sagaramala raod, ap new projects, central budjet 2020

సాగరమాల కింద ఏపీకి 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు

సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పోర్టులకు సరకుల రవాణాను వేగవంతం, సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా రోడ్డు, రైల్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. రోడ్డు ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని డీపీఆర్‌ రూపకల్పన దశలో ఉన్నాయని ఆయన వివరించారు. రైల్‌ ప్రాజెక్ట్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెప్పారు.

ఏపీలోని 9 జిల్లాల్లో సాంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు
సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, కాయర్‌, విలేజ్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి అందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (కలంకారీ ఉత్పాదనలు), విజయనగరం (కాయర్‌ పరుపుల తయారీ), చిత్తూరు (కాయర్‌ ఉత్పాతదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పు గోదావరి (జొన్నాడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌), చిత్తూరు (చింతపండు ఉత్పాతదనలు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాల తయారీ), తూర్పు గోదావరి (కొబ్బరి నార ఉత్పాదనలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరి పీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సాంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.