హైవే క్లోజ్:చినకాకాని వద్ద ఆగిపోయిన వాహనాలు

రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొనకుండా అడ్డుకుంటున్న పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు మాజీ మంత్రులు, కీలక నేతలు, కార్యకర్తలను పోలీసులు ఈ ఉదయం గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనల్లో భాగంగా చినకాకాని వద్ద హైవేను దిగ్బంధించారు. రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. అంతకు ముందు హైవేపై ఉన్న వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెబుతూ లాఠీఛార్జీ చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.