Cyber Crime, Bank Cash, without OTP

OTP రాకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ.5.10 లక్షలు మాయం!

  • పలు విడతలుగా లక్షలాది రూపాయలు విత్‌డ్రా
  • మొబైల్‌కు రాని మెసేజ్‌లు
  • సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు

మొబైల్ నంబరుకు ఓటీపీ రాకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ. 5.10 లక్షలు మాయమైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని అయిన పి.జయలక్ష్మి ముషీరాబాద్‌లో ఉంటారు. నాలుగు నెలల క్రితం తీర్థయాత్రలకు వెళ్లిన ఆమె, ఆ తర్వాత ముంబైలోని కుమార్తె వద్దకు వెళ్లి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ఆమె పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్లారు. పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేయించుకున్న ఆమె అందులోని వివరాలు చూసి విస్తుపోయారు.

అందులో నెల నెలా పింఛను జమ అవుతున్నట్టు వివరాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబరు వరకు పలు విడతలుగా రూ. 5.10 లక్షలు విత్‌డ్రా అయినట్టు చూసి షాకయ్యారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు తన మొబైల్‌కు ఓటీపీ కానీ, మెసేజ్ కానీ రాలేదని అధికారులకు ఆమె తెలిపారు. వారి సలహా మేరకు జయలక్ష్మి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Cyber Crime, Bank Cash, without OTP