andhra avatarana day

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు1 న నిర్వహించాలి

మొట్టమొదటగా మీరు నవ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రభావంతమైన ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చినందుకు మనస్పూర్తిగా మరోసారి అభినందనలు తెలుపుతున్నాను (పత్రికాముఖంగా మొదటిరోజే మీకు అభినందనలు తెలిపినది మీ దృష్టికి వచ్చే ఉంటుంది).

1.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేటి వరకూ విభజన తరువాత అవతరణ దినోత్సవం జరపటం ఆపివేసినది. మొదటగా జూన్ 2న ఆ దినోత్సవం జరపబూనగా మా వేదిక నాడే తీవ్రంగా వ్యతిరేకించినది. వ్యవహారికంగా చూస్తే అక్టోబర్ 1 , 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా ఆరోజు పుట్టినరోజుగా, నవంబర్ 1, 1956లో తెలంగాణతో వివాహదినం, అదే జూన్ 2 విడాకుల దినంగా మాత్రమే అవుతుందని,  జూన్ 2 అవతరణ దినోత్సవం చేస్తే ఉద్యమిస్తామని అంటే ప్రభుత్వం మార్చి నవనిర్మాణదీక్షలుగా చేయడం చేసారు. అక్టోబర్ 1న ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా మేము గత ప్రభుత్వాన్ని అనేకసార్లు అడిగాము. స్పందన లేదు. అందువల్ల తమరు ఈ విషయమై తక్షణ చర్య తీసుకుని అవతరణ దినోత్సవం జరపవలసిందిగా కోరుచున్నాము.

2. ఒక భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు అనేకమంది త్యాగాలు చేసారు. పొట్టి శ్రీరాములు గారి అనేకమంది త్యాగంతో మనకో తెనుగురాష్ట్రం ఏర్పడింది. తదుపరి జై ఆంధ్ర ఉద్యమంలో అనేకమంది ప్రాణాలు అర్పించారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేకతరగతి హోదా, విభజన హామీల అమలు ఉద్యమాల్లో కూడా త్యాగాలు చేసారు, ప్రాణాలు అర్పించారు. అలా ప్రాణం త్యాగం చేసిన వారికి, ఉద్యమాలలో బాధలు పడ్డవారికి మీరు ఆరోజు గౌరవం ఇస్తే కూడా బావుంటుంది. నేటివరకూ 48సం.గా వారికి అన్యాయం జరిగింది.

3. ఏపి అభివృద్ధి విషయంపై అనేక విషయాలపై తమరితో సమావేశం కావాలని మా వేదిక ముఖ్య సభ్యులు అందరూ కోరుతున్నారని కనీసం ఒక ఘడియన్నరపైగా సమయం కావాలని మీ అధికార సహాయకుడి గారికి సందేశం పంపించాము. అయితే అంత సమయం వెంటనే ఇవ్వడం సాధ్యం కాదనే విధంగా పరిస్థితి ఉందని అర్ధం అయ్యింది. మీకు సమయం చిక్కినప్పుడే కలుస్తాము. ఇబ్బందిలేదు. అయితే వైద్యం, విద్య, మరియు రైతు సమయస్యలు ఈ మూడిటిపై ముఖ్య దృష్టి పెట్టాలని, అలాగే మీ నవరత్నాలతో పాటు భావితరాల కొరకు మౌలిక సదుపాయాలూ, కాప్టివ్ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. PPAలలో లోపాలను సమీక్షించడం, బిసిలకు సాధికారికత, ఆలాగే కొన్ని పథకాల అమలుపై మీ కృషిని అభినందిస్తున్నాము.

