రాజధానిపై టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.277 కోట్లు మాత్రమే

నవంబరు 28, 2019
అమరావతి: తొలి దశ కోసం రూ.1.09 లక్షల కోట్లతో ప్రణాళిక రూపొందించారు

రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి రూ.52 వేల కోట్ల పనులకు టెండర్లు పిల్చారు
ఆ రూ.5 వేల కోట్లు కూడా వివిధ వాణిజ్య బ్యాంకుల రుణమే..
ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం..: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అంటే ఆస్తులు అమ్మడమేనా? ప్రశ్నించిన ఆర్థిక మంత్రి
రాజధానిని ఏకంగా 8 వేల చదరపు కిలోమీటర్లతో ప్లాన్‌ చేశారు
ముంబై మెట్రోపాలిటన్‌ సిటీ పరిధి కూడా 6300 చ.కి.మీ. మాత్రమే
ఢిల్లీ నగర పరిధి 1300 చ.కి.మీ. చెన్నై కార్పొరేషన్‌ పరిధి 426 చ.కి.మీ
అమరావతి కోసం ఏకంగా 8000 చ.కి.మీ. పరిధి అవసరమా?
ఇదేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం? నిలదీసిన మంత్రి బుగ్గన
రాజధానిలో నిర్మించిన భవనాలు కూడా అన్నీ తాత్కాలికమే
లోపభూయిష్టంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల నివాసాల ఇళ్లు
స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం నికరంగా చేసిన ఖర్చు కేవలం చేసిన ఖర్చు రూ.277 కోట్లు మాత్రమే అని, అదే సమయంలో రాజధాని మొదటి దశ కోసం రూ.1.09 లక్షల కోట్లతో ప్రణాళిక రూపొందించారని ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. గత 5 ఏళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసిన గత ప్రభుత్వం ఏకంగా రూ.52 వేల కోట్ల పనులకు టెండర్లు పిల్చిందని, ఆ ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లు కూడా వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి పొందారని ఆయన తెలిపారు.
రాజ«ధాని నిర్మాణం పూర్తయ్యాక ఏటేటా ఆస్తులు అమ్మి ఏకంగా రూ.79 వేల కోట్ల ఆదాయం పొందుతామని గత ప్రభుత్వం ప్రకటించిందన్న ఆర్థిక మంత్రి, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అంటే ఆస్తులు అమ్మడమేనా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధానిని ఏకంగా 8 వేల చదరపు కిలోమీటర్లతో ప్లాన్‌ చేశారని చెప్పారు. దేశంలో అతి పెద్ద వాణిజ్య నగరమైన ముంబై మెట్రోపాలిటన్‌ సిటీ పరిధి కూడా 6300 చ.కి.మీ. మాత్రమే అని, ఇక ఢిల్లీ నగర పరిధి 1300 చ.కి.మీ. కాగా, చెన్నై కార్పొరేషన్‌ పరిధి 426 చ.కి.మీ అని మంత్రి వెల్లడించారు. అలాంటికి అమరావతి కోసం ఏకంగా 8000 చ.కి.మీ. పరిధి అవసరమా? అన్న ఆయన, ఇదేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం? అని నిలదీశారు.
రాజధానిలో నిర్మించిన భవనాలు కూడా అన్నీ తాత్కాలికమే అని గుర్తు చేసిన ఆర్థిక మంత్రి, లోపభూయిష్టంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల నివాసాల ఇళ్లు డిజైన్‌ చేశారని గురువారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

