ananthapuram, politics, ysrcp party, congress party,janasena and tdp party

అనంతపురంలో రచకెక్కుతున్నరాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం నాయకులు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సార్లు పర్యటనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఆయన జిల్లాకు వస్తున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం జిల్లాలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికలకు నాయకులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఆయన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక వైసిపి అధినేత జగన్‌ ఇప్పటికే పాదయాత్ర పేరుతో జిల్లాలో పర్యటించారు. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా జిల్లాలో పర్యటించారు. ముఖ్య నేతల పర్యటనలు ఇలా ఉంటే, జిల్లా నాయకుల పార్టీ మార్పులు, చేరికలు మరింత రాజకీయ కాకను పుట్టిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో జిల్లాలో టిడిపి 12 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఆ ప్రాభవాన్ని కోల్పోకుండా 2019లో సైతం అదే ఫలితాలను పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఆపార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి. ఇక ప్రతిపక్ష వైసిపి గతంలో తక్కువ మెజార్టీతో విజయావకాశాలను చేజార్చుకున్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది.

ఆ స్థానాల్లో కేడర్‌ను దగ్గరుకు చేసుకుని గెలుపునకు అవసరమయ్యే అన్ని మార్గాలను నాయకులు వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న జనసేన జిల్లాలో తన ఆధిపత్యం చెలాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మెజార్టీ సీట్లను గెలిపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తే, అదే సామాజిక వర్గానికి చెందిన నేత మహాలక్ష్మి శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వాలని వైసిపి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్టు కోసం మహాలక్ష్మి ఇప్పటికే అధినేత జగన్‌ వద్ద మాట్లాడినట్లు సమాచారం. ఇక టిడిపి నుంచి టికెట్టు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. గతంలో చివరి క్షణంలో టికెట్‌ చేజార్చుకున్న అమిలినేని సురేంద్రబాబు ఈసారైనా టిడిపి గుర్తుపై పోటీ చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. మైనార్టీ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని ఎంపీ జెసి.దివాకర్‌రెడ్డి ఆ సామాజిక వర్గానికి అర్బన్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తే తప్పకుండా విజయం సాధిస్తామని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

హిందూపురంలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ ఘనీ టిడిపి వీడి వైసిపి కండువా కప్పుకోవటంతో ‘పురం’ రాజకీయ ముఖచిత్రం మారింది. ఇదే బాటలో మరికొందరు టిడిపిని వీడి వైసిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సారి హిందూపురం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోటీ చేయరన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బాలకృష్ణ స్థానంలో ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌, లేదా స్వయంగా చంద్రబాబు నాయుడే పోటీ చేస్తారనే వాదనలు వినబడుతున్నాయి. మైనార్టీ ఓటింగ్‌ అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కావటంతో వైసిపి మైనార్టీలకు సీటు కేటాయించటం ఖాయంగా కన్పిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు సమన్వయకర్తగా ఉన్న నవీన్‌నిశ్చల్‌ను కాదని అబ్దుల్‌ ఘనీకి సీటు కేటాయిస్తున్నట్లు పార్టీ కేడర్‌కు పరోక్ష సంకేతాలను చేరవేశారు.

ఘనీ రాకతో ఇంత కాలం పార్టీకి సేవ చేసిన నవీన్‌ నిశ్చల్‌ సందిగ్ధంలో పడ్డారు. టికెట్టు వచ్చి ఖచ్ఛితంగా తాను గెలిచి తీరుతానని భావిస్తున్న తరుణంలో వైసిపి అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితంపైనే ప్రభావం చూపేదిలా తయారు అయ్యింది. తన బలాన్ని నిరూపించుకోవడం కోసం నవీన్‌ నిశ్చల్‌ త్వరలో జనసేన పార్టీలో చేరుతాడన్న ప్రచారం జరుగుతోంది. టికెట్టు రాకున్నా తాను వైసిపిలోనే ఉంటానని నవీన్‌ నిశ్చల్‌ బయటకు చెబుతున్నా, లోపల మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికల దగ్గరపడే కొద్ది జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువ అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Tags: ananthapuram, politics, ysrcp party, congress party,janasena and tdp aprty