amaravathi capital

ప్రజలు ఆలోచన చేయాలి….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం రాజుకున్న అగ్గి..మూడు రాజధానులు..ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి ఈ మాట వెలువడిందో ఉత్తర క్షణం నుంచి నిరసనలు..ఉద్యమాలు..భిన్నస్వరాలు..పగలు.సెగలు..తలోమాట.. చెరో రాయి..
వాస్తవానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు మన కొత్త రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రతిపాదించిన రోజులలో ఇదే జగన్ సహా ఇంచుమించు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.రాష్ట్రం విడిపోయినప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వాడుకోవడానికి పది సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు చొరవ తీసుకుని అతి తక్కువ వ్యవధిలోనే అమరావతికి పురుడు పోసి రాజధానిని తరలించారు.అలాగే హైకోర్టును కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి అన్నివర్గాల ప్రజల మన్ననలను అందుకున్నారు..ఏ విజయమైనా ఒక్క వ్యక్తి వల్లనే సాధ్యం కాదన్నది నిజమే అయినా వచ్చే కీర్తిలో సింహభాగం నాయకుడికే దక్కుతుందనడంలో సందేహం లేదు.అప్పుడు సాధించిన విజయాలైతెనేమి..చేసిన కృషి అయితేనేమి చంద్రబాబుకు గాని..ఆయన పార్టీకి గాని మొన్నటి ఎన్నికలలో విజయాన్ని సాధించిపెట్టలేకపోయాయి..

Chandrababu-Naidu-Begins-Funds-Hunt-for-Amaravati

ఇది గతం..!
ప్రజలు మార్పు కోరుకున్నారు.అఖండ మెజారిటీతో జగన్ కు విజయాన్ని కట్టబెట్టారు.ముఖ్యమంత్రిగా జగన్ చాలా సాధిస్తారని ఆశించి గెలిపించిన ప్రజలకు గడిచిన కొద్ది నెలలుగా ఒనగూరిన ప్రయోజనాలపై స్పష్టత లేకపోగా అయోమయం ఎక్కువైపోయింది..ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా ఒక రకమైన సందేశాన్ని,సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడంతో తన వైఖరిని బయటపెట్టిన జగన్ ఆనాటి నుంచి ఒకవైపు జనహిత కార్యక్రమాలంటూ కొన్ని పథకాలను ప్రకటిస్తూనే..మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ అవకతవకలేనని ఎత్తిచూపే ప్రయత్నంలోనే ఎక్కువగా తలమునకలయ్యారనేది బహిరంగరహస్యం..ప్రజావేదిక కూల్చివేత ప్రజాహిత నిర్ణయంగా గాక చంద్రబాబుపై కక్షసాధింపు కోసమే చేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది..చంద్రబాబు ఆ భవనాన్ని తమ అవసరాల కోసం అడిగినంతనే కూల్చివేత నిర్ణయం తీసుకుని యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేయడాన్ని ప్రజలు..అందులో టిడిపి సానుభూతిపరులు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోయారు..చంద్రబాబుపై కోపంతో ప్రజాధనాన్ని లెక్క చేయలేదన్న విమర్శ స్వపక్షం నుంచి సైతం కూడా వినిపించకపోలేదు.

అమరావతిలోగాని..
ఇంకెక్కడైనా గాని ఇలాంటి అక్రమ భవనాలపై ఇంత త్వరగా చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నతో పాటు ఇందుకోసం కృత్రిమ వరదలను కూడా సృష్టించారనే విమర్శలూ వెల్లువెత్తాయి..ఇదే గాక పోలవరం విషయంలో కూడా జగన్ సర్కార్ అవసరమైన వేగంతో పనిచేయడం లేదన్న మాటలు కూడా జోరుగానే వినిపించడం మొదలైంది..ధరలను అదుపు చేయకపోగా కొన్ని వరాలను పరిమితికి మించి ప్రకటిస్తూ ఆర్థిక భారాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి రాష్ట్రాన్ని దివాళా దిశగా నెట్టేస్తూ ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలనే డిమాండ్ మొదలయ్యే వరకు పరిస్థితులను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్…ఇలాంటి సమయంలోనే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి మరింత గందరగోళ..అయోమయ..
కల్లోల పరిస్థితులు తలెత్తడానికి ద్వారాలు తెరిచారు జగన్మోహనరెడ్డి..రాజధాని గందరగోళం విషయంలో రాష్ట్రప్రజలు రెండువర్గాలుగా విడిపోయినంత పనైంది..ఇలాంటి పరిస్థితిని జగన్ సైతం ఊహించి ఉండరు..మెజార్టీ బలంతో నెట్టుకొచ్చేయ వచ్చుననుకున్నారో..లేదా తెలుగుదేశం పార్టీ చచ్చిన పామే కదా ఏం చేయగలుగుతుందిలే అని ధీమా పడ్డారో..మొత్తానికి మాట బయటకు వచ్చింది..అగ్గి రాజుకుంది..ఇప్పుడిది ప్రజలకు..రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారంగా గాక ఇద్దరు వ్యక్తులకు..రెండు పార్టీలకు మధ్యన జరుగుతున్న పోరాటంగా..అంతకు మించి రెండు కులాల నడుమ రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మారిపోయింది..చంద్రబాబు కులస్తులు అమరావతిలో..చుట్టుపక్కల భూములు తక్కువ ధరకు కొనేసి ఆనక రాజధానిని ప్రకటించారని వైసిపి నాయకులు ప్రచారం చేస్తుంటే..జగన్ కు..ఆయన పార్టీ నేతలకు విశాఖ పరిసర ప్రాంతాలలో కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి గనక..వాటి ధరలను మరింతగా పెంచుకుని లాభపడేందుకు పథకాలు రచిస్తున్నారని తెలుగుదేశం నాయకులు కోడై కూస్తున్నారు..మధ్యలో సందట్లో సడేమియాలు ఉత్తరాంధ్ర..రాయలసీమ అభివృద్ధి మాత్రం అవసరం లేదా అంటూ తెలిసీ తెలియని సన్నాయినొక్కులు ప్రారంభించారు..
అసలు రాష్ట్రంలో ఏ ప్రాంతం మనది కాదు చెప్పండి..హైదరాబాద్ విపరీతంగా అభివృద్ది చెందుతున్నప్పుడు ఇలాంటి పోకడలు కనిపించలేదు..వినిపించలేదు..