చంద్రబాబు పర్యటన
కొన్నేళ్ల క్రితం తమ భూములు తీసుకున్నారని, ఇవ్వకపోతే బెదిరించారని, కానీ ఇప్పటి వరకు తమకు తిరిగి ఏమీ ఇవ్వలేదని రాజధాని ప్రాంత రైతులు అడిగారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొంత ఆందోళన కూడా చోటు చేసుకుందని, దాన్నే హైలైట్‌ చేసిన చంద్రబాబు చాలా విషయాలు మాట్లాడారని అన్నారు.
భూమి డెవలప్‌ చేసి ప్లాట్లు ఇస్తామన్నారని, సింగపూర్, టోక్యో, లండన్‌ వంటి నగరాలు వస్తాయని చెప్పారని, కానీ కంపచెట్లు తప్ప మరేమి లేదని రైతులు అడిగితే, చంద్రబాబు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారని ఆక్షేపించారు. తాను గ్రాఫిక్స్‌ చేయలేదన్న చంద్రబాబు, ఇవాళ్టి వాస్తవ పరిస్థితిపై క్లారిటీ ఇవ్వాలంటూ.. నాడు టీడీపీ ప్రభుత్వం చూపుతూ వచ్చిన గ్రాఫిక్స్‌ను, ఇప్పటి వాస్తవ పరిస్థితిని మంత్రి ప్రదర్శించి చూపారు.
ఆ గ్రాఫిక్స్‌లో చూపిన దాంట్లో 90 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 10 శాతం మాత్రమే మిగిలాయని చంద్రబాబు తనకు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. ఆ గ్రాఫిక్స్‌ను ప్రపంచ స్థాయిలో రూపొందించారని, కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని చెప్పారు. అయినా అది తన డ్రీమ్‌ క్యాపిటల్‌ అని, దాన్ని ఈ ప్రభుత్వం ఆపేసిందని చంద్రబాబు చెబుతున్నారని, ఆ విధంగా ఈ మధ్య చంద్రబాబు పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
‘తాను కట్టిన బ్రహ్మాండమైన అసెంబ్లీ నుంచే పరిపాలిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. అయితే అవి తాత్కాలిక భవనాలు మాత్రమే అని, శాశ్వత భవనాలు ఇంకా కడతామని చెబుతున్నారు. అంటే దేనిపైనా మీకు ఒక క్లారిటీ లేదు. చిన్నప్పుడు ఒక కధ చదివాము. ఒకాయన బూర ఊదుతూ పిల్లలను కొండ గుహలోకి తీసుకెళ్తాడు’ అని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు.

వికేంద్రీకరణ ద్వారానే..
‘తాను ప్రపంచ స్థాయి రాజధాని కట్టి, సంపద సృష్టించేందుకు ప్రయత్నించానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ వాస్తవం ఏమిటి?
ప్రపంచంలో ఎక్కడైనా వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ పక్కన మహారాష్ట్ర చూడండి. ముంబైతో పాటు, పూణె, నాసిక్, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్‌ అభివృద్ధి చెందాయి. అదే విధంగా కర్ణాటక, తమిళనాడులో పలు నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఎక్కడా వాళ్లు కేంద్రీకరణ చేయలేదు.
రాజధాని నగరాలు ఎక్కడా నిర్మించబడలేదు. కేంద్రీకరణ ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగాలు వస్తాయంటున్నారు. కానీ అది జరగదు. నేను సవాల్‌ చేస్తున్నాను. వికేంద్రీకణ ద్వారానే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యం. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ద్వారా నగరాలు కడితే, ఏడాదికి ఒకటి కట్టవచ్చు కదా?’ అని మంత్రి శ్రీ బుగ్గన ప్రశ్నించారు.

నాలుగున్నర ఏళ్లు ఏం చేశారు?
రాజధాని నోటిఫై చేయలేదని తమను నిందిస్తున్నారని, మరి నాలుగున్నర ఏళ్లు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు.
‘మేము వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు. గత ప్రభుత్వం దిగిపోతూ అస్తవ్యస్త పరిస్థితి వదిలారు. వాటిని చక్కదిద్దడమే సరిపోతోంది. కానీ కేంద్రంలో అధికారం పంచుకున్న మీరు నాలుగున్నర ఏళ్లు, కనీసం రాజధానిని మ్యాప్‌లో పెట్టించలేకపోయారు’ అని శ్రీ బుగ్గన నిలదీశారు.
అవినీతిని మేము నిరూపించలేకపోతున్నామని అంటున్నారన్న ఆయన, త్వరలోనే అది జరుగుతుందని వెల్లడించారు.

