ల్యాండ్‌ పూలింగ్‌ వద్దు

  • దళితులకు పేదలకు అన్యాయం
  • టిడిపి బాటలోనే వైసిపి
  • జిఓ 72 రద్దుకు సిపిఎం డిమాండ్‌

అమరావతి బ్యూరో: విశాఖపట్నంలో 6,116 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గుంజుకోవడానికి విడుదల చేసిన జిఓ72ను, అందుకనుగుణంగా జారీ చేసిన నోటి ఫికేషన్‌ను ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. మంగళవారం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు తో కలిసి ఆయన మాట్లాడారు. పేదలనుండి భూములు గుంజుకోవడంలో తెలుగుదేశం బాటలోనే వైసిపి ప్రభుత్వం కూడా నడుస్తోందని విమర్శించారు. విశాఖ చుట్టూగల ఎనిమిది మండలాల్లోని 55 గ్రామాల్లో బుధవారం నుండి సంప్రదింపుల పేరిట చేపడతామన్న తంతును నిలిపివేయాలని కోరారు. అసైన్‌మెంట్‌ భూములన్నీ దళితులు, పేదలవేనని తెలిపారు. ఆయా భూములపై ఆధారపడి బతుకు తున్న వేలమంది పేదలు ప్రభుత్వ నిర్ణయం వల్ల జీవనోపాధి కోల్పోతారన్నారు. పూలింగ్‌లో తీసుకున్న భూములలో 15 శాతం విశాఖ మెట్రో అభివృద్ధి సంస్థ తిసుకొని, దానిద్వారా వచ్చే ఆదాయంతో సదుపాయాలు కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారని మధు వివరించారు. భవిష్యత్‌లో రాజధాని పేరుతో మరింత సమీకరించే అవకాశమూ ఉందని అన్నారు. అత్యవసరం, అనివార్యమనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం తీసుకోవాలని సూచించారు. దీని ప్రకారం రైతులకు, ఆయా భూము లపై ఆధారపడిన పేదలు, వృత్తిదారులు, వ్యవసాయ కూలీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. భుముల విషయంలో ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంప్రదించలేదని, అఖిపక్ష సమావేశమూ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమరావతి లో చేసిన ల్యాండ్‌ పూలింగ్‌ను తమ పార్టీ వ్యతిరేకిం చిందని, విశాఖలోనూ వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
సిఆర్‌డిఏను రద్దు చేసే చట్టంలో ఇప్పటి వరకూ అక్కడ భూమిలేని పేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుండి రూ.5000 పెంచారని, పట్టా భూములతో సమానంగా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. అదే సమయంలో విశాఖపట్నంలో అటువంటిదేమీ ప్రకటించలేదని, కూలీలతోపాటు ఆయా భూములపై ఆధారపడ్డ మిగిలిన వారి ప్రస్తావన కూడా చేయలేదని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సమీకరణ పేరుతో రైతుల నుండి భూములు తీసుకుని రియల్‌ ఎస్టేట్‌కు ప్రోత్సాహాన్నిచ్చిందని, అదే పద్ధతిని వైసిపి కూడా అనుసరిస్తోందని పేర్కొన్నారు. విశాఖలో పూలింగు ప్రక్రియ చేపట్టాలనుకున్న
ప్రాంతంలో ఉన్న వారందరూ చిన్న, సన్నకారు రైతులేనని తెలిపారు.

ఇష్టారీతిన చేసుకుపోవడం సరికాదు
శాసనసభలో చేసిన నిర్ణయాలకు భిన్నమైన నిర్ణయం వ్యక్తం చేశారనే పేరుతో మండలి రద్దుకు తీర్మానం చేశారని,శాసనసభలో భారీ మెజార్టీ ఉంది కనుక ఇష్టారీతిన చేసుకుపోవడం సరి కాదన్నారు. కౌన్సిల్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వామపక్షాలు యు టర్న్‌ అంటున్నారని, తామెప్పుడూ ఒకే విధానంతో ఉన్నామని చెప్పారు. గవర్నర్‌, శాసనమండలి విషయంలో సిపిఎం విధానపరమైన నిర్ణయానికి కట్టుబడి ఉందని తెలిపారు. వాటి పాత్ర ప్రజాస్వామ్యంలో ఎంత ఉంటుందనేది గతంలోనే చెప్పామన్నారు. దానిలో ఎటువంటి మార్పూ లేదని అన్నారు.

విశాఖ పూలింగ్‌లో పరిహారం ఇలా
జిఓ 72 ప్రకారం అనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ, విశాఖపట్నం రూరల్‌, అనకాపల్లి మండలాల్లో భూములు తీసుకోనున్నారు. ఎకరం (4840 చదరపు గజాలు) అసైన్డ్‌ భూమికి 900 చదరపు గజాలు, పదేళ్లకు పైబడి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమికి ఎకరాకు 450 గజాలు, ఐదేళ్ల నుండి పదేళ్లలోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 చదరపుగజాలు ఇవ్వనున్నారు. కాగా పూలింగ్‌లో వచ్చిన మొత్తం భూమిలో 15 శాతం అంటే సుమారు 900 ఎకరాల అభివృద్ధి చేసిన భూమి విశాఖపట్నం మెట్రో అభివృద్ధి సంస్థ తీసుకుంటుంది. ఆ భూమిని అమ్మి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఏడు రోజులో నోటిఫికేషన్‌ ప్రక్రియ, 15 రోజుల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, తరువాత ఏడు రోజుల్లో పూలింగ్‌ సర్టిఫికేట్ల జారీ, ఈ మొత్తం ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి చేసి భూమిని స్వాధీనం చేసుకుంటారు. మూడు నెలల్లో అభివృద్ధి చేస్తామంటున్నారు.