మన రాజధాని ఆసియాకే తలమానికంగా ఎదుగుతుందని చంకలు గుద్దుకున్నాం..కాంగ్రెస్ గాని..తెలుగుదేశం గాని..చంద్రబాబు గాని.. వైఎస్ గాని హైదరాబాద్ కు ప్రాధాన్యత ఇస్తూ..విశాఖను..రాజమండ్రి..విజయవాడ..కర్నూలు..నెల్లూరు..చివరికి తిరుపతిని సైతం చిన్నచూపు చూసిన రోజుల్లో జనం గాని..పార్టీలు గానీ నోళ్ళు మెదపలేదే.. మరిప్పుడెందుకు ఈ ప్రాంతీయ వైషమ్యాలు..ముందే చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు..రెండు పార్టీలు..రెండు కులాల మద్య పోరులో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున రెండు వర్గాలుగా చీలిపోయే దుస్థితి దాపురించింది…ఇప్పుడు రాజధాని వ్యవహారం చంద్రబాబు..జగన్ వ్యక్తిగత ప్రతిష్ట..తెలుగుదేశం.. వైసిపి ఆధిపత్య పోరుకు వేదికగా మారిపోయింది..మొన్నటి ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకుని వచ్చే పంచాయితి.. మున్సిపల్ ఎన్నికల నాటికి తమ పార్టీ కొంతయినా పుంజుకునేలా రాజధాని వివాదాన్ని వాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ఇప్పుడు వెనకడుగు వేస్తే చంద్రబాబుకు పైచేయి ఇచ్చినట్టు అవుతుందని భావించే జగన్ మూడు రాజధానుల వైపే తుది అడుగులు వేసేందుకు సిద్ధపడతారనేది నిస్సందేహం..ఇక మిగిలింది ప్రజాధనం అదనపు వ్యయం..

ఈ దశలో రాష్ట్ర ప్రజలు చేయవలసిన ముఖ్యమైన ఆలోచన సాధ్యాసాధ్యాలు..నిధులు ఎక్కడి నుంచి వస్తాయి..అసలు అంతకంటే ముందు ప్రాంతీయ వైషమ్యాలు పెరగకుండా విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది..ఇప్పటికే ఉత్తరాంధ్రను..రాయలసీమను వేరే రాష్ట్రాలుగా విభజించాలనే మాట అక్కడక్కడా మొదలయింది..ఇలాంటి వేర్పాటువాద ఆలోచనలతో అలాంటి మాటలు డిమాండ్లుగా మారి మరిన్ని అవాంఛనీయ పోకడలకు దారితీసే ప్రమాదం ఉంది..అమరావతి..విజయవాడ..గుంటూరు అభివృద్ధి చెందితే సరిపోతుందా..ఉత్తరాంధ్ర..
ముఖ్యంగా విశాఖ అభివృద్ధి మాటేమిటి వంటి కొన్ని ప్రస్తావనలతో అనవసర వివాదాలకు తెరతీస్తున్నాయి కొన్ని శక్తులు..అభివృద్ది చెందాలంటే తప్పనిసరిగా రాజధానిగా ఉండాలా.. బొంబాయిని మించి పూనే..చెన్నైకి ధీటుగా కోయంబత్తూరు.త్రివేండ్రంతో సమానంగా కొచ్చి ఎదగలేదా.. హైదారాబాద్ కు తక్కువ కాకుండా విశాఖ..విజయవాడ..తిరుపతి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అభివృద్ధి దిశగా పరుగులు తీయలేదా. నిజానికి విశాఖ రాజధాని అయితే ఇక్కడి ప్రజల కంటే ఇప్పటికే పెద్దపెద్ద ఆస్తులు..భూములు ఉన్న బడాబాబులకే ఎక్కువ ప్రయోజనమని..ఆ బడాబాబులు కూడా ఎవరన్నది కొద్దిపాటి బుర్రతో ఆలోచిస్తే ఇట్టే తట్టే విషయమే..ఇది ఆవేశ కావేశాలకు..వ్యక్తిగత వైషమ్యాలకు అతీతంగా ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం..కొన్ని శక్తుల ఆధిపత్య పోరుకు ప్రజలు..ప్రజాధనం..రాష్ట్ర అభివృద్ధి సమిధలుగా..ఫణంగా నిలిచే పరిస్థితి ఉత్పన్నం కాకూడదు..ఆలోచించండి..

Credit:- ఇ సురేశ్ కుమార్

Tags: amaravathi special story, chandrababu vs ys jagan, three ap capital names, ys jagan govt