టెండర్లలో రింగ్‌
గత ప్రభుత్వంలో దాదాపు రూ.3 వేల కోట్ల ప్రపంచ బ్యాంక్, ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంక్‌ (ఏఐఐబి) రుణం ద్వారా రాజధాని కడతామని చెప్పారని, కానీ వారికి అనుమానం వచ్చి తనిఖీ చేస్తామన్నారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్‌ ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే, వారు వచ్చి అన్నీ చూశారని, ఇక్కడ ఏదీ సక్రమంగా లేదని వారు గుర్తించారని చెప్పారు.
టెండర్లలో ఎల్‌–5, ఎల్‌–6, ఎల్‌–7 దాదాపు ఒకే విధంగా ఉన్నాయని వారు తేల్చారని, మరోవైపు ఎల్‌–2లో ఎల్‌టీ ఉండి 17 శాతం అధికంగా కోట్‌ చేసిందని, మూడు ప్యాకేజీల కోసం అంతా రింగ్‌ అయి, టెండర్లు వేశారు. దీంతో అది నిల్చిపోయిందని వివరించారు.

వాస్తవ ప్రణాళిక ఏమిటి?
అమరావతికి సంబంధించి వాస్తవంగా మీ ప్రణాళిక ఏమిటి? అని గత ప్రభుత్వాన్ని నిలదీసిన ఆర్థిక మంత్రి, వాటన్నింటినీ వివరించారు.
‘రాజధాని నిర్మాణం మొదటి దశలో రూ.1.09 లక్షల కోట్లు కావాలి. అదీ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ద్వారా కడతామని చెప్పారు. కేంద్రం నుంచి గ్రాంట్‌ రూ.11,602 కోట్లు తెస్తామన్నారు. కానీ వాస్తవంగా వచ్చింది కేవలం రూ.1500 కోట్లు మాత్రమే. హుడ్కో నుంచి అప్పు రూ.1275 కోట్లు, ఆంధ్రా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల నుంచి రూ.2060 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు.. ఇలా వీటన్నింటి ద్వారా రూ.5 వేల కోట్లు తెచ్చారు’
‘ఇక ఏపీ ప్రభుత్వం నుంచి ఈక్విటీ కాంపోనెంట్‌ రూ.6629 కోట్లు ఇస్తామని, ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్‌ నుంచి రూ.3600 కోట్లు, వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు, బాండ్ల ద్వారా మరో రూ.3 వేల కోట్లు సేకరిస్తామన్నారు’.
‘అంటే మీరు రూ.1.09 లక్షల కోట్ల ప్లాన్‌ చేసి, కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ఏకంగా రూ.52 వేల కోట్లకు టెండర్లు పిలిచారు మొదటి దశలో. ఆ తెచ్చిన రూ.5 వేల కోట్లు కూడా వాణిజ్య బ్యాంకుల నుంచి తెచ్చారు. అది ఎంత భారం. ఆ వడ్డీ ఎవరు కడతారు? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా?’ అని మంత్రి శ్రీ బుగ్గన నిలదీశారు.
రూ.62 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ను అడిగారని, కానీ నిజానికి కేంద్రం నయా రాయపూర్, రాంచి, భువనేశ్వర్‌కు ఎంతెంత ఇచ్చారు? అన్నది కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదని ఆక్షేపించారు.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అంటే.. ఆస్తులు అమ్మడమా?
‘రాజధాని నిర్మించాక ఆస్తుల అమ్మకం ద్వారా రూ.79 వేల కోట్లు వస్తాయని గత ప్రభుత్వం చెప్పింది. అది కూడా 2017లో రూ.425 కోట్ల ఆస్తి అమ్మకం, 2023లో రూ.1295 కోట్లు, 2024 లో రూ.1834 కోట్లు, 2025లో రూ.2885 కోట్లు, 2026లో రూ.4681 కోట్లు.. ఆ విధంగా 2030 నాటికి రూ.7425 కోట్లు వస్తాయి. అలా 2037 వరకు ఇక్కడ ఉండే ఆస్తులు అమ్ముతారంట. అసలు ఏమిటిది? ఇదేమన్నా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా?’ అని మంత్రి అడిగారు.

