english medium schools, ys jagan new polacy, english teachers

ఇంగ్లీష్ మీడియం వర్కవుట్ అవుతుందా?

ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రజల్లో చర్చ మొదలైంది. తెలుగును చంపేయడానికి తీసుకున్న నిర్ణయమంటూ కొందరు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతుంటే.. కెరీర్‌కు ఆంగ్లం ఎంతో ముఖ్యమైపోయిన ప్రస్తుత తరుణంలో ఇది చాలా మంచి నిర్ణయమంటూ సమర్థిస్తున్నారు మరికొందరు. మరికొందరు ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా అందుకు తగ్గ పరిస్థితులు ఇంకా లేవని, తగిన వనరులు కల్పించి అమలు చేయాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతమున్న ప్రభుత్వ ఉపాధ్యాయులూ ఇదే విద్యావ్యవస్థ నుంచి వచ్చినవారు కావడం, ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు వారికి శిక్షణలు లేకపోవడంతో హఠాత్తుగా మొత్తం ఆంగ్లమాధ్యమంలోకి మార్చితే వారు బోధించగలుగుతారా అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చి… ఆ తరువాత 2021 -22 విద్యాసంవత్సరం నుంచి 9 వ తరగతికి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మరుసటి సంవత్సరం నుంచి 10 వ తరగతికి కూడా అన్ని సబ్జెక్టులను ఇంగ్లీషులోనే చెప్పాలి. తెలుగు, ఉర్దూ ఇక భాషా సబ్జెక్టులుగా మాత్రమే ఉంటాయి. ఇక రాష్ట్రంలో విద్యాబోధన అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. జిల్లాల్లో ఉన్న డైట్ కేంద్రాలు ఇకపై ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు అవుతాయి.

ఏపీలో అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలో కలిపి 43 వేల గవర్నమెంటు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 1500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలోని 7 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1 నుంచి 8 వ తరగతి వరకు మొత్తం మీద 8,500 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమల్లో ఉంది. ఇప్పుడు సుమారు మరో 35 వేల పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ 1500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో బోధన జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మారుతాయి.

లక్ష మందికి శిక్షణ ఇవ్వాలి
తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుంది కాబట్టి తెలుగుకు వచ్చిన నష్టం పెద్దగా లేకపోయినా ఇంగ్లిష్ మీడియం బోధన ఎంత పక్కాగా సాగుతుందన్నదే ప్రశ్న. ఇంతవరకు తెలుగు మీడియంలో బోధించే ఉపాధ్యాయులు ఇకపై ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పాలి. అంటే వారందరికీ శిక్షణ ఇవ్వాలి. సుమారు 96 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంచనా వేసింది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్న వారికి శిక్షణ అవసరం ఉండదు. తెలుగు మీడియంలోనే చదువుకుని, తెలుగు మీడియంలోనే బోధిస్తున్న వారికి మాత్రం శిక్షణ తప్పనిసరి.

తెలుగు మీడియం చదువుకున్న టీచర్లు ఇంగ్లిష్‌లో బోధించగలరా?
ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది తెలుగు మీడియం లో చదువుకుని తెలుగు మీడియంలో బోధిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడంలో వీరు సరైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం ఉండకపోవచ్చు. అలా జరిగితే ప్రమాణాలు పడిపోయే ప్రమాదముంది. ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మారడం వల్ల ఎదురయ్యే కష్టాలను అధిగమించలేక డ్రాపవుట్లు పెరగకుండా చూడాలి. మరీ ముఖ్యంగా బాలికలు స్కూళ్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

నిపుణుల కమిటీలు ఏం చెబుతున్నాయి?
నిజానికి కొత్త విద్యావిధాన ముసాయిదాలో కూడా 8 వ తరగతి దాకా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్ కమిటీ 5వ తరగతి దాకా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించింది. ఇక గిరిజనుల విషయానికి వస్తే గిరిజన భాషల్లో కనీసం ప్రాథమిక స్థాయి వరకు బోధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే తెలుగు, ఇంగ్లీషు బోధించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటి వరకూ మాతృభాషలో బోధిస్తున్నపుడే విద్యాప్రమాణాలు సరిగా ఉండడం లేదు. ఇక ఇంగ్లీషులో బోధిస్తే ప్రమాణాలు మరింత దిగజారుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవీ సమస్యలు.. వీటిని అధిగమించాల్సిందే..
* 2017లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం 6,7, 8 తరగతుల్లో 15 శాతం మంది విద్యార్థులే ఇంగ్లీషు సరిగా చదవగలుగుతున్నారు. 85 శాతం మంది ఇంగ్లీషు సరిగా చదవలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన చేస్తే విద్యార్థులు అందుకోగలరా అన్నది చూడాలి.

* ఇక 20 వేల పాఠశాలల్లో ముగ్గురు కంటే తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులున్నాయి. ఆ స్కూల్లలోనూ బోధన పెద్ద సమస్యగా మారుతుంది. అక్కడి ఉపాధ్యాయులకు బోధన కత్తి మీద సాము అవుతుంది.
Tags: english medium schools, ys jagan new polacy, english teachers