4. అయితే నీటిపారుదల విషయంలో పోలవరం 2021 కల్లా R&R పూర్తిచేసి 150′ వరకూ ప్రాజెక్టులో నీరు నిలబెట్టి పూర్తి చేయాలి. పోలవరం సాధనసమితి, ప్రాజెక్టు జిఒ విడుదల చేయగానే దశాబ్దాల తమ ఆకాంక్ష పూర్తి అయ్యిందని సమితిని రద్దు చేసి మీ నాన్నగారికి అభినందనలు తెలిపిన సమయంలో నేను కూడా నాడు ప్రత్యక్షసాక్షిని.  అయితే నేడు  తెలంగాణ ఇతర ప్రభుత్వాల, ప్రయివేటు వ్యక్తుల కేసులు ప్రాజెక్టుపైన వేళ్ళాడుతున్నాయి. వివాదాలను పరిష్కరించాలి, ముందు తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాము. ఇక రాయలసీమలో అమలులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి, వెలిగొండ అలాగే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. కొత్తగా  గుండ్రేవుల లాంటి మూడు ప్రాజెక్టులు నిర్మించాలి తుంగభద్ర నుంచి hlc కాలువకు సమాంతరంగా మరో వరద కాలువ లాంటిది తవ్వాలి. అయితే తెలంగాణ భూభాగం మీదనుంచి రోజుకి కృష్ణాకి 4టియంసిల ప్రతిపాదన అంటే ఒక్కసారి SYL కాలువ ప్రాజెక్టు విషయంలో ఏమి జరిగిందో పరిశీలించవలసిందిగా కోరుచున్నాము. పత్రికల్లో వచ్చిన వివరాల ప్రకారం అలాంటి కొన్ని ప్రతిపాదనలు ఏపికి  సరికాదనే మా అభిప్రాయం అనేది నిపుణులు,రైతాంగ సంఘాలతో సమావేశం జరిపి ప్రభుత్వానికి నాడే తెలియచేసాము,  ఏపి ప్రాంతం నుంచి తీసుకువెళితే/ substitute చేయగలిగితే మంచిది అని భావిస్తున్నాము. అలాగే అన్నిటికంటే ఆ విషయంలో ముందస్తుగా గోదావరి నదిలో ఏపి నికరజలాల వాటా 1000టియంసిలా లేదా 950నా అనేది తెలంగాణతో అంగీకారంకు రావాల్సి ఉంది. తోటి తెలుగురాష్ట్రంతో ఏపి సఖ్యతతో ఉండటం అవసరం, హర్షణీయం. అయితే ఒప్పందాల సమయంలో తగు జాగురూతతో ఉండాలనేది మా భావన. అలాగే 9,10 షెడ్యుల్, అత్యంత విలువైన ఉమ్మడి ఆస్తులు, ఉద్యోగుల విషయంలో ఒకటి రెండిటిపై ఇంతకు ముందు ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, కొంత ఆలస్యం అయ్యింది, ఇప్పుడు త్వరితగతిన పరిష్కారం కావలసి ఉంది. ఆ విధంగా దృష్టి పెట్టవలసిందిగా కోరుచున్నాము. అలాగే అమరావతి విషయంలో అన్ని భారీ భవంతులు అవసరం లేదనే విధంగా మీ విధానం మంచిదే. అయితే దాన్ని కావాలని వివాదం చేస్తున్న కొందరి ప్రకటనలు బాగాలేవు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 50-100 మంది పనిచేసే నాలుగు హెడ్ ఆఫీసులు నాలుగు జిల్లాలలో పెడితే సరిపోతుందనే సూచన సరికాదు. దానివల్ల లాభం ఉండదు. HODలు రాజధానిలో ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలి. ఉత్పత్తి కేంద్రాలు, సేవాకేంద్రాలు, విద్యాలయ కేంద్రాలు అక్కడ పెట్టి అక్కడ యువతకి ఉపాధి కల్పిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తమరికి తెలుసుగాన ఆ విధంగా దృష్టి పెడతారని భావిస్తున్నాము. అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకూ అభివృద్ధి, అలాగే అమరావతి రాజధాని అభివృద్ధి సమాంతరంగా చేస్తే బావుంటుంది. అన్ని జిల్లాలు, వాటిల్లో వెనుకబడిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలి.