అసాధారణ వ్యయం
రాజధాని నిర్మాణంలో అసాధారణ స్థాయిలో ఖర్చు చేశారని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో కిలోమీటరు రోడ్డుకు ఏకంగా రూ.46 కోట్లు ఖర్చు చేశారని,
భవన నిర్మాణంలో ఒక్కో చదరపు అడుగుకు భూమి విలువ కాకుండా రూ.6995 చొప్పున లెక్క కట్టారని చెప్పారు. నిజానికి రూ.5 వేలకు ఒక్కో చదరపు అడుగు హైదరాబాద్‌లో భూమి విలువతో సహా కడతారని గుర్తు చేసిన ఆయన, అలాంటిది గత ప్రభుత్వం భూమి విలువ కాకుండా చదరపు అడుగుకు రూ.6995 చొప్పున కట్టిందని వివరించారు.

అసలు రూ.277 కోట్లు మాత్రమే
‘మీ ప్రణాళిక ప్రకారం రాజధాని మొదటి దశ నిర్మాణం కోసం రూ.1.09 లక్షల కోట్లు కావాలి. అందులో రూ.5 వేల కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చారు. కానీ మీరు ప్రభుత్వ ఖజానా నుంచి కేవలం రూ.277 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా చెప్పాలంటే రూ.1771.77 కోట్లు మీరు ఖర్చు పెడితే అందులో కేంద్రం నుంచి రూ.1500 కోట్లు వస్తే, మీరు ఖర్చు చేసింది కేవలం రూ.277 కోట్లు మాత్రమే. ఏటా ఇంతింత అమ్మకం చేస్తామంటూ దాన్ని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అంటున్నారు’ అని మంత్రి వివరించారు.
రాజధాని పేరుతో సింగపూర్, జపాన్, లండన్, చైనా, కొలంబో ఎక్కడెక్కడో తిరిగారని, వెళ్లిన ప్రతి ఊరి నుంచి ఏదేదో వస్తుందని ప్రచారం చేశారని గుర్తు చేశారు. బులెట్‌ ట్రెయిన్‌ వస్తుందన్నారని, నిజానికి దానికి ఏకంగా రూ.1.50లక్షల కోట్లు కావాలని చెప్పారు.

రూ.300 కోట్లకు బదులు రూ.1400 కోట్లు
‘కృష్ణా నదిపై ఐకాన్‌ బ్రిడ్జి రూ.300 కోట్లతో కట్టవచ్చు. కానీ మీరు రూ.1400 కోట్లు ప్రతిపాదించారు. అది జనంపైనే భారం కదా?’ అని మంత్రి స్పష్టం చేశారు.

ఐటీలో మీరు చేసిందేమీ లేదు
‘మాట్లాడితే హైదరాబాద్‌ కట్టామంటారు. రాత్రి 2 గంటల వరకు పని చేశామని చెప్పారు. అంత పని మీకు ఏముంది?. హైదరాబాద్‌లో ఒక హైటెక్‌ సిటీ మాత్రమే కట్టారు. అది కూడా మీ ఘనత కాదు. నిజానికి చంద్రబాబు అధికారం చేపట్టి, దిగిపోయే నాటికి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు తగ్గాయి. కాదంటారా చెప్పండి?
ఐటీ రంగంలో బెంగళూరు టాప్‌లో ఉంది. దాంతో సమానంగా హైదరాబాద్‌ రావాలి. కానీ మీ వల్ల అది సాధ్యం కాలేదు. సైబర్‌ టవర్స్‌ కట్టి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు ఇచ్చారు. వారు వాటిని తిరిగి ఐటీ సంస్థలకు అమ్ముకున్నారు.
కానీ చెన్నై, బెంగళూరులో ఆయా ప్రభుత్వాలే నేరుగా ఐటీ సంస్థకు భవనాలు అమ్మాయి. అదే విధంగా మరిన్ని సంస్థలు వచ్చేలా టెండర్లు విభజించారు. మీరు అన్నింటినీ కలిపి ఒకే టెండరు ఇచ్చారు’ అని మంత్రి శ్రీ బుగ్గన వివరించారు.

