గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత

సుదీర్ఘకాలంపాటు అనారోగ్యంతో పోరాటం
రక్షణ మంత్రిగా తనదైన ముద్ర
విషాదంలో బీజేపీ శ్రేణులు

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూశారు. పారికర్ వయసు 63 సంవత్సరాలు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన క్లోమగ్రంథి క్యాన్సర్ తో తీవ్రంగా సతమతమవుతున్నారు. అమెరికాలో కూడా చికిత్స పొందారు. గత సెప్టెంబరులో తిరిగి భారత్ వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల ముక్కులో పైపుతోనే విధులకు హాజరై అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. గత సంవత్సరం మార్చిలో ఆయన క్లోమగ్రంథి సమస్యతో బాధపడుతున్నట్టు మొదటగా గుర్తించారు. అప్పటికే సమస్య తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. కొన్నిరోజులుగా పారికర్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన బతికే అవకాశాలు తక్కువంటూ ప్రచారం జరిగింది. పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పారికర్ గతంలో దేశ రక్షణ మంత్రిగానూ విశేష సేవలందించారు.