నయా బాదుళ్ళు

సెప్టెంబర్ ఒకటో తేదీ వచ్చేసింది. ఎప్పటిలానే ప్రతి నెలా వచ్చే ఒకటో తారీఖు లాంటిది కాదు ఈ సెప్టెంబర్ ఒకటి. ప్రజల జీవితాలపై ఎంతో ప్రభావం చూపే అనేక నిర్ణయాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ట్రాఫిక్ చలాన్ల నుంచి నల్లధనం ఖాతాల వివరాల బహిర్గతం దాకా అనేక అంశాలు సెప్టెంబర్ ఒకటి నుండి మారనున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డులు, గృహరుణాలకు వడ్డీరేట్లు, గంటలో రుణాల మంజూరు, రైల్వే సేవల ఫీజు ఇలా అనేక రకాల కొత్త నిబంధనలకు సెప్టెంబర్ ఒకటి కీలకంగా మారింది.

ట్రాఫిక్ చలాన్లు

ఇవాళ్టి నుంచి అమలవుతున్న కేంద్రం కొత్త విధానాల్లో అత్యంత ముఖ్యమైనది మోటారు వాహనాల సవరణ చట్టం. ఈ కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక భారీగా జరిమానాలు కట్టాల్సిందే. అన్ని రకాల జరిమానాలు ఐదు నుంచి పదిరెట్లు పెరిగాయి.

గంటలో రుణాలు

ఇక ఇవాళ్టి నుంచి గంటలో రుణాలు మంజూరు కానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాల జారీకి సింగిల్ విండో విధానం అమల్లోకి వచ్చింది. అవసరమైన పత్రాలను పిఎస్ బీ లోన్స్ ఇన్ 59మినిట్స్ .కామ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన గంటలోపు వ్యక్తిగత, వ్యాపార, వాహన రుణాలు లభిస్తాయి.

కిసాన్ క్రెడిట్ కార్డులు

కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు వేగంగా అందనున్నాయి. దరఖాస్తు చేసిన పదిహేను రోజుల లోపు కార్డులొచ్చేస్తాయి.
డిజిటల్ పేమెంట్లకు కేవైసీ ధృవీకరణ
ఇవాళ్లి నుంచి అమల్లోకి వస్తున్న మరో కొత్త విధానం డిజిటల్ పేమెంట్లకు కేవైసీ ధృవీకరణ. పేటీఎం, ఫోన్ పే, ఇతర పేమెంట్ యాప్ లకు నో యువర్ కస్టమర్ ధృవీకరణ లేకపోతే ఆ యాప్ లు పనిచేయవు. యూపీఐ నెంబర్ ద్వారా డబ్బు లావాదేవీలు జరపొచ్చు.

స్విస్ బ్యాంక్ అకౌంట్స్

నల్లధనం వెనక్కి రప్పిస్తామంటూ బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు దిశగా తొలిఅడుగు ఇవాళే పడుతోంది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల వివరాలు ఇక అందరికీ తెలియనున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం ప్రకారం ఈ ఏడాది స్విస్ బ్యాంకుల్లో లావాదేవీలు జరిపిన భారతీయుల వివరాలు ఆదాయపు పన్ను శాఖకు స్విట్జర్లాండ్ అందిస్తుంది.

ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులకి చెక్
ఇక ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు ఇక పనిచేయవు. నిన్నటి వరు యాభైవేల రూపాయలకు మించి జరిగిన లావాదేవీల గురించి మాత్రమే ఆదాయపు పన్నుశాఖకు వివరణ ఇచ్చే కంపెనీలు ఇవాళ్టి నుంచి ప్రతి రూపాయికి వివరణ అందించాల్సిందే.
ధూమపానం మీద ఉక్కుపాదం
పొగాకు ఉత్పత్తులపై కొత్త రకం ప్రకటనలు కనిపించనున్నాయి. హెచ్చరిక చిత్రంలో క్విక్ టుడే కాల్ నెంబర్ ఉంటుంది.

ఓటరు కార్డు ఎడిటింగ

అలాగే గుర్తింపు పొందిన ఏదో ఒక కార్డు ఉపయోగించి ఓటరు కార్డులో తప్పులు సవరించుకోవచ్చు.

రైల్వేశాఖ సేవల ఛార్జీలు

డీమానిటైజేషన్ సమయంలో రద్దు చేసిన సేవల ఛార్జీలను రైల్వేశాఖ ఇవాళ్టి నుంచి మళ్లీ వసూలు చేయనుంది.

ఏపీ నూతన లిక్కర్ పాలసీ

ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయాలు జరగనున్నాయి. ఎవరూ మూడు బాటిళ్ల కన్నా ఎక్కువ మద్యం దగ్గర ఉంచుకోకూడదు. రాత్రి తొమ్మిదిగంటల వరకే మద్యం విక్రయాలు జరుగుతాయి.