విశాఖలో ఎందుకు అభివృద్ధి చేయలేదు?
‘మీరు హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి ఉంటే, ఈ 5 ఏళ్లలో విశాఖలో ఐటీ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? మీకు వైజాగ్‌ మీద ఎందుకు కోపం? ఆ నగరానికి ఏం తక్కువైంది? అక్కడ అన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఐటీ రంగానికి ఎంతో అనుకూల పరిస్థితి ఉంది. కానీ మీరు పట్టించుకోలేదు. అదే విధంగా అనంతపురం జిల్లా సరిహద్దు. బెంగళూరు చేరువలో. కానీ మీరు ఏ పని చేయలేదు. మాట్లాడితే మేము అభివృద్ధి పనులు చేయడం లేదంటున్నారు. మీరు సింపుల్‌గా కొబ్బరికాయ కొడతారు. మేమే నిర్మించాలా?’ అని మంత్రి నిలదీశారు.

ఇదేనా ప్లాన్‌?
‘మరోవైపు లోకేష్‌..ఏదేదో మాట్లాడుతున్నారు. బుగ్గనగారూ ఈ బిల్డింగ్‌ చూశారు కదా? అంటే ఏదేదో వ్యాఖ్యానించారు. ఈ కాలంలో ఎవరైనా అలా డిజైన్‌ చేస్తారా? ఒక ఎమ్మెల్యేకు 3 వేల చదరపు అడుగుల ఫ్లాట్‌ అవసరమా? అది కూడా ఒక పెద్ద హాలు. దాని చుట్టూ బెడ్‌రూమ్‌లు. అంటే బెడ్‌రూమ్‌ తలుపు తెరిస్తే, హాలులో అందరికీ కనిపిస్తుంది. కనీసం వాటికి కిటికీలు కూడా లేవు. ప్రైవసీ ఏ మాత్రం లేదు. కిచెన్, బెడ్రూమ్‌లు హాలులో అందరికీ కనిపిస్తే ఎలా?’ అని మంత్రి ప్రశ్నించారు.

ఆనాడు ఎందుకు అడ్డుకున్నారు?
‘ఇక అడ్డుకున్న వారిని తిడుతున్నారు. మీరు సుందరమైన నగరం కడుతుంటే, మేథాపాట్కర్, రాజేంద్రసింగ్‌ వస్తే.. మీరు ఆనాడు ఎందుకు అడ్డుకున్నారు?’ అని నిలదీశారు.
చంద్రబాబు ఉద్ధండరాయపాలెంలో నేలను ముద్దు పెట్టుకున్నారని ప్రస్తావించిన మంత్రి, ఆయన ఇక్కడ సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఇక్కడ సొంత ఇల్లు కట్టి, అందులో ఉంటున్నారని, అదే సమయంలో చంద్రబాబు ఒక అక్రమ నివాసంలో ఉంటున్నారని గుర్తు చేశారు.
70 ఏళ్ల వయసులో అనైతికంగా మాట్లాడుతున్నారని, అందుకు బదులుగా సూచనలు ఇవ్వాలని, ఒక ప్రణాళిక చెప్పాలని సూచించారు. డిసెంబరు 31, 2014న దీన్ని రాజధాని అని ప్రకటించి, 2019 వరకు దాన్ని మ్యాప్‌లో ఎందుకు పెట్టించలేకపోయారని నిలదీశారు.

