 200 రోజుల్లోనే చట్టం చేయడంతో ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారని మంత్రి అన్నారు.

మద్యపానం నిషేధం విషయంలో విపక్ష సభ్యులు గొడవ చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. దశలవారీగా మద్యనిషేధం అని తాము చెబితే దాన్ని వక్రీకరించి సంపూర్ణ మద్యపానం అని నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎక్కడైనా అక్రమ మద్యం కనిపించినా వాళ్లను భయపెట్టేలా శిక్షలు అమలుచేయనున్నామని దానికనుగుణంగా చట్టం చేస్తూ బిల్లు ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు. గతంలో వారిని విడగొట్టి చట్టం చేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో దీన్ని చట్టం చేయనున్నామన్నారు. తద్వారా సమాజంలో నిరాధరణకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల హక్కుల పరిరక్షణ సమర్ధవంతంగా ఉంటుందన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల పేద పిల్లల భవిష్యత్ తీర్చిదిద్ది వారిలో ఆంగ్ల భాషకు సంబంధించిన నైపుణ్యాలు పెంపొందించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం పెట్టాలని సీఎం భావిస్తే దాన్ని ప్రతిపక్షం తప్పుబట్టిందని మంత్రి అన్నారు. ఆంగ్ల బోధనకు కాలు అడ్డుపెట్టారని ఆరోపించారు. ప్రజల్లో వారిపై వ్యతిరేకత రాగానే యూటర్న్ తీసుకొని తెలుగు భాష తప్పనిసరి అని విమర్శించడానికి మరో మార్గం వెతుకుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్నారు. ఆంగ్లమాధ్యమం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుల ఆమోదానికి శాసనసభలో సమర్థించిన ప్రతిపక్షం శాసనమండలిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం సరికాదన్నారు. గతంలో స్వార్థ రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీలను విభజన చేసి చట్టబద్దత కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. అధికారం ఉన్నప్పుడు విస్మరించడం, అధికారం లేనప్పుడు విమర్శిచడం ప్రతిపక్ష నేత సహజ లక్షణమని మంత్రి అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించాడని గుర్తుచేశారు.

ఆడపిల్లల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుంటే ఆ చర్చపై సభను అడ్డుకొని ఉల్లిపాయలపై చర్చించాలని పట్టుబట్టేవీరికి 40 యేళ్ల అనుభవం ఉందని చెప్పుకోవడం దారుణమని మంత్రి విమర్శించారు. ఉల్లిపాయల ధరలపై, రైతు భరోసాపై చర్చించే సమయంలో గిట్టుబాటు ధరలంటూ సభను అడ్డుకొంటూ రాజకీయ లబ్ధి కోసం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ధర్నాలు చేస్తున్న వీళ్లు వీరి హయాంలో ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచారని మంత్రి వెల్లడించారు. గతంలో 22.10.2015, 15.12.2015, 01.06.2016,01.07.2017, 01.07.2018వ తేదీల్లో ఆర్టీసీ ధరలు పెంచారని మంత్రి గుర్తుచేశారు. పదికిలోమీటర్ల లోపు పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణిస్తే ఎటువంటి పెంపు లేదని తద్వారా సామాన్యులకు ఎలాంటి నష్టం లేదన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పేద పిల్లలు డబ్బున్న పిల్లలతో పోటీ పడతారని, వారిలో ఆంగ్ల భాష నైపుణ్యసామర్థ్యాలను మెరుగుపడేలా చేయడమే తమఉద్దేశమన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలను సభ దృష్టికి తీసుకురాకుండా 2430 జీవో కోసం తపనపడ్డారని తెలిపారు. ఈ జీవో వల్ల ప్రజలకు, విలేఖర్లకు ఒరిగే నష్టమేమీ లేదన్నారు. దిశ చట్టం కఠినతరం చేయడం వల్ల మగ రాక్షసుల గుండెల్లో గుబులు పుట్టించిందన్నారు. అవినీతిని నివారించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పెంచి తద్వారా రాష్ట్రప్రజల మీద ఆర్థిక భారాన్ని తగ్గించే పనిలో భాగంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకువస్తే దాన్ని కూడా అడ్డుకోవడం బాధాకరమన్నారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన మంగళవారం శాసన సభలో రాజధానిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూల్లో జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షం అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రాజధానిపై చర్చ జరుగుతుంటే దానిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని పైగా బయటికి వచ్చాక తుగ్లక్ పాలనగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతమాత్రం సమంజసం కాదని మంత్రి అన్నారు. విశ్వాసానికి మారుపేరు జగన్ అని వంచన, నమ్మకద్రోహానికి మారుపేరు ప్రతిపక్షనేత అని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏ ఆలోచన చేసినా చాలా ముందు చూపు దూరదృష్టితో చేస్తారని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమన్నారు. త్వరలోనే రాజధానిపై కమిటీ నివేదికను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజల సలహాలు సూచనలు తీసుకుని రాజధాని విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదిక బయట పెట్టలేదని, కనీసం చట్టసభలో కూడా చర్చించలేదని ఆరోపించారు. కమిటీలో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని మంత్రి వెల్లడించారు. చాలా రాష్ట్రాల్లో సచివాలయం, హైకోర్టు వేరు వేరు చోట్ల ఉన్నాయని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నాం తప్ప వేరే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేశారు. రాజధానిలో రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయన్నారు. భూములు ఇచ్చిన రైతులు ఎంత మంది? రోడ్డెక్కిన రైతులు ఎంతమంది? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల్లో భాగంగా అమరావతిలో అసెంబ్లీ ఉంటుందని విమర్శలు చేస్తున్న వారి దృష్టిలో అసెంబ్లీ అమరావతిలో ఉండటం ఇష్టం లేదా లేక అసెంబ్లీ అనేది అసలు పనికిరానిదా? అని మంత్రి ప్రశ్నించారు.