భవిష్యత్ లో కమలహాసన్, రజనీకాంత్ తో కలిసి పనిచేస్తా!: పవన్ కల్యాణ్

  • కమల్ తో భేటీ అయిన జనసేనాని
  • చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు
  • బీజేపీ ఆశలను వమ్ముచేసిందని మండిపాటు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ప్రముఖ నటుడు కమలహాసన్ ను కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ భావ సారూప్యత ఉన్న నేతలను కలుపుకుని పోవడంలో భాగంగానే కమల్ తో భేటీ అయినట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీలు సమన్వయం, సహకారంతో పనిచేయకపోవడంతోనే కేంద్రం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు.

తాజాగా జాతీయ స్థాయిలో పొత్తులపై పవన్ కల్యాణ్ స్పందించారు. భవిష్యత్ లో కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీతో పాటు రజనీకాంత్ తో కూడా కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో కమల్, రజనీకాంత్ తో కలిసి ముందుకెళ్లే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. బీజేపీ నిజంగా దేశాన్ని అభివృద్ధి చేస్తుందని తాను ఆశించి మద్దతు ఇచ్చాననీ, కానీ ఇప్పుడు అది నెరవేరలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ తమ ఆశలను వమ్ము చేసిందని మండిపడ్డారు.