legislative-council-jagan-yanamala

ఐదురోజుల్లోనే ఇన్ని తప్పులా!

ఇలా గతంలో ఏ ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీసి కడిగేసిన దాఖలాలు లేవు. కాని రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం నూతన ఒరవడిని సృష్టించిందంటున్నారు. ఇంతకీ మండలిలో రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యల మర్మాన్ని చూద్దాం. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నడూ లేని విధంగా సాక్షి ఒక్కటే కాదు. అన్ని పత్రికలు చదవాలన్నారు. నిన్నటిదాకా ఏ పత్రికలు చదవొద్దని చెప్పిన నోటితోనే తన మానస పుత్రిక అబద్దాల పుట్ట అని ఒప్పుకునేలా చేసింది ప్రతిపక్షం. ఆ రెండు పత్రికలు అంటూ తిట్టిన నోటితోనే అవే కరెక్టు అన్నారంటే మామూలు విషయంకాదు. ఇక సభలో మాటకుముందు సాక్షి, మాటకు వెనకాల సాక్షి అంటూ సాక్ష్యాలు చూపిస్తూ, అధికార పక్షానికి చుక్కలు చూపిస్తుండడంతో,ఇక వారిని సభలోకే రానివ్వకుండా వుండేలా చేస్తే పోలా అనుకున్నారో ఏమో అన్నట్లు యనమల మాటలు ఈటెలుగా దూసుకుపోయాయి.నిరంకుశ పోడకలకు వేదిక సభాసమావేశాలను వేదికగా వాడుకుంటున్నారన్నారు.

ఎన్నికల ముందునుంచీ ఓ రేంజ్‌లో చెప్పుకుంటూ వచ్చిన, నవరత్నాలను సైతం కేంద్ర ప్రభుత్వ పధకాలలో భాగం చేస్తామన్న మాటను గట్టిగానే ప్రతిపక్షం పట్టుకున్నది. ప్రభుత్వ డొల్లతనాన్ని బైట పెట్టారు. ప్రజా విశ్వాసాన్ని కాలరాసేసినట్లే అని ఎద్దేవా కూడా చేశారు. ఈ ఆరు నెలల్లో కొత్తగా మొదలు పెట్టిన పనిలేదు. పాత పనులకు పైసలిచ్చిందిలేదు. బిల్లు చెల్లింపులు అసలే లేవు. పూర్తి చేయాల్సిన పనులు ఆపేశారు. రెవిన్యూ దివాలా తీశారని యనమల ఏకరువు పెట్టారు. అసలే అసమర్ధ పాలన అంటే సభలో ఇచ్చిన సమాధానాలన్నీ అబద్దాలే అని ఆరోపణలు గుప్పించారు. సన్నబియ్యం ఉత్తదే. పెట్టుబడులు లేవు. ఉపాధి అసలే లేదు. రాజధాని పనులపై స్పష్టత లేదు. రైతు భరోసాపై నమ్మకమే లేదు. జీవో.2430 తో ఏం చెప్పాలనుకున్నారో వారికే స్పష్టత లేదు.

స్ధానికులకే ఉద్యోగాలు ఎన్నిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు, బిసి, మైనార్టీలకు 50శాతం పదవులు అన్నారు. కాని కీలక పదవులన్నీ దాదాపు 300 రెడ్డి సామాజిక వర్గానికే అంటూ లెక్కలు ముందుంచారు. అయినా పాలకపక్షం రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు రుద్దడమేమిటి? వాటికోసం వేల కోట్లు ఖర్చు చేయడమేమిటి? అన్నదానిపై కోర్టు కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతిని గుర్తుచేశారు. అసలు రంగులెవరేయమన్నారు? ఎవరేస్తున్నారు? ఎంత సొమ్ము విడుదల చేశారు? ఎంత ఖర్చు చేశారన్నదానికి సమాధానం లేదు. ఇదిలా వుంటే వేసిన వాళ్లతోనే తీసేయిస్తామన్న కోర్టు మాటలు మొట్టికాయలు కాదా? చీదరింపులో భాగంకాదా? ఎంతో గొప్పగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తామని చెప్పి, ఆ దిశగా ఒక్క అడుగైనా వేశారా? ఇక సాక్ష్యాత్తు వైసిపి ఎమ్మెల్యేనే రాష్ట్రంలో దళారుల బెడద పెరిగిందని, మాఫియా రాజ్యమేలుతుందని చెప్పిన మాటలు యనమల పొల్లుపోకుండా చెప్పారు.

రైతు రుణమాఫీలో రూ.8వేల కోట్లు ఎగ్గొట్టి, రైతు భరోసాను కేంద్ర స్కీమ్‌లో కలిపేశారని అంకెలు చెప్పారు. ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న పదివేలు రెండొంతల మందికి చెందనేలేదన్నారు. మీడియా విషయంలోనూ జరిగింది పొరపాటే అన్నది ఒప్పుకున్నాక ఇంక చెప్పుకోవడానికి ఏముంది? గొప్పలకు పోయి సాధించిందేముంది? లెక్కల గారడిలో బురిడీలు కొట్టిస్తే చాలనుకుంటే సరిపోయిందా అంటూ యనమల అంకెలు చెబుతుంటే, నోరెల్లబెట్టిన నేతలు కళ్లుతెరుస్తారో లేదో చూడాలి. నిజానికి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు అన్నవి సామాన్యమైనవి కాకపోయినా, వాటి అమలుపై ఎలాంటి కసరత్తులేకపోవడంతోపాటు, ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప మరేం ఇందులో లేకపోవడమే లోపభూయిష్టానికి కారణం. అదే మరోసారి తెలుగుదేశానికి ఆయుధమైపోయింది. ఎదురుదాడికి కారణమౌతోంది. వైసిపికి ఆరోపణలే దిక్కవుతున్నాయి.