5. రాయతీలతో కూడిన ప్రత్యేకతరగతి హోదా, అన్ని విభజన హామీల కొరకు మీరు మాటమార్చను, మడపతిప్పను అనే కట్టుబడి ఉన్నారు. సంతోషం. అయితే కేంద్రంపై నేడు పరిస్థితి గమనించి సామదాన బేధ దండోపాయ విధానం అవలంబిస్తున్నారని భావిస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఉద్యమాలు చేసినా ఏపి  ప్రభుత్వంకు నిర్మాణాత్మక సూచనలు మాత్రం చేసాము. మనం  నాడు కలసి పనిచేసిన ఉద్యమం మరల గట్టిగా కొనసాగించేముందు మీ గట్టి స్పందన కోసం వేచి చూస్తున్నాము. అన్ని పక్షాలను కలిపి ఉద్యమించాలి కూడా. అయితే  కేంద్రం బడ్జెట్లో ఎపికి మరల అన్యాయం చేసింది. ఫాస్ట్ సిటి వీటికి రాయతీలు ఒక దశాబ్దం ఇస్తామని ప్రకటించింది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు రాయతీలు 2027 వరకూ పొడిగించిన విషయం తమరికి విదితమే. రాష్ట్రాల అధికారాలు కేంద్రం ఒక్కొక్కటి కబళించివేస్తుంది. దాని విషయంలో రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం కాపాడే అందరితో మీరు కలసి పనిచేయండి. దానిలో రాష్ట్రం యావత్తూ మీ వెనుకాల ఉంటుంది. కష్టాలలో ఉన్న ఏపి ప్రభుత్వంపై నేడు (కొత్త ప్రభుత్వం) ఒక్క అవినీతి ఆరోపణ లేకపోయినా, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, అలాగే పోలవరం బాకీలు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతుంది.

6. మన అమ్మభాష విషయంలో అన్యాయం చేయబూనతుంది. మొదటగా ప్రాథమిక స్థాయిలో అమ్మభాషలో చదువుఉండాలి. ఇంగ్లీషు కూడా ఉండాలి. తదుపరి విజ్ఞాన, కంప్యుటర్, సాంఘిక శాస్త్రాలు అభ్యసించిన పిదప విద్యార్ధికి సమయముంటే ఐచ్చికంగా తమిళం, హిందీ, సంస్కృతం లేదా మరో భాష నేర్చుకోవచ్చు. అవి నేర్చుకోవడానికి మనం ఎవ్వరం వ్యతిరేకం కాదు. కానీ హిందీ తప్పనిసరి అని మిగిలిన భాషలు తదుపరి నేర్చుకోవడం విద్యార్ధుల ఇష్టం అనే కేంద్ర రుద్దుడు అనే మూడు భాషల ముసాయిదా విద్యావిధానాన్ని మనం గట్టిగా వ్యతిరేకించాల్సి ఉంటుంది. ఆ హిందీ రాష్ట్రాలలోనే పిల్లలు ఇంగ్లీషు నేర్చుకుంటే మేలు అని హిందీ నుంచి ఇంగ్లీషు మీడియంకు వెళుతున్నారు. వారు వారి అమ్మభాష హిందీ, ఇంగ్లీషు వారికి ఒకే, తప్పనిసరి.  సమయముంటే ఐచ్చికంగా ఒక దక్షిణ భారత దేశ భాష ఉత్తరాదివారు నేర్చుకోవచ్చు. అలాగే మన దక్షిణాదిన కూడా. అది మరచి వారు మనపై వత్తిడి చేయడం తప్పు. ఇది దయచేసి తమరు గమనించగలరు.  అలాగే JEE పరిక్షలు ఇంగ్లీషులో కాకుండా గుజరాతీలో కూడా పెడుతూ తెలుగు, తమిళంలలో నిర్వహించడం లేదు. అలాగే బాంక్, సైన్యం, మరియు అనేక పరిక్షలలో అనేక విభాగాలలో ఇంగ్లీషు కాకుండా కేవలం హిందీ మాత్రుభాషగా ఉన్నవారికి అవకాశం ఇస్తున్నారు. లక్షల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలు మన విద్యార్ధులు కోల్పోతున్నారు. ఇది దారుణం.  మన అమ్మభాషల విషయంలో కూడా తమరిని గట్టిగా స్పందించవలసినదిగా కోరుచున్నాము.