బీఎస్ఎన్ఎల్ కష్టాలు స్వయంక‌ృతమేనా? గట్టెక్కేదెలా?

facebook, twitter, Google, whatsapp
ఒకవైపు జియో, ఎయిర్ టెల్, ఐడియా-వోడాఫోన్ సంస్థలు లాభాలతో దూసుకుపోతుంటే…దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నష్టాలతో కునారిల్లుతోంది. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లతో బీఎస్ఎన్ఎల్ తన సత్తా చాటింది. ల్యాండ్ ఫోన్ కావాలంటే రికమెండేషన్లు, వెయిటింగ్‌లు తప్పేవి కావు.
కానీ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు వచ్చాక బీఎస్ఎన్ఎల్ ప్రభ తగ్గింది. ఇప్పుడు విస్తరణ మాట అటుంచితే.. ఉద్యోగులకు నెల జీతాలు ఇవ్వడానికే నానా తంటాలు పడుతోంది. తాజాగా వచ్చిన వార్త బీఎస్ఎన్ఎల్ ఆర్థికకష్టాలకు అద్దం పడుతోంది. ఆగస్టు నెల జీతాలు ఇంకా క్రెడిట్ కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. జీతాలకు సంబంధించి అధికారుల వద్ద సరైన సమాచారం లేదు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జీతాలు వారం ఆలస్యంగా అందాయి. అలాగే జూలై నెలలో వారం పాటు ఆలస్యంగా జీతాలు చెల్లించారు. తాజాగా ఆగస్టు నెల జీతాలు కూడా ఆలస్యం కానున్నాయి. వీఆర్ఎస్ తో పాటు, 4జీ స్పెక్ట్రం కేటాయింపులు, ఆస్తుల తనఖా వల్ల ఆదాయం రానుంది.

ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో 54 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సన్నద్దమవుతోందన్న వార్త బయటకి వచ్చింది. భారీగా పెరిగిపోతున్న నిర్వహణా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా పదవీ విరమణ వయసును 58 సంవత్సరాలకు తగ్గించింది. 50 సంవత్సరాల పైబడిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇంటికి పంపించడం. దీంతో మొత్తం ఉద్యోగుల్లో 31 శాతం అంటే సుమారు 54,451 మందిపై ప్రభావం కనిపించనుంది. ప్రస్తుతం సంస్థలో మొత్తం ఒక లక్షా 65 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తీవ్ర నష్టాలతో కునారిల్లిన సంస్థ తొలిసారి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో ఉద్యోగులకు ఈ ఏడాది ప్రారంభంలో జీతాల కోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల అప్పు కూడా చేయాల్సి వచ్చింది. మరోవైపు సంస్థ నష్టాలు రూ. 14వేల కోట్లకు చేరాయి. 2018-19లో ఆదాయం తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్లమెంటుకి సమర్సించిన నివేదికలో పలు విభ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.

2015-16లో రూ. 4859, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ,4793 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.7,993 కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.14,202 కోట్లకు నష్టాలు చేరుకున్నాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం నుంచి బీఎస్ఎన్ఎల్ సంస్థకు బకాయిలు రావాలని, అవి చెల్లిస్తే జీతాల సమస్య నుంచి గట్టెక్కవచ్చని ఉద్యోగులు అంటున్నారు.
ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా కస్టమర్లను పెంచుకోగలిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రైవేట్ ఆపరేటర్లకు లాభం చేకూర్చడానికి ప్రభుత్వం కామధేనువు లాంటి బీఎస్ఎన్ఎల్ సంస్థను నష్టాల పాలు చేసిందన్ప విమర్శలు వినిపిస్తున్నాయి.