‘జగన్ తుగ్లక్ తాత’

అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు. జగన్ సిఎం అయిన తర్వాత అమరావతి ప్రాజెక్టును నిలుపుదల చేశారన్నారు. రాజధాని అభివృద్ధికి బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని అన్నారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్  బ్యాంక్ కూడా రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు నుండి వెనక్కు తగ్గిందని పేర్కొన్నారు. సింగపూర్ కన్షార్షియం, లులూ కంపెనీలు వెనక్కిపోయాయన్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులను తరువాత వచ్చిన సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం కొనసాగించారని ఈ సందర్భంగా శేఖర్ గుప్తా గుర్తు చేశారు.

పాదయాత్ర ద్వారా జగన్ చరిత్ర సృష్టించారని నాలుగు నెలల క్రితం కితాబు ఇచ్చిన శేఖర్ గుప్తా నేడు జగన్ చర్యలను విమర్శించడం గమనార్హం. జగన్ ప్రజాసంకల్ప యాత్ర పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని శేఖర్ గుప్తా నాడు ఆవిష్కరించారు. ఆ సందర్భంలో శేఖర్ గుప్తా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలను, వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకువెళతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని కూడా శేఖర్ గుప్తా అన్నారు.