సింగపూర్‌ ప్రభుత్వానికి సంబంధం లేదు
‘సింగపూర్‌ కంపెనీల తరపున అక్కడి ప్రభుత్వం స్పందిస్తే, దాన్ని పట్టుకుని సింగపూర్‌ ప్రభుత్వం స్పందన అంటున్నారు. ఎక్కడైనా అలాగే ప్రభుత్వాలు రాస్తాయి. ఇక్కడ 1700 ఎకరాలు సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కోసం వారికి అప్పగించారు. వారు కేవలం ప్లాట్లు మాత్రమే వేస్తారు. డిజైన్, మాస్టర్‌ ప్లాన్‌ సింగపూర్‌ వాళ్లు ఇచ్చారంటున్నారు.
ఆ విధంగా రియల్‌ ఎస్టేట్‌ చేసే వారు ఇక్కడ ఎవరూ లేరా? ఇక్కడ ఆ పని ఎవరూ చేయలేరా?. నిజానికి ఈ ఒప్పందంలో సింగపూర్‌ ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఆ దేశానికి చెందిన రెండు కంపెనీలకు మాత్రమే ఈ ప్రభుత్వం భూమి ఇచ్చింది. కానీ టీడీపీ మాత్రం సింగపూర్‌ ప్రభుత్వం వెనక్కి పోయిందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ రెండు కంపెనీలు కూడా ఇక్కడ వాస్తవాలు గుర్తించాయి కాబట్టి, వారంతట వారే వెనక్కి తగ్గారు’ అని మంత్రి వివరించారు.

రాజధానికి అంత అవసరమా?
‘రాజధానిని సీఆర్డీఏ పరిధిలో 8వేల చదరపు కిలోమీటర్లలో ప్లాన్‌ చేశారు. ముంబై మెట్రోపాలిటన్‌ సిటీ పరిధి కాబట్టి 6300 చదరపు కిలోమీటర్లు. చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి కేవలం 426 చ.కి.మీ, కోల్‌కత్తా 1800 చ.కి.మీ మాత్రమే. ఇక ఢిల్లీది 1300 చ.కి.మీ. మాత్రమే. మరి నిజంగా అమరావతి పరిధి 8 వేల చదరపు కిలోమీటర్లలో నిర్మాణం సా«ధ్యమా? ఇది ప్రజలను మభ్య పెట్టడం కాదా?. ఆ విధంగా ఎంత కాలం మభ్య పెడతారు?’ అని మంత్రి శ్రీ బుగ్గన అన్నారు.
గత ప్రభుత్వం అవినీతిపై త్వరలోనే అన్నీ తెలుస్తాయని, అన్నీ బయట పడతాయని చెప్పారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో మరిన్ని అప్పులు చేసి ప్రజల నెత్తిన మోపడం కరెక్టా? లేక ఉన్నంత దాంట్లో కట్టుకోవడం మేలా? ఆలోచించాలని కోరారు.

కేంద్రాన్ని నిధులు అడుగుతాము
‘మనకు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో హక్కు ఉంది. నిధులు అడగవచ్చు. ఆ దిశలో ప్రయత్నం చేస్తాము. ఆర్థికంగా ఇంకా స్థిరపడాల్సి ఉంది. అది పూర్తయ్యాక అన్నీ పక్కాగా ప్లాన్‌ చేస్తాము. నగరం తనకు తానుగా పెరగాలి తప్ప, నిర్మాణం సాధ్యం కాదు. జనాభా పెరిగే కొద్దీ అది అభివృద్ధి చెందుతుంది
అంతేతప్ప అప్పు తెచ్చి నగరం నిర్మిస్తే, రేపు దాన్ని ఎవరు కట్టాలి? అది ప్రజలపై భారమే కదా?’ అని మంత్రి అన్నారు.
తమకు ప్రజల డబ్బు విలువ తెలుసు కాబట్టే, తాత్కాలిక భవనాల నుంచి పరిపాలన చేస్తున్నామని, ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
రైతులకు పెట్టుబడి సహాయం చేయడంతో పాటు, బీమా సదుపాయం ప్రయోజనాలు వివరిస్తున్నామని, దాని వల్ల వారు బాగు పడతారని మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు.