it raid on tdp ministers companies

టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ బంధువు ఆఫీసు, ఇళ్లపై ఐటీ దాడులు!

  • పేరం గ్రూపు ఆఫీసులో తనిఖీలు
  • ఉదయాన్నే చేరుకున్న ఐటీ బృందాలు
  • రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ

విశాఖపట్నం జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘పేరం’ గ్రూపుపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఈ రోజు దాడులు నిర్వహించింది. పేరం గ్రూపు అధినేత హరిబాబుకు చెందిన ఇళ్లతో పాటు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ రోజు ఉదయాన్నే విశాఖపట్నంతో పాటు మిగిలిన చోట్లకు చేరుకున్న ప్రత్యేక బృందాలు.. తనిఖీలు చేపడుతున్నాయి. దాదాపు 15 రోజుల క్రితం ఇక్కడ తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్మిన నేపథ్యంలో దానికి వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చెల్లించలేదన్న విషయమై ఐటీ శాఖ తాజా దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

కాగా, పేరం గ్రూపు అధినేత హరిబాబు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ బంధువు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో హరిబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కంపెనీ, ఇళ్లపై ఐటీ దాడులు చేస్తున్నారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.